calender_icon.png 23 October, 2024 | 6:56 PM

జాగృత జనగామ జంగ్!

17-09-2024 04:53:52 AM

  1. సాయుధ పోరాటానికి వెన్నెముక ఈ తాలూక
  2. నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రామ రక్షణ దళాల ఏర్పాటు

జనగామ, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): నిజాం రాజ్యాన్ని కూలదోయడానికి జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో జనగామ తాలూక పల్లెలు వీరోచితంగా పోరాడాయి. గ్రామస్తులు గ్రామ రక్షణ దళాలుగా ఏర్పడి రజాకార్లు, పోలీసులు, దొరలపై సమరశంఖం పూరించారు. జనగామ పడమటి ప్రాంతంలో మొదలైన గెరిల్లా దళ శిక్షణ తెలంగాణలోని మిగతా ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచింది. 1947 నవంబర్‌లో నాటి కమ్యూనిస్టు పార్టీ పిలుపు మేరకు రక్షణ దళాల ఏర్పాటు వేగవంతమైంది. వడ్లకొండలో డి.నరహరి, మేదిని గాలిరెడ్డి, దేవసాని వెంకటయ్య, శేఖరయ్య, పసరమడ్లలో కడారు సాయిరెడ్డి, చీమ మల్లయ్య, యాదగిరి, పూసల మల్లయ్య, చీటకోడూరులో కొత్త ముకుందారెడ్డి, కొత్త రాంరెడ్డి, కొత్త జనార్దన్‌రెడ్డి, కొత్త నారాయణరెడ్డి, కొత్త మల్లారెడ్డి  ఆధ్వర్యంలో దళాలు ఏర్పడ్డాయి. దళాలు గెరిల్లా పోరాట మార్గంలో ముందుకెళ్లాయి. 

దళాలు తుపాకులు పట్టేందుకు శిక్షణ..

గ్రామాల్లో రక్షణ దళాల సంఖ్య పెరుగుతండడంతో రజాకార్లు దాడులను ఉధృతం చేశారు. ఎన్నో పల్లెల్లో నరమేధం సృష్టించారు. వేలాది మంది స్త్రీల మానాన్ని దోచుకున్నారు. చీటకోడూరులో 50 ఇండ్లు తగులపెట్టారు. దళ సభ్యులను కాల్చి చంపారు. వడ్లకొండ గ్రామంలో దళ సభ్యుడు యాదగిరితో పాటు మరో ఇద్దరుని మట్టుపెట్టారు. అనంతరం కమ్యూనిస్టు పార్టీ రక్షణ దళాలకు గెరిల్లా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.ఆరుట్ల రాంచంద్రారెడ్డి, కుర్రారం రాంరెడ్డి, తమ్మారెడ్డి సత్యనారాయణరెడ్డి శిక్షణకు బాధ్యత వహించారు. శిక్షణ తర్వాత ఒక్కో దళ సభ్యుడు అప్పటి వరకు ఒడిసెలు, గుత్పలు, రాళ్లతో మాత్రమే పోరాటం చేసిన వారు అప్పటి నుంచి తుపాకులు పట్టడం ప్రారంభించారు.