calender_icon.png 20 November, 2024 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సవాలుగా జమ్మూ ఉగ్రదాడులు

02-08-2024 12:00:00 AM

ఐ.వి.మురళీకృష్ణ శర్మ :

మంచు అందాలతో ప్రజల మనసులను దోచుకునే జమ్మూ, కశ్మీర్‌లో రక్తసిక్త ఘటనలు తగ్గిపోయి ఆహ్లాద వాతావరణం ఏర్పడుతుందనే ఆశలు అడియాసలవుతున్నాయి. ఆర్టికల్ 370 రద్దుతో రాష్ట్రంలో ఏదో అద్భుతం జరుగుతుందని బీజేపీ నమ్మబలుకుతున్నా వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. గతంలో ఉగ్రవాద ఘటనలు అధికంగా కశ్మీర్ లోయకే పరిమితం కాగా, ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ జమ్మూలోనూ జడలు విప్పుతూ బీజేపీకి సవాళ్లు విసురుతున్నాయి. రాష్ట్రంలో టెర్రిస్టుల దాడులను మోడీ ప్రభుత్వం తక్కువ చేసి చూపించేందుకు ఎంత ప్రయత్నిస్తున్నా శీతల రాష్ట్రం నిప్పుల కుంపటిలా మండుతున్నదని గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి.

  గత వారం పార్లమెంటులో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ జవాబిస్తూ, ఉగ్రవాదంపై ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చినప్పటి నుండి జమ్మూ, కశ్మీర్‌లో ఉగ్రవాద ఘటనలు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. ‘జైలు లేదంటే.. నరకానికే’ అంటూ ఆయన ఉగ్రవాదులను హెచ్చరించారు. మంత్రి మాటలు వినసొంపుగా ఉన్నా లోయలో తుపాకీ చప్పుళ్లు, బాంబు దాడుల వార్తలు పత్రికల్లో పతాక శీర్షికలవుతున్నాయి. 2004-- యూపీఏ హయాంలో 7,217 ఉగ్రవాద ఘటనలు జరగ్గా, 2014 తర్వాత అవి 2,259కి పడిపోయాయని, ఆర్టికల్ 370 రద్దు తర్వాత 900 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, రాళ్లు రువ్వుడు ఘటనలు తగ్గాయని ఆయన సెలవిచ్చినా భద్రతా దళాలతోపాటు పౌరులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ప్రధానంగా జమ్మూ ప్రాంతంలో రెచ్చిపోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.

మూన్నాళ్ల ముచ్చటేనా?

కేంద్రంలో రెండోసారి పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోదీ ప్రభుత్వం 2019 ఆగస్టులో జమ్మూ, కశ్మీర్‌లో ఆరిక్టల్ 370 రద్దు చేయడంతో అక్కడ ప్రశాంతత ఏర్పడుతుందనే వాతావరణాన్ని సృష్టించింది. భద్రతాదళాల చేతిలో అన్నీ చక్కబడుతున్నట్టు కని పించినా అది మూన్నాళ్ల ముచ్చటే అ య్యింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకన్నా ప్రపంచాన్ని అతులాకుతలం చేసిన కోవిడ్ మహమ్మారి రాష్ట్రంలో ఉగ్రవాద ఘటనలు తగ్గడానికి ప్రధాన కార ణం. లాక్‌డౌన్ నిబంధనల సడలింపు త టర్వాత ఎప్పుడైతే ప్రజా జీవనం తిరిగి ప్రారంభమైందో అప్పటి నుండి ఉగ్రవాద కార్యక్ర మాలూ తిరిగి పుంజుకున్నాయి. 370 ఆర్టికల్ రద్దు తర్వాత భద్రతాదళాలు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఉగ్రవాద ఏరివేత లక్ష్యంగా విచారణ పేరుతో పౌరులను వేధించడమూ ఎక్కువైంది. 

కొత్త ప్రాంతాలకు విస్తరణ

ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్‌లో పరిస్థితులు మెరుగవుతాయన్న బీజేపీ ప్రభుత్వం అంచనాలు తప్పాయి. గతంలో కశ్మీర్ లోయతో పోలిస్తే జమ్మూలో ఉగ్రవాద ఘటనలు తక్కువగా ఉండేవి. 2023లో జమ్మూలోని పూంచ్, రాజౌరీ జిల్లాల్లో ఉగ్రదాడులు జరగ్గా, 2024లో కొత్తగా దోడా, కతువా, రిసై జిల్లాలకు పాకాయి. రాష్ట్రంలో జరిగిన ఉగ్రవాద ఘటనలను పరిశీలిస్తే జమ్మూలో 2023లో 44 శాతం, 2024లో ఇప్పటి వరకూ 40 శాతం ఘటనలు చోటు చేసుకున్నాయి. 2009 తర్వాత జమ్మూలో జరిగిన ఘటనల్లో ఇవే అధికం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉగ్రవాదులు కశ్మీర్ లోయలో ప్రధానంగా పండిట్లను, మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని దాడులు ప్రారంభించారు. విదేశీ ఉగ్రవాదులు స్థానికుల్లో కొందరిని ఆకర్షించి జమ్మూలో దాడులను తీవ్రతరం చేశారు. ఆర్టికల్ రద్దుతో కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని, తిరిగి స్వస్థలాలకు వెళ్లవచ్చని పండిట్లు ఆశిస్తున్న తరుణంలో ఉగ్రవాదులు దాడులతో వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ నేప థ్యంలో గతంలో భద్రతాదళాలు లక్ష్యంగా జరిగే దాడులు ఇప్పుడు సాధారణ పౌరుల లక్ష్యంగా మారడంతో ప్రభుత్వానికి పరిస్థితులు కత్తిమీద సాములా మారాయి. 

పెరుగుతున్న దాడులు

గత రెండు దశాబ్దాల ఉగ్రవాద ఘటనల లెక్కలను పరిశీలిస్తే ఈ సంవత్సరంలో ప్రతి నెలా  పెరుగుతూనే ఉన్నాయి. గత రెండు సంవత్సరాల ఉగ్రవాద ఘటనలతో పోలిస్తే ప్రస్తుత జులై నెలలో  సంభవించిన మరణాలే అధికం. ఈ సంవత్సరం మృతుల్లో పౌరులు 26 శాతం ఉన్నారు. 2005 తర్వాత ఇదే అధికం కావడం దురదృష్టకరం. గత జూన్‌లో ఉగ్రవాద ఘటనల్లో 21 మంది మృతి చెందారు. మాతా వైష్ణోదేవి ఆలయం దర్శనానికి కాట్రా వెళ్తున్న భక్తుల బస్సుపై దాడి చేసిన ఘటనలో 9 మంది మృతి చెందడం సంచలనం రేపింది. జూలైలో గతంలో ఎప్పుడూ లేనట్టుగా 26 మంది మృతి చెందారు. 2001-- మధ్య దాడులను జిల్లాల వారీగా గమనిస్తే కశ్మీర్ ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో అధికంగా ఉన్నా, ప్రత్యేకించి ఈ సంవత్సరం జమ్మూ పరిధిలోని దోడా, కుతువ, రిసై జిల్లాల్లో ఉగ్ర ఘటనలు పెరిగాయి. గతంలో జమ్మూలో పూంచ్, రాజౌ రీ జిలాల్లోనే ఉగ్రవాద కదలికలు ఉండేవి. ఇప్పుడివి ఇతర ప్రాంతాలకూ విస్తరించాయి.

ఈ నేపథ్యంలో జమ్మూ రీజి యన్ లో పెద్ద ఎత్తున కేంద్ర భద్రతాదళాల బలగాల పెంపుతో ఎప్పుడేమి జరుగుతుందో అన్న ఆందోళనతో స్థానికులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పలు ప్రకటనలు చేసినా రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒకచోట ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గత సంవత్స రం పార్లమెంటుకు కేంద్రం ఇచ్చిన సమాచారం మేరకు జమ్మూ, కశ్మీర్‌లో 2019లో 153, 2020లో 126, 2021లో 129, 2022లో 125, 2023లో 42 ఉగ్రవాద దాడులు జరిగాయి. ఉగ్రవాద ఘటనల్లో 2019లో 80 మంది, 2020లో 118, 2021లో 100, 2022 117, 2023లో 20 మంది భద్రతాదళ సిబ్బంది చనిపోయారు. ఉగ్రవాద దాడుల్లో 2019లో 44 మంది, 2020లో 38, 2021లో 41, 2022లో 31, 2023లో 13 మంది పౌరులు మృతి చెందారు. మోడీ ప్రభుత్వం యూపీఏ పాలనతో పోలుస్తూ ఉగ్రవాద ఘటనలు తగ్గాయని తమను తాము సమర్థించుకుంటున్నది కానీ, వాస్తవానికి జమ్మూ, కాశ్మీర్‌లో తీవ్రవాదుల దాడులు జరుగుతూనే ఉన్నాయి.

బీజేపీకి ఎదురుదెబ్బ

ముస్లిమేతరులు అధికంగా ఉండే జ మ్మూలో రాజకీయంగా బలపడాలని బీజేపీ ప్రణాళికలు ఉగ్రవాద దాడులతో భగ్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో నియోజక వర్గాల పునర్విభజన పేరుతో జమ్మూలో అసెంబ్లీ సెగ్మెంట్లను పెంచి లబ్ధి పొందాలని బీజేపీ చూస్తున్నది. 90 స్థానాలున్న రాష్ట్రంలో జమ్మూలో 43, కశ్మీర్‌లో 47 స్థానాలు ఉన్నాయి. గతంలోకంటే కశ్మీర్‌లో 1 స్థానం, జమ్మూలో 6 స్థానాలు పున ర్విభజనలో పెరిగాయి. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ జమ్మూ, ఉదంపూర్‌లో, ‘ఇండియా’ కూటమిలోని నేషనల్ కాన్ఫరెన్స్ శ్రీనగర్, అనంత్‌నాగ్ స్థానాల్లో, బారాముల్లాలో ఇండిపెండెంట్ గెలిచారు. జమ్మూలో బీజేపీ రెండు స్థానా లు గెలిచినా ప్రస్తుతం ఉగ్రవాదులు సాధారణ ప్రజలపై చేస్తున్న దాడులను అరికట్ట డంలో కేంద్రం విఫలమైందని జమ్మూ వాసులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. భద్ర తా బలగాల సాయంతో కశ్మీర్‌లో కట్టడి చేసి రాష్ట్రంలో రాజకీయంగా బలపడదామనుకున్న బీజేపీకి జమ్మూలోని ఘటనలు ఆం దోళన కలిగిస్తున్నాయి. కశ్మీర్‌ల్లో బీజేపీకి సానుకూలత లేదు. దీనికి తోడు జమ్మూలోనూ ప్రజాగ్రహం పుట్టి ముంచుతుందే మోనని బీజేపీ నేతలు జంకుతున్నారు.

రాష్ట్రంలో ప్రత్యేకంగా జమ్మూ రీజియన్‌లో ఉగ్రవాద ఘటనలు కేంద్రంలోని మోడీ సర్కార్‌కు గట్టి సవాలు విసురుతున్నాయి. అధికార బలంతో, బలగాలతో నిర్ణయాలు తీసుకునే బదులు ప్రజల మన్ననలు పొందేలా చర్యలు తీసుకుంటే బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం కలుగుతుంది. అంతేకాని, ఇప్పటికే రావణ కాష్టంలా మండుతున్న జమ్మూ, కశ్మీర్ సమస్య అగ్గితో చలి కాచుకోవాలని చూస్తే మాత్రం ఆ మంటలకే బలికావాల్సి వస్తుందేమో!

వ్యాసకర్త: పొలిటికల్ ఎనలిస్ట్, 

‘పీపుల్స్ పల్స్’ సర్వే సంస్థ