calender_icon.png 13 January, 2025 | 9:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వందేభారత్‌కు జె

13-01-2025 02:45:50 AM

  1. విశాఖ-సికింద్రాబాద్ రైల్‌లోనూ పెరిగిన బోగీలు 
  2. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖ రైల్‌లో 20 బోగీలకు పెంపు 
  3. ఇతర నగరాలకూ నడపాలంటున్న ప్రయాణికులు 
  4. టికెట్ ధరలు ఎక్కువైనా భారీగా పెరిగిన డిమాండ్

హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. దేశంలోనే వేగవంతమైన రైలు. దేశీయంగా తయారు చేసిన ఈ అత్యాధునిక ట్రైన్‌కు దేశంలో పలు చోట్ల పెద్దగా ఆదరణ లభించలేదు. అధిక ధరల కారణంగా చాలా మంది ఈ రైళ్లకు దూరంగా ఉంటారు. ఎప్పుడో ఒకసారి ప్ర యాణించే వాళ్లయితే ప్రయాణ అనుభూతి కోసం  ఈ రైలులో ఎక్కేందుకు ఆసక్తి చూపిస్తారు.

కానీ రెగ్యులర్‌గా ప్రయాణాలు చేసే మధ్యతరగతి ప్రజలు వందేభారత్‌కు కాస్త దూరంగానే ఉంటారని సర్వేలు చెబుతున్నా యి. అయితే ఆశ్చర్యంగా హైదరాబాద్ నగ రం నుంచి విశాఖకు, అక్కడి నుంచి నగరానికి తిరిగే వందేభారత్ రైళ్లకు ఎక్కడ లేని డిమాండ్ ఏర్పడింది. దీంతో ఇప్పటి వరకు నడుస్తున్న రెండు వందేభారత్ రైళ్ల బోగీల సంఖ్యను దక్షిణ మధ్య రైల్వే పెంచేసింది.

సరిగ్గా సంక్రాంతి వేళ బోగీలను పెంచడంతో ప్రయాణికులకు ఎంతో ఉపశమనంగా మా రింది. నగరం నుంచి విశాఖకు రెండు వందేభారత్ రైళ్లు నడుస్తుండగా... ఒకటి తిరుపతికి, ఇంకోటి బెంగళూరుకు, మరోటి నాగ్ పూర్‌కు నడుస్తున్నాయి. అయితే ప్రస్తుతం వందేభారత్ రైళ్లకు మంచి ఆదరణ ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి చెన్నై, పుణె, ముంబై, గోవాకు వందేభారత్ రైళ్లు ప్రవేశపెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.

బోగీలు పెంచేశారు..

ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి ప్రయాణించే (రైలు నెం 20833/84) వందేభారత్ రైలులో బోగీలను 16 నుంచి 20కి పెంచారు. ఇది శనివా రం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పెంపుతో ప్రయాణ కెపాసిటీ 1,128 నుంచి1,440కి చేరింది. రైలు కోచ్‌ల పెంపు తర్వాత 1,336 మంది ప్రయాణికులు ప్రయాణించేలా 18 చైర్ కార్ కోచ్‌లు, 104 మంది ప్రయాణించేలా రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లు అం దుబాటులోకి వచ్చాయి.

ఇప్పుడు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు తిరిగే మరో వందేభారత్ రైలు (నెం.20707/08)కు కూడా అదనపు కోచ్‌లను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 8 కోచ్‌లతో నడుస్తున్న ఈ రైలుకు అదనంగా మరో 8 కోచ్‌లను నేటి నుంచి అందుబాటులోకి తెస్తున్నారు. ప్రస్తుతం 530 సీట్ల సామర్థ్యం ఉండగా... పెంచిన బోగీలతో 1,128 సీట్ల సామర్థ్యానికి పెరిగింది.

సికింద్రాబాద్- విశాఖ మధ్య తిరిగే రెండు వందేభారత్ రైళ్లు కూడా 150 శాతం డిమాండ్‌తో నడుస్తున్నాయని అందుకే రెండింటికీ బోగీలు పెంచామని ద.మ.రైల్వే అధికారులు తెలిపారు. సరిగ్గా సంక్రాంతి సమయంలో రెండు రైళ్లకు కలిపి 12 బోగీలను పెంచడం వల్ల ప్రయాణికులకు ఎంతో ఉపశమనంగా మారిందని రైల్వే వర్గాలు తెలిపాయి. 

చార్జీలు ఎక్కువైనా..

వందేభారత్ రైళ్లకు భారీగా చార్జీలుంటాయి. ఏసీ చైర్ కార్‌లో సికింద్రాబాద్ నుంచి విశాఖ చేరుకునేందుకు రూ.1,720 (భోజనంతో సహా) వసూలు చేస్తుంటే.. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్‌లో రూ.3,170 (భోజనంతో సహా) చార్జీలున్నాయి. అయినప్పటికీ ఈ రైళ్లు 150 శాతం డిమాండ్‌తో నడుస్తున్నాయి. ఇది గమనించిన రైల్వే శాఖ రెండు రైళ్లకు కలిపి 12 బోగీలను పెంచింది. ఫలితంగా సంక్రాతి సీజన్‌లో రైల్వేకు ఆదాయంతో పాటు ప్రయాణికులకు కష్టాలు తీరాయి. 

కేవలం 5 వందేభారత్‌లేనా..

తెలంగాణ, ఏపీలో వందేభారత్ రైళ్లకు భారీ డిమాండ్ ఉందని చెప్పేందుకు సికింద్రాబాద్-విశాఖపట్టణం, సికింద్రాబా ద్--తిరుపతి, కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ రైళ్లు చక్కని ఉదాహరణ. అయితే ఇందుకు తగ్గట్టుగా మరిన్ని రూట్లలో కొత్తగా వందేభారత్‌లను ప్రవేశపెట్టడంలో రైల్వే శాఖ వైఫల్యం కనిపిస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు.

ప్రస్తుతం నడుస్తున్న రూట్లతో పాటు తెలంగాణ నుంచి ప్రజలు ఎక్కువగా ప్రయాణించే చెన్నై, పుణె, ముంబై, గోవాకు వందేభారత్ రైళ్లను ప్రవేశపెడితే ప్రయాణికులకు సౌకర్యంగానూ, రైల్వేకు ఆదాయంగానూ ఉంటుందని అంటున్నారు. చెన్నైకి వందేభారత్ వేస్తే ఆ రైలును వయా రేణిగుంట నడపాలని ఫలితంగా చెన్నైతో పాటు తిరుపతి వెళ్లే ప్రయాణికులకు కూడా మరో వందేభారత్ అందుబాటులోకి వచ్చినట్లు ఉంటుందని రెగ్యులర్‌గా తిరుపతికి వెళ్లే ప్రయాణికులు విజయక్రాంతికి తెలిపారు.