calender_icon.png 9 February, 2025 | 8:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రాహ్మణపల్లిలో జైనం ఆనవాళ్లు!

09-02-2025 12:00:00 AM

యాదాద్రి జిల్లా గుండాల మండలంలోని బ్రాహ్మణపల్లి అతిపురాతనకాలం నుంచి మానవావాసంగా ఉంది. ఈ ఊర్లో దేవతలగుట్టగా పిలువబడే చిన్నగుట్టల వరుస ఉంది. రెండుగుట్టల నడుమ చిన్నలోయ, లోయలో గుహలు, దొనెలు, సొరికెలు చాలా ఉన్నాయి. ఒక చిన్నదొనెలో మాకు మెరుగుపెట్టని చిన్న, చిన్న ఆదిమానవుల రాతిపనిముట్లు దొరికాయి.

వాటిలో వడిసెలరాళ్లు, రాతిసుత్తెలు, గొడ్డళ్లుగా చేయడానికి సిద్ధపరిచిన రాతిముక్కలు, బొరిగెలవంటివి ఉన్నాయి. అక్కడే వేణుగోపాలస్వామి గుడి ఉంది. గుడికి తూర్పున బండగట్టుగా ఒక ఆదిమానవుల సమాధి ఉంది.

16 చిన్న, చిన్న రాతిగుండ్లను సమాధిచుట్టూ పేర్చారు. అది ఒక కైరన్ సమాధి. ఇంకా సమాధులుండే అవకాశముంది. పరిశోధించాలి. దొరికిన రాతిపనిముట్లను బట్టి అవి మధ్యశిలాయుగం (క్రీ.పూ.8500 సం.లు) నాటివని తెలుస్తున్నది. 

వేణుగోపాలస్వామి గర్భగుడి సుద్దాలలోని వేణుగోపాలస్వామిగుడి అంతరాళాన్ని పోలి ఉంది. ద్వారం ఉత్తరాశిమీద లలాటబింబంగా తిరునామాలే ఉన్నాయి. నిర్మాణశైలి ఒకేవిధంగా ఉంది. గుట్టమీద కావడంవల్ల గుడి చిన్నగా ఉంది. కానీ, లోపల అర్చామూర్చులే తప్ప వేణుగోపాలస్వామి విగ్రహం లేదు. గుడి బయట ఉత్తరం వైపు బండమీద పెద్ద అక్షరాలతో తెలుగులిపిలో రాతవుంది.

జీర్ణమైపోవడం వల్ల చదవడం అసాధ్యంగా ఉంది. అక్కడ గుడి బయట తూర్పున కిందవైపు ఒక నంది ఉంది. శివలింగం లేదు. అంటే ఇక్కడ కూడా ఒకప్పుడు శివాలయం ఉండేదన్నమాట. ఇవి కూడా 10,11 శతాబ్దాలనాటివని తోస్తున్నది. గుడిగోడల్లో కనిపించే స్తంభాలు రాష్ట్రకూటశైలిలో కనిపించడం విశేషం. బ్రాహ్మణపల్లిలో 8,9వ శతాబ్దాలలోనే దేవాలయ నిర్మాణం జరిగిందనిపిస్తుంది.

ద్వారశాఖలమీద కనిపించే కలశాలు, ఊరిబయట లభించిన పాదాలు.. ఇక్కడ ఒకప్పుడు జైనం ఉండేదని తెలిపే ఆనవాళ్లు. గ్రామంలో పడమట వూరవతల పాతగుడి ఉంది. ఆ గుడిలో రెండడుగుల ఎత్తున చతురస్రాకారపు పానవట్టం, శివలింగం, అరడుగుఎత్తు, అడుగుపొడుగున్న నంది, వినాయకవిగ్రహం,

అడుగుఎత్తున్న రాతిపలకపై అభయాంజనేయుని అర్చారూపం, మూడడుగుల ఎత్తున్న చక్కని లక్ష్మీసమేత నారాయణుని విగ్రహం ఉన్నాయి. ఈ గుడిని కొండగడప సుబ్బావధాని (ఇప్పటికి ఎన్ని తరాలకిందనో) కట్టించాడట.

(ఆ ఇంటికోడలు గారు చెప్పారు). మాన్యం ఉండేదట. అసలు బ్రాహ్మణపల్లే బ్రాహ్మణుల అగ్రహా రం కావడం వల్లనే వూరికా పేరు వచ్చివుంటుంది. స్థానిక చరిత్రలు దొరికితే ఇంకా చరిత్ర ఆనవాళ్లు ఎక్కువగా లభించేవి. ఆంజనేయుని గుడి వద్ద నాగులశిల్పాలున్నాయి. పాతగుడి ఆనవాళ్లు అగుపడుతున్నాయి.