హైదరాబాాద్,(విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుర్తి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గుర్కా జైపాల్ యాదవ్ విచారణ ముగిసింది. జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరుకావడంతో పోలీసులు 2 గంటలపాటు జైపాల్ యాదవ్ ను విచారించి అతని వాంగ్మూలం రికార్డు చేశారు. ఈ సందర్భంగా జైపాల్ యాదవ్ మాట్లాడుతూ.. తిరుపతన్న ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేయించాననే ఆరోపణలతో పోలీసులు నోటీసులిచ్చారన్నారు. రెండు కుటుంబాల మధ్య విభేదాల కేసులో రెండు ఫోన్ నంబర్లు ఇచ్చానని, ఆ రెండు ఫోన్ నంబర్లను ట్యాపింగ్ చేసిన సంగతి తెలియదన్నారు. అయితే ఓ వివాదం పరిష్కారం కోసం అదనపు ఎస్పీ తిరుపతన్న తమ సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతోనే అదనపు ఎస్పీని కలిసినట్లు జెైపాల్ తెలిపారు. విచారణ సమయంలో పోలీసులు కొన్ని ఆధారాలు ముందు పెట్టి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారన్నారు. పోన్ ట్యాపింగ్ కేసులో ఎప్పుడు విచారణకు పిలిచినా వెళ్తానని జెైపాల్ యాదవ్ వెల్లడించారు. ఇదే కేసులో ఇప్పటికే చిరుముర్తి లింగయ్యను పోలీసులు విచారించారు.