calender_icon.png 24 October, 2024 | 2:46 AM

సమాఖ్య స్ఫూర్తికి జమిలి విఘాతమే

24-10-2024 12:54:21 AM

కూరపాటి వెంకట్ నారాయణ

జమిలి ఎన్నికల రాజ్యాంగ సవరణకు కనీసం 362 మంది లోకసభ సభ్యులు ఆమోదించాలి. లేకపోతే సవరణకు అవకాశం లేదు. ఈ విషయం తెలిసినప్పటికీ ఈ ప్రతిపాదనను ముందుకు తేవడం జరుగుతున్నది. లోక్‌సభలో ఎన్డీఏ కూటమికి కేవలం 292 సీట్లు మాత్రమే ఉన్నప్పటికీ ఈ ప్రతిపాదనను కేంద్ర క్యాబినెట్ ఆమోదించడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తున్నది. లోక్‌సభకు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల అనేక అనర్థాలకు దారి తీసే ప్రమాదం ఉందన్న విషయాన్ని ప్రజలు ప్రజాస్వామ్య వాదులు బుద్ధిజీవులు చర్చించాల్సిన అవసరాన్ని ఉపేక్షించ రాదు.

ఏక కాలంలో లోకసభ, దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు సాధారణ జమిలి ఎన్నికలు జరపాలని ఇందుకోసం కేంద్రంలో గత దశాబ్ద కాలం గా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ  ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాలని ప్రతిపాదనలను సిద్ధం చేసిన విష యం తెలిసిందే. దేశంలో జమిలి ఎన్నికలు కావాలని ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు, ఎన్నడూ అడగలేదు. ఉద్యమించలేదు. ప్రతిపక్షాలు కూడా అడగలేదు.గత మూడు సంవత్సరాల నుంచి ‘ఒకే జాతి ఓకే ఎన్నిక’ అనే నినాదంతో కేంద్ర ప్రభు త్వం ఒక చర్చ లేవనెత్తింది. ఆర్థిక వృద్ధిరేటు విపరీతంగా పెరుగుతుందని దేశం సంపన్న దేశాల సరసన చేరుతున్నదని మన పాలకులు పదేపదే ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. 

కానీ, నూతన ఆర్థిక సంస్కరణల పుణ్యాన దేశంలో ఆర్థిక శక్తి శరవేగంగా కేంద్రీకృతం జరుగుతుంది. నిరుద్యోగ సమస్య ప్రతి సంవత్సరం జటిలమవుతున్నది. ఆర్థిక అసమానతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ద్రవ్యోల్బణం నియంత్రణ తప్పుతున్నది. గత పది సంవత్సరాలలో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లలో రూపాయి విలువ మరింత దిగజారి పోతున్నది. దేశంలో 40% జాతీయాదాయం కేవలం ఒక్క శాతం ప్రజలకే చెందుతున్నదని అనేక అధికారిక, అనధికారిక జాతీ య అంతర్జాతీయ సర్వేలు తెలియ చేస్తున్నాయి. ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పార్లమెంటులో గాని, ప్రజల ముందుగాని చర్చించి, పరిష్కారాలు అందించవలసి ఉంది. అయినప్పటికీ కేంద్రం ఇవేమీ పట్టించుకో కుండా ప్రజలు ఎన్నడూ కోరని జమిలి ఎన్నికల చర్చకు తీసుకు రావడం జరుగుతున్నది. స్వాతంత్రం వచ్చి 77 సంవత్స రాలు గడిచిన 55% జనాభా ఉన్న వెనుకబడిన కులాలు జనగణనను చేపట్టాలని ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కేంద్రంలో ఉన్న అధికార పార్టీ పెడచెవిన పెడుతూ జమిలి ఎన్నికల అంశాన్ని మాత్రం చర్చకు తేవడం జరుగుతున్నది. 

రాజ్యాంగ సవరణ ఎలా?

జమిలి ఎన్నికల ప్రతిపాదన లోకసభ ఎన్నికల సందర్భంలో కేంద్రంలోని అధికార పార్టీ ప్రజల ముందుకు తీసుకురావ డం జరిగింది. ఇటీవలి లోకసభ ఎన్నికలలో 400 లోకసభ స్థానాలు తమ పార్టీకి ఇవ్వండని ప్రధాని మోడీ అభ్యర్థించినప్పటికీ ప్రజలు కేవలం 240 స్థానాలను మాత్రమే ఇచ్చారు. అన్ని ఇతర ప్రతిపాదనలతోపాటు జమిలి ఎన్నికల ప్రతిపాదనను కూడా తిరస్కరించినట్లే తీర్పునిచ్చారు. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడుల  సహకారంతో మాత్రమే ప్రస్తుతం ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారం పొందిన విషయం తెలిసిందే. అయినా, జమిలి ఎన్నికల ఆలోచనను మాత్రం ఉపసంహరించడం లేదు. జమిలి ఎన్నికల కోసం కావలసిన రాజ్యాంగ సవరణకు కనీసం 362 మంది లోక్‌సభ సభ్యులు ఆమోదించాలి. లేకపోతే సవరణకు అవకాశం లేదు. ఈ విషయం తెలిసినప్పటికీ ఈ ప్రతిపాదనను ముందుకు తేవడం జరుగుతున్నది. లోకసభలో ఎన్డీఏ కూటమికి కేవలం 292 సీట్లు మాత్రమే ఉన్నప్పటికీ ఈ ప్రతిపాదనను కేంద్ర క్యాబినెట్ ఆమోదించడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తున్నది.

జమిలి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఎన్నికల ఖర్చు దాదాపు రూ.462 కోట్లు అవుతున్నదని, రాష్ట్రాల్లో వేరువేరుగా ఎన్నికలు జరిగినప్పుడు అదనంగా ఖర్చు అవు తుందని, ఈ వృధా ఖర్చును ఆదా చేయవచ్చునని, పార్టీలు ప్రభుత్వాలు ఎన్నికల కోసం వెచ్చించే సమయాన్ని, ధనాన్ని వివిధ రకాల అభివృద్ధి కోసం ఉపయోగించడం ద్వారా మరింత ప్రగతిని సాధించ వచ్చునని, ఈ దృష్ట్యానే జమిలి ఎన్నికల ప్రతిపాదనను ముందుకు తేవడం జరుగుతున్నదని బీజేపీ పెద్దలు సెలవిస్తున్నారు. ఎంతో ప్రాధాన్యం గల జమిలి ఎన్నికల ప్రతిపాదనకు ప్రజల ఆమోదం పొందవలసి ఉంటుంది. కానీ, కేవలం పార్లమెంటుకు మాత్రమే ఈ అధికారముంటుందా, లేదా? అన్న విషయాన్ని అత్యున్నత న్యాయస్థానం కూడా తేల్చి చెప్పవలసిన అవసరం ఉంది. అవసరమైతే ఈ జమిలి ఎన్నికలు అవసరమా లేదా అనే అంశంపై ప్రజల ఆమోదం కోసం ప్లెబిసైటు (ప్రజాభిప్రాయ సేకరణ) నిర్వహించాలి. 

వేర్వేరు ప్రాధాన్యాలను గుర్తించాలి

లోక్‌సభకు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల అనేక అనర్థాలకు దారి తీసే ప్రమాదం ఉందన్న విషయాన్ని ప్రజలు ప్రజాస్వామ్య వాదులు బుద్ధిజీవులు చర్చించాల్సిన అవసరాన్ని ఉపేక్షించ రాదు. భిన్న సంస్కృతులు, భాష, ప్రాంతీ య సమస్యలు, ప్రాంతీయ పార్టీలు, రాష్ట్రాల సామాజిక ఆర్థిక అభివృద్ధిలో ఉన్న తేడాలు పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. ఈ దేశంలో లోకసభ ఎన్నికల ప్రాధాన్యాలు, శాసనసభల ఎన్నికల ప్రాముఖ్యతలు భిన్నంగా ఉంటాయన్న విషయాన్ని ఉపేక్షించరాదు. జమిలి ఎన్నికల సందర్భంగా జాతీయ అంశాలు, ప్రాంతీయ అవసరాలు, సమస్యలు జమిలి ఎన్నికల సందర్భంగా ప్రజలు, ఓటర్లు గంపగుత్తగా చర్చించలేరు. జాతీయ లక్ష్యాలు, సమస్యలు, ప్రాంతీయ ఆకాంక్షలు, అవసరాలు వేరువేరుగా ఉంటాయ నే విషయాన్ని గమనించాలి. కేవలం రూ. 500 కోట్ల రూపాయలు ఎన్నికల ఖర్చు వృధా అని భావించలేము. 48 లక్షల కోట్ల రూపాయల కేంద్ర బడ్జెట్‌తో పోల్చి ఇంత పెద్ద ప్రజాస్వామ్యం ఆర్థిక వ్యవస్థలో ఎన్నికలకు కాగల ఖర్చు 500 కోట్ల రూపాయలు ఒక పెద్ద సమస్య కాదు. 

అదే విధంగా ఎన్నికల కోడ్, ఎన్నికల ఖర్చు ప్రజలకు ఇబ్బందులు, నష్టాలు కలిగిస్తున్నాయని భావించరాదు. మన రాజ్యాంగంలో రాష్ట్రాలకు సంక్రమించిన ప్రత్యేక అధికారాలు, సమాఖ్య స్ఫూర్తిని ఏ మాత్రం విస్మరించలేము. ప్రతి ఐదేళ్లకు ఒకసారి మాత్రమే జమిలి ఎన్నికలు జరిపినట్లయితే ఆయా రాష్ట్రాల ప్రజల సమస్య లను నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఎన్నికైన ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. వివిధ సందర్భాల్లో ఎన్నికలు రావడం వల్ల నాయకులు, ప్రభుత్వ అధినేతలు ప్రజలకు దర్శనమిచ్చి ప్రభు త్వం, నాయకులు చేసిన అభివృద్ధి, సంక్షే మ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడానికి, వారు కూడా ప్రశ్నించే సందర్భ మూ వస్తుంది. దేశంలో గాని, రాష్ట్రంలో గాని ఒక నియంతృత్వ పోకడలు ఏర్పడకుండా, ఎదగకుండా ప్రస్తుతం అమలులో ఉన్న ఎన్నికల ప్రక్రియ ఉపయోగపడుతున్న విషయం గమనించాలి. 

అంతరాలు పెరిగే ప్రమాదం

ఇప్పటికే అనేక రాష్ట్రాలలో ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధినేతలు అవినీతిలో కూరుకు పోతున్న పరిస్థితులలో జమిలి ఎన్నికల పద్ధతి అమలు చేస్తే రాష్ట్రాల ప్రజలకు నాయకులకు మధ్య అంతరాలు పెరిగిపోతుంటాయి. అవినీతి మరింత పెరిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అధికార పార్టీ ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేసే అవకాశమూ ఉంది. ఒక్కసారి ఎన్నికైన ప్రభుత్వం మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ప్రజల ముందుకు వస్తే అవినీతికి పాల్పడడం నిరంకుశ, కుటుంబ, పాలనకు తెర దించడం, బలపడడం మొదలైన అప్రజాస్వామిక పరిస్థితులు నెలకొనవచ్చు. నాయకులు అవకతవకలకు పాల్పడితే ప్రజలు ప్రశ్నించే అవకాశం సన్నగిల్లుతుంది. లోక్‌సభకు, శాసనసభలకు, స్థానిక సంస్థలకు వేరువేరుగా ఎన్నికలు జరపడం వల్ల ప్రజాస్వామ్యం బలపడుతుంది. ప్రజల సమస్యలకు పరిష్కారాలు లభించే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు ప్రజల గొంతుకగా మాట్లాడడానికి  కూడా అవకాశం ఉంటుంది. 

మరింత నిరంకుశత్వం అవసరమా?

లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు వేరువేరు సందర్భాలలో ఎన్నికలు జరపడం వల్ల ప్రజలకు ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు జమిలి ఎన్నికలు నిర్వహించడం వల్ల డబ్బు ఆదాతోపాటు అభివృద్ధి, పరిపాలన చేయవచ్చునని డొంక తిరుగుడు పిడివాదనలు ప్రజల ముందు పెడుతున్నారు. ‘ఒక జాతి ఒక ఎన్నిక ఒక పార్టీ ఒకే ప్రభుత్వం’ అనే నినాదం అంతిమంగా నిరంకుశత్వ పాలనకు           దారితీస్తుందని అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. ‘అన్న వస్త్రం అడగబోతే ఉన్న వస్త్రం గుంజుకున్నట్లు’ ఏదో ఒక ప్రజాస్వామ్యం గత 78 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నది. కనీసం ఈ మాత్రం స్వేచ్ఛయినా మిగలనిస్తే చాలునని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికే మన దేశంలో ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారి సామాజిక, ఆర్థిక న్యాయం ఆటకెక్కిందని ప్రజలు తీవ్ర ఆవేదనకు గురవుతున్న సందర్భంలో ఈ జమిలి ఎన్నికల మూలాన ఇంకేమీ ఒరిగేది లేదని భావించవచ్చు.