08-04-2025 11:17:00 PM
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల పరిధిలోని మత్తమాల గ్రామంలో మంగళవారం నాడు సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావు ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పరివర్తన రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మండల కేంద్రాలతో పాటు గ్రామాలలో రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ నిర్వహిస్తున్నామని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు చేస్తుందని, రాజ్యాంగం ద్వారానే అన్ని వర్గాల ప్రజలకు సమన్వయం జరుగుతుందని పేర్కొన్నారు.
అంబేద్కర్ కేవలం కొంతమంది ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని రాయలేదని,రాజ్యాంగం ద్వారా కులమత వర్గ లింగ బేధాలు లేకుండా అందరికీ సమాన న్యాయం జరిగే విధంగా రాజ్యాంగ రూపకల్పన చేశారని అన్నారు. కొంతమంది బిజెపి నాయకులు అంబేద్కర్ను ఒక వర్గానికే పరిమితం చేసి అవమానిస్తున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ భారతీయులందరికీ స్వేచ్ఛ స్వతంత్రం ప్రజాస్వామ్య హక్కులను అందించాడని అంత గొప్ప ప్రతిభవంతుని ఇటీవల పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి అమిత్ షా అవమానించడం దుర్మార్గమైన చర్య అని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాల రాస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. అనంతరం రుద్రారం గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఉచిత సన్న బియ్యం పొందుతున్న లబ్ధిదారులు సాయిలు ఇంట్లో భోజనం చేశారు. పరువులందరికీ సన్న బియ్యం అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ఉద్యోగులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.