29-03-2025 10:13:57 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో శనివారం జనహిత సేవాసమితి 8వ వార్షికోత్సవాన్ని జనహిత సభ్యులు ఘనంగా జరుపుకున్నారు. వార్షికోత్సవంలో భాగంగా స్థానిక తాపీ మేస్త్రి భవనంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించి 112 యూనిట్ల రక్తాన్ని దాతల నుండి స్వీకరించారు. రక్తదాన శిబిరానికి బెల్లంపల్లి సివిల్ జడ్జి జె. ముఖేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై రక్తదానం చేశారు. ప్రజలందరూ రక్తదానానికి ముందుకు రావాలని సూచించారు. రక్తదాతలను అభినందిస్తూ వారికి ప్రశంస పత్రాలను అందించారు.
సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్న జనహిత సేవలు అభినందనీయమని కొనియాడారు. జనహిత సేవాసమితి అధ్యక్షులు ఆడెపు సతీష్ మాట్లాడుతూ 2017 మార్చ్ 29న ప్రారంభమై ఎనిమిది సంవత్సరాలుగా దాతలు, సభ్యుల సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు జనహిత ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు తెలిపారు. వేసవిలో చలివేంద్రాల ద్వారా దాహార్తిని తీర్చడంతో పాటు అన్నదాన కార్యక్రమాల ద్వారా ఇప్పటికీ రూ 23 లక్షల వ్యయంతో కొన్ని వేల మందికి ఆకలి తీర్చడం జరిగిందన్నారు. రక్తదాన శిబిరాలు, నేత్ర దాన కార్యక్రమాలు, ప్రభుత్వాసుపత్రిలో అల్పాహార పంపిణీ కార్యక్రమాలు, కోవిడ్ సమయంలో నిత్యవసర సరుకులు పంపిణీ, ఐసోలేషన్ కేంద్రాల్లో భోజన పంపిణీ, ఇద్దరు నిరుపేద వృద్ధులకు ఇంటి నిర్మాణం, ఆపదలో ఉన్న పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం సహాయ కార్యక్రమాలు, ఉచిత పాలిటెక్నిక్ శిక్షణ, యోగా శిక్షణ, విద్యార్థులకు క్రీడల కోసం ఆర్థిక సహాయం లాంటి సేవా కార్యక్రమాలను జనహిత చేపట్టిందని తెలిపారు.
బెల్లంపల్లి పట్టణంలో నిత్య జనగణమన ఆపరేట్ చేస్తున్న సకినాల రాజేశ్వర్ కు ఉపాధ్యక్షురాలు హానుమండ్ల రమాదేవి రూ 5000 పారితోషకాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు,మాజీ కౌన్సిలర్ గెల్లి రాయలింగు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు కాసర్ల శ్రీనివాస్, కాసర్ల రంజిత్, కార్యదర్శి ఇప్ప రవి, గొడిసెల శేఖర్, పూదరి నగేష్ గౌడ్, దాసరి రంజిత్ గౌడ్, మహిళ ఉపాధ్యక్షురాలు హనమాండ్ల రమాదేవి, సుస్మిత, దాసరి విజయ, కరిష్మా తదితరులు పాల్గొన్నారు.