17-04-2025 12:23:40 AM
ఈ నెల 20 నుంచి మే 5 వరకు కార్యక్రమం
వక్ఫ్ సవరణ చట్టంపై అపోహలు తొలగించేందుకే
హైదరాబాద్ (విజయక్రాంతి): వక్ఫ్ సవరణ చట్టంపై వచ్చిన అపోహలను తొలగించడానికి ఏప్రిల్ 20 నుంచి మే 5 వరకు బీజేపీ ఆధ్వర్యంలో ‘జన జాగరణ అభియాన్’ కార్యక్రమం చేపట్టనున్నట్టు వక్ఫ్ అవగాహన రాష్ట్ర కన్వీనర్ గండి మనోహర్ రెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత వక్ఫ్ చట్టంలోని లొసుగులను తొలగిస్తూ, మెరుగైన చట్టాన్ని తీసుకురావడం కోసమే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు వాస్తవాలు చెప్తామన్నారు. ఏప్రిల్ 17న వక్ఫ్‌పై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహిస్తామని, దీనిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు.
2014 ఎన్నికల్లో ముస్లింల ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ చట్టాన్ని వక్రీకరించడమే కాకుండా వక్ఫ్ బోర్డు ద్వారా సమాజాన్ని మతపరంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. ముస్లింల వెనుకబాటుతనానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ సవరణ బిల్లుకు అడ్డు తగిలిందని విమర్శించారు. కొంతమంది రాజకీయ నాయకులు వక్ఫ్ భూముల ద్వారా ఆస్తులను కొల్లగొట్టి సామాన్య ముస్లింలకు కనీస అవసరాలు దక్కకుండా చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ మోర్ఛా రాష్ట్ర అధ్యక్షుడు అప్సర్ పాషా, హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ రావు పాల్గొన్నారు.