- కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర
- కోవింద్ కమిటీ సిఫార్సులకు అంగీకారం
- వచ్చే శీతకాల సమావేశాల్లో పార్లమెంటుకు బిల్లు!
- రెండు దశల్లో అమలుకానున్న ప్రక్రియ
- కమిటీ సిఫార్సుల అమలుకు ప్రత్యేక బృందం ఏర్పాటు
- చంద్రయాన్-4 మిషన్‌కు రూ.2,104 కోట్లు
- శుక్రయాన్, గగన్‌యాన్ విస్తరణకు ఆమోదముద్ర
- నెక్స్ జనరేషన్ లాంచ్ వెహికల్ ప్రయోగానికి పచ్చజెండా
- గిరిజన గ్రామాల అభివృద్ధికి రూ.79,156 కోట్లు
- సాగు రంగంలో పీఎం పథకానికి రూ.35 వేల కోట్లు
- రబీ సీజన్‌లో ఎరువులపై రూ.24,474 కోట్ల సబ్సిడీ
- క్యాబినెట్ భేటీలోని అంశాలను వెల్లడించిన కేంద్రమంత్రి వైష్ణవ్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ రూపొందించిన నివేదికకు పచ్చజెండా ఊపింది. వచ్చే శీతకాల సమావేశాల్లో ఒకే దేశం, ఒకే ఎన్నిక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశమున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
క్యాబినెట్ భేటీ అనంతరం కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ.. జమిలి ఎన్నికలను రెండు దశల్లో అమలు చేస్తామని తెలిపారు. జమిలి ప్రతిపాదనకు 80 శాతం కంటే ఎక్కువమంది మద్దతు లభించిందని వైష్ణవ్ నొక్కిచెప్పారు. కమిటీ సిఫార్సులను స్వీకరిస్తున్న సమయంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధానన్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులతో సహా 32 పార్టీలు జమిలి ఎన్నికలను సమర్థించారని వెల్లడించారు. ముఖ్యంగా యువత దీనికి అనుకూలంగా ఉందని తెలిపారు. అన్ని ఎన్నికలకు ఉమ్మడి ఓటర్ల జాబితాను రూపొందిస్తామని, కోవింద్ ప్యానెల్ సిఫార్సులను అమలు చేసేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఎలా అమలు చేస్తారు?
మొదటి దశగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో నిర్వహించాలని, ఇందుకు రాజ్యాంగ సవరణకు రాష్ట్రాల ఆమోదం అవసరం లేదని కమిటీ నివేదికలో పేర్కొంది. రెండో దశలో లోక్‌సభ, అసెంబ్లీలు, స్థానిక సంస్థలనూ జమిలిలో భాగం చేస్తారు. సాధారణ ఎన్నికలు నిర్వహించిన 100 రోజుల్లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశముంటుంది. ఇందుకు మాత్రం ప్రత్యేక రాజ్యాంగ సవరణ అవసరమవుతుంది. అంటే పార్లమెంట్‌తోపాటు సగం కన్నా ఎక్కువ రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంటుంది.
ఒకే దేశం, ఒకే ఎన్నిక ప్రక్రియ అమల్లోకి రావాలంటే 18 రాజ్యాంగ సవరణలను ప్యానల్ సిఫార్సు చేసింది. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఇచ్చిన హామీ మేరకు మోదీ 2.0 ప్రభుత్వంలో జమిలి ఎన్నికలపై కోవింద్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీ ఈ ఏడాది మార్చిలో సమర్పించింది. గత నెల నుంచి జమిలిపై బీజేపీ తరచూ వ్యాఖ్యానిస్తూ వస్తోంది. పంద్రాగస్టు ప్రసంగంలో జమిలి అవసరం ఎంతో ఉందని మోదీ సైతం ప్రస్తావించారు. మోదీ 3.0 ప్రభుత్వంలోనే జమిలి ఎన్నికలను నిర్వహిస్తామని ఇటీవల కేంద్రహోంమంత్రి అమిత్ షా నొక్కిచెప్పారు.
చంద్రయాన్ ఆమోదం
భూమిపైకి చంద్ర శిలలు, అక్కడి మట్టిని తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన చంద్రయాన్4 మిషన్‌కు ఈ భేటీలో మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. చంద్రయాన్ కోసం రూ.2,104 కోట్లు కేటాయించారు. వీనస్ ఆర్బిటార్ మిషన్‌కు ఆమోదం లభించింది. ఈ మిషన్ ద్వారా శుక్రుడి కక్ష్య, దాని ఉపరితలం, భూగర్భం, వాతావరణం, ఆ గ్రహంపై సూర్యుని ప్రభావాన్ని అధ్యయనం చేయనున్నారు. ఇందుకు రూ.1,236 కోట్లు కేటాయించారు. గగన్‌యాన్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ లభించిందని కేంద్రమంత్రి చెప్పారు. భూకక్ష్యలో 30 టన్నుల పేలోడ్‌లను ఉఉంచేందుకు నెక్స్ జనరేషన్ లాంచ్ వెహికల్ (ఎన్‌జీఎల్‌టీ)ను ప్రయోగించడానికి కూడా క్యాబినెట్ ఆమోదం లభించిందని వెల్లడించారు.
గిరిజనులు, రైతుల కోసం..
ఆదివాసీ గ్రామాల అభివృద్ధికి రూ.79,156 కోట్లు అందించేందుకు క్యాబినెట్ నిర్ణయించింది. జన్‌జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ కింద ఐదేళ్లలో 63 వేల గిరిజన గ్రామాల అభివృద్ధికి వీటిని కేటాయించనున్నారు. దేశవ్యాప్తంగా 549 జిల్లాలు, 2,740 మండలాల్లోని 5 కోట్ల మంది ఆదివాసీ ప్రజలకు లబ్ధి చేకూరుతుందని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రైతుల ఆదాయం పెంచడం, పప్పులు, నూనెగింజల సాగును పెంచేందుకు రూ.35,000 కోట్లతో రూపొందించిన పీఎం పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ఏడాది రబీ సీజన్‌కు పాస్పేట్, పొటాషియం ఎరువులపై రూ.24,474 కోట్ల సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. పంటలకు పోషకాలను రాయితీకి రైతులకు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వైష్ణవ్ తెలిపారు. ఐఐటీ, ఐఐఎం తరహాలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమర్సివ్ క్రియేటర్స్ ఏర్పాటుకు సైతం మంత్రివర్గం ఆమోదముద్ర వేసిందని చెప్పారు.
కీలక ముందడుగు: ప్రధాని
జమిలి ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమో దం తెలిపిన విషయంపై ప్రధాని మోదీ స్పందించారు. ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ.. భారత ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తిమంతంగా, భాగస్వామ్యయుతంగా మార్చేం దుకు ఇది కీలక ముందడుగు. ఈ ఉన్నతస్థాయి కమిటీకి నాయకత్వం వహించి, నివేదిక రూపకల్పనకు అన్ని వర్గాలతో విస్తృత చర్చలు జరిపిన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అభినందనలు అని ప్రధాని పేర్కొన్నారు.
ఆచరణాత్మకం కాదు: ఖర్గే
కోవింద్ కమిటీ ఎదుట జమిలి ఎన్నికలను కాంగ్రెస్ సహా 15 పార్టీలు వ్యతిరే కించాయి. ఈ ప్రతిపాదన ఆచరణాత్మకమైనది కాదని కాంగ్రెస్ పేర్కొంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. దీనికి మేం మద్దతివ్వం. ప్రజాస్వామ్యంలో జమిలి ఎప్పటికీ సాధ్యంకాదు. ప్రజాస్వామ్యం మనుగడ సాగాలంటే అవసరమైనప్పుడు ఎన్నికలు నిర్వహించే వెసులుబాటు ఉండాలి అని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదన బీజేపీ చెబుతోన్న మరో మోసమని ఆప్ విమర్శించింది. ఏదైనా రాష్ట్రంలో మధ్యలోనే ప్రభుత్వం పడిపోతే మిగిలిన రోజులు గూండాగిరీతో రాష్ట్రాన్ని బీజేపీ నడిపిస్తుందా అని ఆప్ నేత సందీప్ పాఠక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.