12-02-2025 11:15:21 PM
మలక్‌పేట: క్రీడలు పట్టుదల, వ్యూహాత్మక ఆలోచన, శారీరక ఓర్పు వంటి లక్షణాలను పెంపొందించడంలో ఎంతగానో దోహదబడుతాయని జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా అన్నారు. క్రీడలలలో పాల్గొనడం వలన శారీరక దృఢత్వం పెంపొందడమే కాకుండా, విధి నిర్వహణలో కీలకమైన స్నేహం, మానసిక స్థితిస్థాపకత కూడా పెంపొందుతుందని ఆమె పేర్కొన్నారు. బుధవారం చంచల్‌గూడా జైల్‌లోని సికా మైదానంలో 7వ రాష్ట్ర స్థాయి వార్షిక స్పోర్ట్స్ మీట్ ను హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా ప్రారంభించారు. స్పోర్ట్స్ మీట్‌లో రేంజ్ ప్రకారం జైళ్ల శాఖ సిబ్బందికి సెలక్షన్‌లను నిర్వహించారు. హైదరాబాద్ రేంజ్ సెలక్షన్‌లు సంగారెడ్డి, చర్లపల్లి, హైదరాబాద్ కేంద్ర కారాగారం వద్ద జరిగాయి.
అదే విధంగా వరంగల్ రేంజ్ లో నిజామాబాద్ కేంద్ర కారాగారం, కరీంంనగర్, ఖమ్మం జిల్లా జైలలో నిర్వహించారు. చివరగా 250 మంది ఐదు స్కాడ్‌లుగా 26 విభాగాల్లో పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్ర మాట్లాడుతూ... జైళ్ల వ్యవస్థలో సిబ్బందికి మాత్రమే కాకుండా ఖైదీలకు కూడా క్రీడలు, ఫిట్‌నెస్ కార్యక్రమాలను చురుకుగా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఇటీవలే ఖైదీలు, తెలంగాణ స్పెషల్ పోలీసులకు వాలీబాల్ పోటీలను నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐజీ రాజేశ్ బాబు, ఎన్.మురళీ బాబు, హైదరాబాద్ రేంజ్ డీఐజీ డాక్టర్ డీ.శ్రీనివాస్, వరంగల్ రేంజ్ డీఐజీ ఎం.సంపత్ తదితరులు పాల్గొన్నారు.