03-04-2025 11:32:17 PM
ముక్కలు ముక్కలయిన ఎయిర్‌క్రాఫ్ట్..
గాంధీనగర్: గుజరాత్‌లోని జామ్‌నగర్ సమీపంలో బుధవారం ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఓ విమానం కూలిన విషయం తెలిసిందే. అయితే కూలిన తర్వాత ఈ విమాన పైలట్‌కు గాయాలయ్యాయని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత అతడు మరణించినట్లు ఐఏఎఫ్ (ఇండియన్ ఎయిర్‌ఫోర్స్) ఓ ప్రకటనలో తెలిపింది. జామ్‌నగర్ సిటీకి 12 కి.మీ దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమానం కూలిపోగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
దీంతో స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో సాధారణ పౌరులెవరూ మరణించలేదని ఐఏఎఫ్ పేర్కొంది. ఈ ఘటన మీద విచారణకు ఆదేశించినట్లు కూడా పేర్కొంది. ‘ఈ ప్రమాదంలో దురదృష్టవశాత్తు ఓ పైలట్ చనిపోయాడు. మరో పైలట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఐఏఎఫ్ ఈ ఘటనపై తీవ్రంగా చింతిస్తుంది’ అని పేర్కొంది. గాయాలపాలయిన పైలట్‌కు ప్రభుత్వాధీనంలో నడిచే జీజీ ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉందని స్థానిక పోలీసులు తెలిపారు.