calender_icon.png 26 November, 2024 | 5:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

12-09-2024 02:21:14 PM

పోలీస్ పేర సైబర్ నేరగాళ్లు చేసే ఫోన్ కాల్స్ పై జాగ్రత్త 

సైబర్ నేరాలకు గురైతే టోల్ ఫ్రీ నెంబర్ 1930కి కాల్ చేయండి 

జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

జగిత్యాల, (విజయక్రాంతి): పెరిగిన సాంకేతిక పరిజ్ఞానికి తోడు సైబర్ మోసగాళ్లు వివిధ రూపాల్లో ప్రజలను బురిడి కొట్టించి డబ్బులు దండుకునే మోసాలకు పాల్పడుతున్నారని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. గురువారం ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. పోలీసుల పేరుతో అగంతుకుల ఏదో ఒక నెంబర్‌ నుంచి ఫోన్‌ చేయడం, మీ కుటుంబ సభ్యులు ఏదో కేసులో ఇరుక్కున్నారన్నారని బెదిరించి డబ్బులు డిమాండ్‌ చేయడం, లేక సైబర్‌ నేరాలకు పాల్పడేందుకు వ్యక్తిగత వివరాలు అడగడం, లేదంటే నెంబర్‌ బ్లాక్‌ అవుతుందని దబాయించడం వంటి కేసులు పెరిగిపోయాయిని అన్నారు.

ఇలాంటి ఫోన్ కాల్స్ కు, గుర్తుతెలియని వ్యక్తులు చెప్పే మాటలు,ఫోన్లకు వచ్చే మెసేజ్ లింక్లకు స్పందించవద్దని ఎస్పీ సూచించారు.  సైబర్ నేరగాళ్లు రోజుకోరకంగా మోసాలకు పాల్పడుతున్నారని, ఫేక్ ఫోన్ కాల్స్ కు స్పందించకపోవడమే మంచిదన్నారు. ఇంటర్నేషనల్ కాల్స్,కొత్త నంబర్ల నుంచి ఫోన్ వస్తే అప్రమత్తంగా ఉండాలని, అజ్ఞాత వ్యక్తుల నుంచి డ్రగ్స్ పార్శిళ్ల పేరుతో ఫోన్ కాల్స్ కానీ, ఐవీఆర్ కాల్స్ వస్తే వాటికి అసలే స్పందించవద్దని, ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దని, డ్రగ్స్ కేసు అని, ఉగ్రవాదులతో సంబంధాలని బెదిరిస్తే భయపడి డబ్బులు బదిలీ చేయొద్దని జిల్లా ఎస్పీ సూచించారు. మోసానికి గురైతే సైబర్ క్రైం హెల్ప్ లైన్ నంబర్ 1930 ఫోన్ చేయాలని కోరారు.

లేదంటే స్థానిక పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. మీకు లాటరీ, లోన్ వచ్చిందని, కాల్,మెసేజ్ వస్తే ఆశపడి గోస పడకుండా టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి కాల్ చేయాలన్నారు.  చైన్మార్కెటింగ్ (గొలుసుకట్టు) మోసాలు ఏదైనా కంపెనీ పేరుతో ముందుగా మీరు కొంత డబ్బు కట్టి జాయిన్ అవ్వండి ఆ తరువాత మరో ముగ్గురిని జాయిన్ చేయిస్తే లైఫ్ లాంగ్ ఇంకాం ఉంటుంద ని మోసం చేస్తారని అన్నారు. అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే వీడియో కాల్స్ లిఫ్ట్ చెయ్యకండి, చేస్తే వాళ్ళు నగ్నంగా ఉండి, మీకు చేసిన వీడియో కాల్ రికార్డు చేసి, మిమ్మల్ని బెదిరించి డబ్బులు లాగేస్తారని, వేలల్లో పెట్టుబడి లక్షల్లో లాభాలు అంటూ వచ్చే వాట్సాప్, టెలిగ్రామ్ ప్రకటనల నమ్మొద్దని ఎస్పీ తెలిపారు. 

తక్కువ డబ్బులను పెడితే లాభాలొచ్చి ఎక్కువ మొత్తం లో డబ్బులు పెట్టినప్పుడు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తారని ఎస్పీ గుర్తు చేశారు. మీకు ఉద్యోగం ఇస్తాం అంటూ మెసేజెస్ చేసి, డబ్బులు కట్టించుకునే వాళ్ళు సైబర్ మోసగాళ్ళను గ్రహించాలని, "ఇంస్టాగ్రామ్" లో తెలిసిన వ్యక్తి ఫోటో వుండి మిమ్మల్ని డబ్బులు పంపమని అడిగితే ఆ మెసేజి మీకు తెలిసిన వ్యక్తే పంపాడా? తెలుసుకోకుండా మోసపోవద్దన్నారు. సోషల్ మీడియా లో ప్రకటనలు చూసి పెట్టుబడి పెట్టకండి, కొంచెం ఆగి ఆలోచించండి, అది సైబర్ మోసం కూడా కావచ్చన్నారు. మీ ప్రమేయం లేకుండా ఓటీపీ వస్తే దాన్ని ఎవరికీ చెప్పకండని అది సైబర్ నేరగాళ్ల ఎత్తుగడ అయివుండవచ్చని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.