calender_icon.png 21 January, 2025 | 1:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనధర్మమే పాత్రికేయ ధర్మం

02-10-2024 12:00:00 AM

మాడభూషి శ్రీధర్ :

యం.యస్. ఆచార్య 

శత జయంతి రేపు 

(1924 అక్టోబర్ ౩ జన్మదినం)

ఎంఎస్ ఆచార్య 1958లో ‘జనధర్మ’ వార పత్రికను ప్రారంభించిన జర్నలిస్టు. ఆ తరువాత 1980లో ‘వరంగల్ వాణి’ దినపత్రికను ప్రారంభించిన ఎడిటర్. 1988 మార్చిలో ఆయన షష్టిపూర్తి సందర్భంగా ప్రజల అభిమానుడుగా మన్ననలు పొందిన వార్తా విశేషాంశాల నుంచి ఈ వ్యాసభాగాలను ఈ రచయిత (మాడభూషి శ్రీధర్) చేర్చారు (వరంగల్ వాణి: మార్చి 19, 1988 రిపోర్ట్).

పాఠకుల అభిమానం, మేధావుల శుభాశంసలు ఆశీస్సులై అలరిస్తే నాలుగు దశాబ్దాల పాత్రికేయ ధర్మం జనధర్మమని, వరంగల్లు ప్రజలవాణి వరంగల్ వాణి అనీ, అందరూ అభినందిస్తే నాడు సంపాదకీయాలలో రాసుకున్న సమస్యలే ఇంకా తీరలేదని ఆనాటి సభావేదికపై ఎం.ఎస్. ఆచార్య ఆవేదన వెలిబుచ్చారు. ఆనాటి వార్తా విశేషాలు యథాతథంగా చదవండి.

ఆడా, మగా అనే తేడా లేకుండా  సామాన్యులైన మనుషుల్ని ఊచకోత కోసిన నిజాం పాలకుల మీద పోరాడిన స్వాతంత్య్ర యోధుడు ఎం.ఎస్. ఆచార్య. 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణకు (ఆనాటి హైదరాబాద్ సంస్థానానికి) విముక్తి లభించలేదు. తన చివరి క్షణం దాకా వరంగల్లులో నిలబడి పోరాడారు. ఆచార్య నిజాం దుర్మార్గాలతో ఆత్మరక్షణ కోసం గుంటూరు, విజయవాడకు వలస పోవలసి వచ్చింది.

‘జనధర్మ’ మరచిపోలేని అభిమానం

విభవ ఉగాది నాడు ఆప్యాయతానురాగాలు రంగరించి వరంగల్ పురజనులు కు రిపించిన అభినందన కుసుమాల మాల లు అందుకున్న ఆచార్య ఈ సన్మానానికి ఉబ్బితబ్బిబ్బయినందుకు కొరగాని వారి గా కాకుండా ఉండేందుకు ఆశీర్వదించండి అని వినమ్రంగా విన్నవించారు. జనధర్మ, వరంగల్ వాణి  ఉగాది నాటి అభినందన సభావేదిక నుంచి కూడా వరంగల్ ప్రజా సమస్యలను ఆచార్య వివరించడం విశేషం.

‘పెట్టుబడి లేకపోయినా కట్టుబడి ఉన్న జనజీవన ధర్మ జనధర్మ’ అని విశాలాంధ్ర సంపాదకుడు సి. రాఘవాచార్య, ‘పట్టుదలే వరంగల్ వాణి విజయ రహస్యం’ అని ప్రసిద్ధ జర్నలిస్టు బి.నాగేశ్వరరావు, ‘ఆచార్య పత్రికా రచయితగా, ఎడిటర్‌గా సమర్థుడని’ అని జిల్లా జడ్జి నీలాద్రిరావు అన్నారు.  ‘ప్రజలారా! మీరు ప్రతిస్పందిస్తేనే పత్రికకైనా, ప్రజాస్వామ్యానికైనా విలు వ’ అని ఆచార్య ప్రజలకు ఉద్బోధించారు.

కలెక్టర్ చెంగప్ప అధ్యక్షతన, అభినంద న సమితి ఆధ్వర్యాన దుర్గేశ్వరాలయ మం టపంలో వేదమంత్రాల మధ్య, మంగళ తోరణాలతో ఎం.ఎస్. ఆచార్య దంపతుల ను సన్మానించారు. ఆచార్య మూడు దశాబ్దాలకు పైగా రచించిన సంపాదకీ యాల లో కొన్ని ఎంపిక చేసి ప్రచురించిన సంకలనాన్ని సి.రాఘవాచార్య ఆవిష్కరించారు.

వెలిశాల కనకయ్య, మాచర్ల జగన్నా థం నాయకత్వాన అభినందన సమితి ప్రచు రించిన సంచికను బి.నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఆచార్యను అభినందించడాని కి శాలువో, ఉత్తరీయమో, పూలహారమో చే త పట్టుకుని వివిధ దృక్పథాల, పార్టీల, జీ వన రంగాలకు చెందిన వారు వందలాది మంది క్యూ కట్టి రావడం సభలో విశేషం.

పలికించెడి వారు.. వేరే ఉంటారు-

“నేటి పత్రికా రంగం వ్యాపార రంగం. అఖిలాంధ్ర పత్రికలే జిల్లా స్థాయి, వార్డు స్థాయి పత్రికలుగా మారిపోయాయి. పెట్టుబడి పెరిగిపోయి కట్టుబడి చిత్తశుద్ధి తరిగి పోయాయి” అని విశాలాంధ్ర సం పాదకుడు సి.రాఘవాచార్య విమర్శించా రు. “నేటి ప్రజాస్వామ్యంలో నాలుగో మూలస్తంభం అని పొగడ్త అందుకుంటు న్నా పలికించెడివాడు రామభద్రుండట అ న్నట్టు పత్రికలను పలికించేది మరెవరో అ నీ, ఇతర పెట్టుబడి వ్యాపారాలకు రక్షణ కోసం, సమాజంలో ప్రతిష్ఠ కోసం పత్రికలను పెడ్తున్నారని” ఆయన అన్నారు.

“ఇదివరకు జాతీయోద్యమ కాలంలో ఏదో చె ప్పవలసి ఉన్నది కనుక పత్రికలు పెట్టారు. ఇప్పుడు ప్రతి అంగుళం అమ్ముకొనడానికే పత్రికలు పెడుతున్నారు” అని విమర్శించారు. “జనధర్మ పేరులో జనం ఉన్నారు. ధర్మమూ ఉన్నది. ప్రయోజనం ఉన్నది. కా ని, స్వప్రయోజన ధర్మ కాదు.

ఎందుకంటే, ఆచార్య తొలి సంపాదకీయంలో వ్యక్తం చేసిన ప్రతిభకు బద్ధులై 30 ఏళ్ళుగా నిబద్ధులై ఈనాటి అసాధారణ పరిస్థితులలో కూడా జనధర్మంగా ప్రజలకు సేవచేస్తూ వారి వాణిగా ప్రశస్తి పొందడమే అందుకు నిదర్శనం” అని అన్నారాయన. “కవులను పలకరిస్తే ఇది నా యుగం, ఇది నా రోజు అనే కవులు ఉన్నారు. కాని ఆ ప్రాంత ప్రజల హృదయ స్పందన తనదిగా భావించి ఎలాంటి భేషజం లేకుండా ప్రజావాణికి ఆచార్య ఒక డిస్ట్రబెన్స్ లేని మైకుగా నిలిచారు”.

జన జీవన ధర్మ

“వరంగల్లు -తెలంగాణ ప్రాంతానికి జీవనాడి. ఏ ఉద్యమాలు జరిగినా, మరే వివా దాలు చెలరేగినా, వాటికి వరంగల్ కేంద్రమైంది. వేదాలు, వాదాలు, వివాదాలు ఇక్కడ పుట్టాయి. పట్టణాలు, పెద్దవుతున్న కొద్దీ ఒకరి కొకరు సంబంధం లేని లక్షణం పెరుగుతున్నది. అటువంటి సందర్భాల్లో ఒక వార్తా పత్రిక సంపాదకుడిని గుర్తుంచుకుంటారా? లేదు. ఎందుకంటే, పత్రికా రంగాన్ని వ్యాపార నీతి శాసిస్తున్నది.

పత్రి కా స్వేచ్ఛ గురించి మాట్లాడానికి హాయిగా ఉంటుంది. రాయడానికి మహా ఆవేశంగా ఉంటుంది. కాని, వాస్తవం ఎవరికి? ఎంత స్వేచ్ఛ ఉంది? నిత్యం అజ్ఞాతంగా ఎవరు శాసిస్తుంటారు? ఎవరికి అనుగ్రహం, ఎవరికి ఆగ్రహంగా చెలామణి అవుతుంది. పాఠకులకు తెలియదు. ఆచార్య వలె అసిధారా వ్రతంలా పత్రికలు 30 ఏళ్ల నుంచి నడవడం చాలా అరుదు” అని రాఘవాచారి అభిప్రాయపడ్డారు.

దబాయించడం, క్రాస్ ఎగ్జామిన్ చేసే హక్కు

“తన దగ్గరకి వచ్చిన వ్యక్తిని దబాయించడం, క్రాస్ ఎగ్జామిన్ చేయడం, ప్రశ్నించే హక్కు ఒక్క జర్నలిస్టుదే అని వ్యవహరించడం ఆచార్య వ్యక్తిత్వంలో ఒక లక్షణం. అయితే, ఈ ప్రశ్నలు- వచ్చిన వ్యక్తి అవగాహనను పరిశీలించడానికే, అది వృత్తి ధర్మంలో భాగమేనని గమనించాలని” రాఘవాచార్య ఆన్నారు. “కోర్టుల్లో న్యాయం సత్య ప్రమాణం కాదు, సాక్ష్య ప్రమాణం. కాని సమాజంలో వ్యక్తి నుంచి నిజాన్ని రాబట్టడానికి జర్నలిస్టు ప్రశ్నించడమే మార్గం” అన్నారాయన.

జనధర్మ పట్టుదలే ‘వరంగల్ వాణి’ విజయ రహస్యం

“జీవితంలో ఎదురైన ప్రతి సవాలును ఎదుర్కొని దాన్ని అవకాశంగా మలచుకుని పత్రిక నడిపిన జర్నలిస్టు ఆచార్య” అని రాఘవాచారి ప్రశంసించారు. జాతీయోద్యమానికి ఆలంబన అయి పత్రికలు నడపలేని స్థితిలో ఆయన పత్రిక ప్రారంభించారు. కానీ, చిత్తశుద్ధి, -ప్రజల నుడికారం, సహజత్వం, ఆత్మీయతతో పత్రిక నడిపి పాఠకునితో మమేకం అయిన పత్రికలు మాత్రమే ఈ పోటీని తట్టుకుని నిలబడతాయి” అన్నారాయన.

ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల పేర అనే విభక్తులను దుర్వినియోగం చేస్తున్నారనీ, తానే వారికి ప్రతినిధిని అని చెప్పుకునే అవకాశం ఆ ఒక్క పత్రికలకే ఉందని కొందరు భావిస్తున్నారని ఆయన విమర్శించారు. ఆంగ్ల, హిందీ భాషల్లో పండితుడు కాకపోయినా గాంధీ జర్నలిస్టుగా రాణించారనీ, దానికి కారణం ఆయన చిత్తశుద్ధి ప్రజలకు హత్తుకునే రీతిలో చెప్పగలిగే సమర్థత అని రాఘవాచారి అన్నారు.

పత్రికా భాషలో శబ్దాల్బణం 

ద్రవ్యోల్బణం అనే పదాన్ని కొత్తగా మార్చి శబ్దాల్బణం అనే కొత్త ప్రయోగం చేసారు రాఘవాచారి గారు. తెలుగు జర్నలిజంలో ప్రస్తుతం శబ్దాల్బణం ఎక్కువైపోయిందని ప్రజా జీవన భాషతో సంబంధం లేని పదాల్ని విపరీతంగా వాడు తూ సహజత్వాన్ని కోల్పోయారని రాఘవాచారి విమర్శించారు. శతకం కాని, సహజశై లితో సూటిగా రాయడం, సహజంగా ఆలోచించడం ఆచార్య అలవాటంటూ రాఘవా చారి అన్నారు. ఘాటుగా విమర్శించినా ప్రజలు ఆదరించినందుకు తోటి పత్రిక వాడిగా గర్విస్తున్నాను అన్నారాయన.

ఆచార్య కృషి వృథా కాలేదు

అక్షరాస్యత చైతన్యం పెరుగుతున్న రోజు ల్లో భారీ పెట్టుబడి పత్రికలతో పాటు స్థానిక పత్రికలు కూడా అవసరమని ప్రసిద్ధ జర్నలి స్టు, వర్కింగ్ జర్నలిస్టుల నాయకుడు  బి. నాగేశ్వరరావు అన్నారు. వరంగల్‌లో పెండెం శ్రీనివాసరావు సేవలను నాగేశ్వరరావు ప్రస్తుతించారు. 30 ఏళ్లనుంచి జనధర్మను నిర్వి రామంగా నడపడానికి ఆచార్య అష్టకష్టాలు పడ్డా ఆ కృషి వృధాపోలేదని నేటి సన్మానం నిరూపిస్తున్నదని నాగేశ్వరరావు అన్నారు.

వ్యాపారాన్ని పెంచుకోవడానికి పత్రికలు పెడుతున్నారని, బిర్లా వంటి సంపన్న వర్తకులు ప్రధాని మారితే తమ పత్రిక సంపాదకుడిని మార్చి ప్రభుత్వం కనుసన్నలలో మెలిగేందుకు తాపత్రయ పడుతున్నారని, నీతికి నిజాయితీకి, నిష్పాక్షికతకు వరంగల్ వాణి, జనధర్మ వంటి పత్రికలే నిలువ నీడనిస్తున్నాయని నాగేశ్వరరావు ప్రశంసించారు. నిర్మొహమాటి అయిన ఆచార్య పత్రికలను ఆదరించిన వరంగల్ ప్రజలను ఆయన అభినందించారు.

నిజాలు రాయడంలో కూడా పత్రికలు కొన్నిసార్లు కొందరికి తీవ్ర నష్టం కలిగించగలవని జిల్లా కలెక్టర్ చెంగప్ప అన్నారు. ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని నిజాలను సైతం నిష్పాక్షికంగా ఉపయోగించే ధోరణి అవసరం అని చెంగప్ప సూచించారు.

వరంగల్ వాణి, జనధర్మ పత్రికల సేవలను,ఆచార్య రచనలను ప్రస్తుతిస్తూ పత్రికాధిపతిగా విమర్శలు చేస్తూ ప్రశ్నలు కురిపిస్తూ కూడా ఆచార్య విభిన్న జీవన రంగాలకు చెందిన ఇంతమంది ప్రజల ఆదరాభిమానాలు అందుకోవడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమని మెచ్చుకున్నారు.

ఆచార్య ప్రసంగంలో పేర్కొన్న వరంగల్, వరంగల్ వాణి సమస్యలను, సూచనలను సహృదయంతో పరిశీస్తానని ఆయన హామీ ఇచ్చారు. కలెక్టర్ చెంగప్ప వెండి జ్ఞాపికను ఆచార్యకు బహూకరించారు. ప్రముఖ ఆర్టిస్టు  బి. రవివర్మ గీసిన చిత్రపటాన్ని జడ్జి  నీలాద్రిరావు బహూకరించారు.

సమస్యలను ఎత్తి చూపడానికే..

ప్రజా ప్రయోజన సమాచారాన్ని ప్రజలకు అందించడానికి పత్రికలను వాడుకోవాలని, ఆచార్య సమస్యలను ఎత్తిచూపడానికి పత్రికను ఉపయోగించారనీ జిల్లా జడ్జి నీలాద్రిరావు ప్రశంసించారు. చందాదారులే మరికొందరినీ చందాదారులను చేర్చి పత్రిక ఆర్థిక పుష్టికి దోహదం చేయాలని ఆయన సూచించారు. ముదిగొండ,  ముడుంబై రామానుజాచార్య వేదోత్తమంగా ఆచార్య దంపతులను ఆశీర్వదించా రు.

పలువురు అభిమానులు వివిధ పార్టీల నాయకులు, మిత్రులు ఆచార్యకు పూలహారాలు సమర్పించి గాఢాలింగనం చేసుకు న్నారు, పాదాభివందనం చేశారు. ఎం. ఎస్. ఆచార్య, రంగనాయకమ్మ దంపతులను ఆహ్వాన సంఘాధ్యక్షుడు, సన్మాన సభ సారథి వెలిశాల కనకయ్య, ఆయన సతీమణి సంప్రదాయ సిద్ధంగా సత్కరించారు. నూతన వస్త్రాలను బహూకరించారు. సన్మానసభకు ఆహూతులైన అందరికీ మిఠాయి పంచారు.

తొలుత కనకయ్య సన్మాన కార్యక్రమ సంకల్పాన్ని, సహకరించిన మిత్రుల కృషిని వివరిస్తూ స్వాగత ప్రసంగం చేశారు. డాక్టర్ ఇందుర్తి ప్రభాకరావు ఆహూతులను పరిచయం చేశారు. అంతకుముందు డాక్టర్ వెంకటాచార్య పంచాంగ శ్రవణం చేశారు.  ఆచార్య దంపతులను మంగళ తూర్యరావాలతో స్వాగతం పలుకుతూ సభావేదిక వైపు నడిపిస్తున్నపుడు మిత్రులు, అభిమానులు, పాఠక లోకం రెండువైపులా నిలిచి అభివందనాలు చేశారు.