డాక్టర్ తిరునహరి శేషు :
దేశంలో చాలా ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను గెలిచిన వెంటనే అమలు చేయటం లేదు కదా. కాబట్టి ఎన్నికల ప్రవర్తనా నియమావళి వల్లనే పథకాలు ఆగిపోతున్నాయనే వాదనలో పస లేదు.
దేశంలో లోక్ సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరపాలనే ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఎనిమిది మందితో వేసిన కమిటీ రిపోర్టును కేంద్ర క్యాబినెట్ ఆమోదించడంతో దేశంలో మరొకసారి ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ అనే అంశం చర్చనీయాంశం గా మారింది. దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు 18 రాజ్యాంగ చట్ట సవరణలు అవసరమవుతాయని, మొదటి దశలో లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించిన 100 రోజుల తరువాత రెండవ దశలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోవింద్ కమిటీ సిఫారసు చేసింది.
ఏదైనా చట్టసభ కాల పరిమితికి ముందే ఏవైనా కారణాల చేత సభ రద్దు అయితే మిగిలిన కాలానికి మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని కూడా కమిటీ సిఫా రసు చేసింది. ఈ నేపథ్యంలో భారతదేశం లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య, సమాఖ్య ప్రభుత్వాల దేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాల పైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది.
జమిలి ఎన్నికలు కొత్తేమీ కాదు
1951 నుండి 1967 వరకు లోక్ సభకు రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి కానీ 1967 తర్వాత రాష్ట్రాల పునర్విభజన జరగటం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కాల పరిమితికి ముందే రద్దు కావడంతో 1971 ఐదవ లోక్‌సభ ఎన్నికల నుండి జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యపడటం లేదు. కానీ నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనే క సందర్భాలలో జమిలి ఎన్నికల ప్రస్తావన తెరపైకి వచ్చింది. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు జమిలి ఎన్నికలపై రామ్‌నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ వేయడం, కమిటీ రిపోర్ట్‌ను కేంద్ర మంత్రిమండలి ఆమోదించటంతో జమిలి ఎన్నిక లకు తొలి అడుగు పడినట్లుగానే కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది.
ఒకేసారి ఎన్నికలు సాధ్యమా!
2029లో జమిలి ఎన్నికలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది కానీ ఒకేసారి ఎన్నికల నిర్వహణకు అనేక చిక్కు ముడులు ఉన్నాయి. జమిలి ఎన్నికల నిర్వహణకు దేశంలోని సగం రాష్ట్రాలు అంటే 14 రాష్ట్రాల శాసనసభలు ఆమోదం తెలపాలి. ప్రస్తుతం బిజెపి 12 రాష్ట్రాలలో, దాని మిత్రపక్షాలు నాలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో పెద్దగా ఆటంకాలు ఏర్పడకపో వచ్చు కానీ 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టానికి 356, 324 325, 172/1,83/2 లాంటి పలు ఆర్టికల్స్‌కు సవరణలు చేయాలి.
లోక్ సభ, రాజ్యసభ ఉభయ సభలలో మూడిం ట రెండువంతుల మెజారిటీతో అంటే లోక్‌సభలో 362, రాజ్యసభలో 164 సంఖ్యా బలంతో జమిలి ఎన్నికల బిల్లు ఆమోదం పొందాలి. కానీ ఉభయ సభల లో ఎన్డీఏ ప్రభుత్వం ఈ మెజారిటీ సాధించటం సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రామ్‌నాథ్ కోవింద్ కమిటీ సంప్రదించిన 47 పార్టీలలో జమి లి ఎన్నికలకు 32 పార్టీలు మద్దతు తెలిపాయి. సభలో వాటి బలం కేవలం 271 మాత్రమే కానీ జమిలి ఎన్నికలను వ్యతిరేకించిన 15 పార్టీల బలం సభలో 205గా ఉన్నది.
రాజ్యసభలో కూడా ఎన్డీఏ బలం కేవలం 113కే పరిమితమైన నేపథ్యంలో జమిలి ఎన్నికల బిల్లు ఆమోదానికి కావలసిన మెజార్టీని ప్రభుత్వం సాధించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోక్ సభలో అయిదు ప్రధాన పార్టీలలో ఒక్క బీజేపీ మినహా మిగతా నాలుగు పార్టీలు కాంగ్రెస్, సమాజ్ వాదీ, టీఎంసీ, డీఎంకేలు జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నా యి. కాబట్టి బిల్లు ఆమోదం పొందటం అంత ఆషామాషీ విషయం కాదనే అభిప్రాయమూ ఉంది.
సంస్కరణలు రావాలి
జమిలి ఎన్నికలతో కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్లుగా అద్భుతాలు ఏమీ జరగవనే వాదన కూడా వినిపిస్తున్నది. జమిలి ఎన్నికల కంటే ఎన్నికల సంస్కరణలు రావాలని కోరుకునే వారు ఎక్కువ. జమిలి ఎన్నికల ద్వారా సమయం, ఎన్నికల నిర్వహణ వ్యయం ఆదా అవుతుందని చెప్తున్నా రు కానీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చేసే వ్యయం కంటే అనధికారికంగా పార్టీ లు, అభ్యర్థులు చేసే వ్యయమే అధికం. ఎన్నికలలో డబ్బు ప్రమేయం ఏ స్థాయిలో పెరిగిపోయిందంటే ప్రస్తుత పార్లమెంటు లో 93 శాతం కోటీశ్వరులే (504 మంది) గెలిచినట్లుగా ఏడిఆర్ సంస్థ నివేదిక చెబుతున్నది.
ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నిర్ణయించిన పరిమితికి మించి ఖర్చు చేస్తున్నా కమిషన్ చర్యలు చేపట్టలేకపోతున్నదని, ఎన్నికలలో డబ్బు ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నదనే విమర్శలు వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఎన్నికల నిర్వహణలో డబ్బు ఖర్చు అనేది సమస్య కాదు. తరచూ ఎన్నికలు రావడం వలన ఎన్నికల ప్రవర్తనా నియమావళితో (ఎంసిసి)అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వాలు కొనసాగించలేకపో తున్నాయనే వాదనలను కూడా జమిలి ఎన్నికలను సమర్థిస్తున్న వారు తెరపైకి తెస్తున్నారు. కానీ ఇందులో కూడా వాస్త వం లేదు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అప్పటికే కొనసాగుతున్న ఏ కార్యక్రమాన్ని అడ్డుకోదు. కేవలం ఓటర్లను ప్రలోభ పెట్టడానికి కొత్తగా ప్రకటించే తాయిలాలను మాత్రమే అడ్డుకుంటుందనే విషయాన్ని గమనించాలి. దేశంలో చాలా ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను గెలిచిన వెంటనే అమలు చేయటం లేదు కదా. కాబట్టి ఎన్నికల ప్రవర్తనా నియమావళి వల్లనే పథకాలు ఆగిపోతున్నాయనే వాదనలో పస లేదు. ఇక చట్టసభ కాల పరిమితి ముగియకముందే సభ విశ్వాసా న్ని కోల్పోతే మిగిలిన కాలానికి మాత్రమే ఎన్నికలు జరపాలనే సిఫారసు కూడా ఆమోదయోగ్యం కాదు.
ఒక రాష్ట్ర ప్రభు త్వం మూడు సంవత్సరాల తరువాత సభ విశ్వాసాన్ని కోల్పోతే మళ్ళీ ఎన్నికలలో మిగిలిపోయిన కాలానికి కొత్త పార్టీ ఎన్నికై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఏ ప్రభుత్వం కూడా పూర్తి కాలం పని చేయకపోవటం వలన రాష్ట్ర అభివృద్ధిపై ప్రభావం పడదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. జమిలి ఎన్నికలలో జాతీయ పార్టీల అజెం డా, జాతీయ అంశాలే ప్రధానంగా మార టం వలన ప్రాంతీయ అంశాలకు, ప్రాంతీ య పార్టీల ఉనికికి కూడా ప్రమాదం ఏర్ప డే అవకాశం ఉందనే ఆందోళనలో నిజం లేకపోలేదు.
జమిలి ఎన్నికలు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే అవకాశం కూడా ఉంది కాబట్టి దేశంలోని మెజార్టీ ప్రాంతీయ పార్టీలు వీటిని వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వాలు రద్దయినప్పుడు ప్రస్తుతం బంగ్లా దేశ్‌లో ఏర్పడిన విధంగానే జాతీయ ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలనే సిఫారసు కూడా మనలాంటి దేశాలకు శ్రేయస్కరం కాదు. 1990 నుండి 1996 వరకు భారత పదవ ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన టి.ఎన్. శేషన్ తీసుకొచ్చిన ఎన్నికల సం స్కరణలను ప్రజలు హర్షించారు. ఎన్నికల సంఘంపై ప్రజలకు నమ్మకం పెరిగింది. కాబట్టి ఇప్పుడు దేశానికి జమిలి ఎన్నికల కంటే ఎన్నికల సంస్కరణలు కావాలి.
ఎన్నికలలో డబ్బు, కులం, మతం ప్రమేయం లేకుండా, ప్రలోభాలు, అవినీతికి తావులేకుండా చూడాలి. అవినీతి మకిలి అంటని నేతలు, పార్టీ ఫిరాయింపులకు పాల్పడని నేతలు పోటీ చేసే విధంగా ఎన్నికయ్యే విధంగా ఎన్నికల చట్టాలు నిబంధనలు రావాలి. ఎన్నికలలో ఉపయోగిస్తున్న ఈవీఎంలపై అనుమానాలకు తావులేకుండా ఎన్నికలు జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎన్నికలను ఖర్చు కోణంలో కాకుం డా ఒక ప్రభుత్వంపై, పార్టీపై ప్రజల భావవ్యక్తీకరణ వేదికగా చూసినప్పుడే ప్రజాస్వా మ్యం మరింత పరిఢవిల్లుతుంది.
వ్యాసకర్త సెల్: 9885465877