calender_icon.png 11 October, 2024 | 8:45 AM

జమ్ములమ్మ అమ్మవారు

11-10-2024 12:00:00 AM

గద్వాల జిల్లా జమ్మిచేడు ఊరు పేరు చెబితే చాలు, చాలామందికి శక్తివంతమైన ‘జమ్ములమ్మ అమ్మవారు’ స్ఫురణకు వస్తుంది. ఈ గ్రామ శివారులోని ఒక వ్యవసాయ భూమిలో ఓ రైతు పొలం దున్నే వేళ స్వయంభువుగా వెలసిన దేవత కాలం గడుస్తున్న కొద్దీ అంతకంతకూ భక్తుల విశ్వాసాన్ని పొందుతున్నది. ద్వాపరయుగ కాలంలో పాండవులు ఈ ప్రాంతాన్ని సందర్శించినట్టు అమ్మవా రిని పూజించినట్టు ప్రజలు విశ్వసిస్తారు.

గద్వాల సంస్థానాధీశులతోనూ బ్రహ్మాండంగా పూజలందుకున్న ఈ అమ్మవారి ఆలయ ప్రాంగణంలోనే పరశురాముడూ కొలువై ఉండడం విశేషం. ఒక సాధారణ రాయి రూపంలో భక్తులకు దర్శనమిచ్చి అనూహ్య మహిమను ప్రదర్శించిన అమ్మవారిగా జమ్ములమ్మ నడిగడ్డ ప్రజలకు ఇలవేల్పుగా మారింది.

ప్రతి మంగళ, శుక్ర వారా ల్లో భక్తులు అమ్మవారికి మొక్కులను చెల్లించుకుంటారు. ఈ సందర్భంగా పెద్ద జాతరనే జరుగుతుంది. ప్రతి ఏడాది ఫిబ్రవరిలో (మాఘశుద్ద ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు) అమ్మవారి బ్రహోత్సవాలు జరుపుతారు. 

ఆదిపరాశక్తి అవతారం

ఆదిపరాశక్తియే స్వయంగా జమ్ములమ్మగా అవతరించినట్టు స్థానికులు విశ్వసిస్తున్నారు. జమ్మిచేడులో ఆలయం మూడువైపుల చెరువు మధ్యలో జమ్ములమ్మ కొలువై ఉంది. ఒక రైతు తన వ్యవసాయ భూమిలో పొలం దున్నుతుండగా, గడెము లోతుగా తెగలేదు. ఒక పొడవాటి రాయిని దానికి కట్టి పనులు చేసుకొన్నాడు. రాయిని గడెంకు అలాగే కట్టి పెట్టి ఇంటికి వెళ్లిపోయాడు. తిరిగి మరుసటి రోజు వచ్చి చూడగా, గడెంకు కట్టిన రాయి కనిపించలేదు.

వెతికితే, కిందటి రోజు అది ఎక్కడైతే లభించిందో అక్కడే కనిపించడంతో ఆశ్చర్యపోయాడు. రాయిని తిరిగి తెచ్చి గడెం కట్టి సాగు పనులు చేశాడు. ఎవరు రాయిని తీస్తున్నారో చూడాలని అర్ధరాత్రి వేళ పొలం దగ్గరకు వచ్చి చూశాడు. రాయి అందమైన దేవతా రూపం దాల్చింది. తెల్లని వస్త్రాలలో యథాస్థానానికి వచ్చి తిరిగి రాయిగా మారింది. మర్నాటి రాత్రి గ్రామస్తులంతా అదే సమయానికి పొలం దగ్గరకు వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. దాంతో అమ్మవారికి వారు గుడి కట్టారు. 

వాళ్ల కండ్లు పోయి, మళ్లీ వచ్చాయి!

దేవస్థానం చుట్టూ ప్రాంతమంతా రిజర్వాయర్‌గా మార్చారు. పిజెపి కుడి కాలువ నీరును నిలువ చేశారు. 1983లో అమ్మవారి దేవస్థానం ముంపునకు గురి కాకుండా ఉండటానికి ఆలయాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలనుకు న్నారు. మూల విగ్రహం అడుగు భాగం ఎంత తవ్వినా అందలేదు. అప్పుడు కొందరు విగ్రహాన్ని బలవంతంగా కదపడంతో వారి కండ్లు పోయాయట. గ్రామపెద్దల జోక్యంతో విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం ఆపారు. దాంతో వారికి తిరిగి కండ్లు వచ్చాయని ప్రతీతి. అమ్మవారి ఈ మహిమను కండ్లారా చూసిన అప్పటి అధికారులు రిజర్వాయర్ నీరు రాకుండా కట్టను బలంగా నిర్మించినట్టు తెలుస్తున్నది.

అక్కడే పరశురాముని ఆలయం

బ్రహోత్సవాల వేళ పౌర్ణమి ముందు వచ్చే మంగళవారం అమ్మవారిని సంప్రదాయ పద్ధతిలో పుట్టినిల్లయిన గుర్రంగడ్డ గ్రామం నుండి జమ్మిచేడు దేవస్థానం వరకు ఊరేగింపుగా తెస్తారు. అమ్మవారి దర్శనం కోసం గద్వాల జిల్లా ప్రజలేకాక తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచీ భక్తులు అధిక సంఖ్యలో మొక్కులు తీర్చుకోవడానికి వస్తుంటారు. తొలుత ఇక్కడ వెలసిన నాగులమ్మను, ముక్కిడ మ్మను దర్శించుకోవడం ఆనవాయితీ. ఆల యం ఎదురుగా పరుశరాముడి గుడి ఉంది. పాడిపంటలు బాగా పండాలని దీవించమని అమ్మవారిని భక్తులు వేడుకుంటారు. 

 పి. రాము, 

విజయక్రాంతి, గద్వాల (వనపర్తి)