బెస్ట్ పొలిటికల్ మూవీ అవార్డు కైవసం
టాలీవుడ్ కేంద్రంగా భారతీయ సినీ రంగంలో తనవైన సేవలను అందిస్తోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఈ సంస్థ గతంలో నిర్మించిన ‘కార్తికేయ 2’ సూపర్ హిట్ చిత్రం జాతీయ అవార్డును దక్కించుకుంది. తాజాగా ఈ సంస్థ నిర్మించిన మరో చిత్రం పురస్కారాన్ని కైవసం చేసుకోటంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పేరు మరోమారు అంతర్జాతీయ స్థాయిలో వినిపిస్తోంది. ఈ బ్యానర్‌లో తెరకెక్కిన త్రిభాషా చిత్రం ‘మా కాళి’ ప్రతిష్టాత్మక జైపూర్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (జేఐఎఫ్‌ఎఫ్)లో బెస్ట్ పొలిటికల్ మూవీ అవార్డును గెలుచుకుంది.
టీజీ విశ్వప్రసాద్, జీజీ కృతిప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు విజయ్ యెలకంటి దర్శకత్వం వహించగా రైమా సేన్, అభిషేక్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నెల 17న జైపూర్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి మా కాళి దర్శకుడు విజయ్ యెలకంటి నటి రైమా సేన్‌తో కలిసి హాజరయ్యారు. బెస్ట్ పోలిటికల్ మూవీ అవార్డును అందుకున్నారు.
‘మాకాళి’ అంతరంగం ఇదీ..
భారతీయ చరిత్రలో చెరిపివేతకు గురైన అధ్యాయం ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ‘మా కాళి’. ఓ శక్తిమంతమైన కథతో రూపొందిన ఈ సినిమా ప్రభావవంతమైన పెర్ఫార్మెన్స్‌లతో బెంగాల్‌లోని మరుగుపడిన ఆధ్యాయం గురించి చర్చించింది. కలకత్తా, నోఖాలీలో జరిగిన క్రూరమైన నరమేధ రక్తపాత సత్యాన్ని హైలైట్ చేస్తూ, భారతదేశ విభజనకు దారి తీసిన డైరెక్ట్ యాక్షన్ డే వెనుక ఉన్న సత్యాన్ని ముందుకు తీసుకురావాలన్న లక్ష్యాన్ని గుర్తు చేస్తోందీ సినిమా.
సోషియో- పొలిటికల్ సబ్జెక్ట్ ప్రస్తుత కాలంలోని అత్యంత ముఖ్యమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ‘మాకాళి’. 1946 నుంచి బంగ్లాదేశ్ ఘటన వరకు హిందువులను పీడించిన తీరు, బెంగాల్ మతపరమైన అల్లకల్లోలాల నేపథ్యం, సీఏఏ ప్రాముఖ్యత, దాని అమలు అవసరాన్ని ఈ సినిమా ద్వారా తెర మీద ఆవిష్కరించారు డైరెక్టర్. తొలుత హిందీలో చిత్రీకరించబడిన ఈ పాన్- ఇండియా చిత్రం బెంగాలీ, తెలుగులో ఇదే ఏడాది విడుదల చేయనున్నారు.
మహిళా ప్రాధాన్య చిత్రానికి గుర్తింపు ఆనందాన్నిచ్చింది
‘మా కాళి’ ప్రేక్షకులను ఆకట్టుకుంటుదని నాకు తెలుసు. ఈ గుర్తింపు మాకు ముఖ్యమైన, సానుకూల మార్పును ప్రేరేపించే కథలను చెప్పే శక్తినిస్తుంది. ఇది మహిళా ప్రాధాన్య చిత్రం కాబట్టి జేఐఎఫ్‌ఎఫ్ నుంచి ఈ గుర్తింపు పొందడం మరింత సంతృప్తికరంగా ఉంది.
రైమా సేన్
మార్పును ప్రేరేపించే చిత్రాలకు ప్రోత్సాహం
‘మా కాళి’కి బెస్ట్ పొలిటికల్ మూవీ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. జేఐఎఫ్‌ఎఫ్ ద్వారా ఈ గుర్తింపు గొప్ప ఉత్సాహాన్నిస్తోంది. మార్పును ప్రేరేపించే చిత్రాలను రూపొందించడానికి ప్రోత్సహించినట్టయ్యింది.
దర్శకుడు విజయ్ యెలకంటి