calender_icon.png 20 September, 2024 | 5:21 PM

జమిలి ఎన్నికలు అసాధ్యం

20-09-2024 01:24:28 AM

18 సవరణలు చేస్తేనే ఎన్నికలు 

14 రాష్ట్రాలు ఆమోదం పొందాలె

రామ్‌నాథ్ కమిటీ ఎవరితో మాట్లాడింది? 

ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి 

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): దేశంలో జమిలి ఎన్నికలు అసాధ్య మని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నా రు. ఒకే దేశం, ఒకే ఎన్నిక అంశంపై క్యాబినెట్ సమావేశంలో చర్చించే ముందు ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని ఆయన డిమాం డ్ చేశారు. రామ్‌నాథ్ కోవింద్ నివేదికలో వాస్తవాలు లేవని, ఆ కమిటీ దేశంలో ఎవరితో, ఎక్కడ సమావేశం పెట్టారో క్లారిటీ లేదని విమర్శించారు.

గురువారం గాంధీభవన్‌లో ఏర్పా టు చేసిన సమావేశంలో పార్టీ నేతలు శ్రీకాంత్‌యాదవ్, సంధ్య, వచన్‌కుమార్ , సత్తు మల్లేశ్  తదితరులతో కలిసి మాట్లాడుతూ జమిలి ఎన్నికలు పెట్టాల్సి వస్తే 18 సవరణలు చేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పుడు జరుగుతున్న 4 రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించలేకపోతున్నారని, దేశమంతా ఒకేసారి ఎలా సాధ్యమని ఆయన నిలదీశారు. జమిలి ఎన్నికల బిల్లుకు లోక్‌సభలో 362 మంది, రాజ్యసభలో 164 మంది ఎంపీలతో పాటు 14 రాష్ట్రాల మద్దతు కావాల్సి ఉంటుందన్నారు. ప్రజల దృష్టిని మరల్చడానికి బీజేపీ ఇలాంటి డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు.

జమిలి ఎన్నికలు నిర్వహించే సత్తా ఉన్నప్పుడు.. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలను ఓకేసారి ఎందుకు నిర్వహించలేదని చామల నిలదీశారు. ప్రపంచంలో 194 దేశాలున్నాయని, కేవలం 10 దేశాల్లోనే జమిలి ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. లోక్‌సభ పదవీ కాలాన్ని నిర్ణయించే ఆర్టికల్ 83, అసెంబ్లీ పదవీ కాలాన్ని నిర్ణయించే ఆర్టికల్ 172లో మూడేసి సెక్షన్లను ప్రధానంగా సవరించాల్సి ఉంటుందని వివరించారు. రాష్ట్రాల ఆమోదం లేకండా జమిలి ఎన్నికల నిర్వహణ అసాధ్యమని, ఎన్నికల నిర్హహణకు అవసరమైన ఏర్పాట్లు, పరికరాలు, సిబ్బంది కూడా సరిపడా ఉండాలని ఆయన పేర్కొన్నారు.