12-03-2025 12:00:00 AM
సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్
ప్లాంట్ నిర్మాణానికి బీహెచ్‌ఈఎల్‌తో ఒప్పందం
హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద గల 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్ర ప్రాంగణంలో మరో 800 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్‌ను 40 నెలల్లో పూర్తి చేయాలని సీఎండీ ఎన్ బలరామ్ ఆదేశించారు. ప్లాంట్ నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు పూర్తికాగా.. సోమవారం రాత్రి ఈ నిర్మాణ పనులకు సంబంధించి భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్)తో సింగరేణి సంస్థ హైదరాబాద్ సింగరేణి భవన్‌లో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. వచ్చే నెలలో పనులు ప్రారంభించాల న్నారు. పవర్ ప్రాజెక్టు ప్రాంగణంలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, వీటిని వినియోగించుకుని త్వరితగతిన ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తిచేయాలని సూచించారు. కార్యక్ర మంలో డైరెక్టర్ (ఈఅండ్‌ఎం) డీ సత్యనారాయణరావు, డైరెక్టర్ (ఆపరే షన్స్) పాల్గొన్నారు.
ఏటా రూ.300 కోట్ల లాభాలు..
ప్రస్తుతం సింగరేణి సంస్థ 2016లో పూర్తి చేసిన 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం విజయవంతంగా నడుస్తూ కంపెనీకి ప్రతీ ఏడాది సుమారు రూ.450 కోట్ల వరకు లాభాలను ఆర్జించి పెడుతోంది. ఇప్పటివరకు ఈ ప్లాంటు సుమారు 70 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను రాష్ర్ట అవసరాలకు అందించింది. ఈ కొత్త ప్లాంట్ సింగరేణి సంస్థకు ఏడాదికి మరో రూ.300 కోట్ల వరకు లాభాలు చేకూర్చే అవకాశం ఉంది.