calender_icon.png 1 April, 2025 | 11:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెరపైకి జగ్గారెడ్డి జీవితం

31-03-2025 12:07:13 AM

జగ్గారెడ్డి.. ప్రస్తుతం టీపీసీసీ కార్యనిర్వాహకు అధ్యక్షుడి బాధ్యతల్లో ఉన్నారు. ఇంతకాలం రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఆయన సినిమా రంగంలో అడుగుపెడుతున్నారు. ‘జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్’ అనే పేరుతో ఓ సినిమా రాబోతోంది. ఇందులో జగ్గారెడ్డి టైటిల్ రోల్ పోషించ నున్నారు. 

దర్శకుడు వడ్డి రామానుజం తెరకెక్కించనుండగా.. జగ్గారెడ్డి కూతురు జయలక్ష్మిరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలో చిత్రీకరణ పనులు ప్రారంభం కానున్నాయి. దీంతో ఉగాది సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో సినిమా ఆఫీస్‌ను ప్రారంభించారు.

ఈ సంద ర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. “దర్శకుడు రామానుజం చూపించిన ‘జగ్గారెడ్డి వార్ ఆఫ్ లవ్’ పోస్టర్‌కు నేను ఆకర్షితుడునయ్యా. తర్వాత ఆయన చెప్పిన కథ నచ్చింది. అందులో నా పాత్రను నేనే పోషిస్తున్నా. ఎవరో రాసిన మాటలు పాత్రలుగా నేనుండను. అంతా ఒరిజినల్, మీకు తెలిసిన జగ్గారెడ్డిని తెరమీద చూస్తారు.

విద్యార్థి నాయకుడి నుంచి రాష్ట్ర నాయకుడి వరకూ నా జీవితంలో చాలా మలుపులున్నాయి. కుట్రలు, కుతంత్రాలు, హత్యాయత్నాలు దాటుకొని ఇంతవరకు చేరిన నా ప్రయాణం ఈ సినిమాలో చూస్తారు. సినిమా ఇండస్ట్రీలో కూడా నా ప్ర యాణం మొదలైంది. దీనికి అడ్డాగా మా ఈ ఆఫీస్ ఉంటుంది” అన్నారు. దర్శకుడు రామానుజం మాట్లా డుతూ.. ‘సంగారెడ్డికి వెళ్లి జగ్గారెడ్డి గురించి తెలుసుకున్నా. ఇందులో జగ్గారెడ్డి పాత్ర అద్దంలా ఉంటుంది.

కానీ దాన్ని పగులగొడితే అది ఒక ఆయుధం అవుతుంది. అదే ఆయన పాత్ర. జగ్గారెడ్డి ఎంత మాస్ లీడరో అందరికీ తెలుసు. ఆయన జీవితంలోని ముఖ్య సంఘటనలు ఈ సినిమాలో కనిపిస్తాయి. మంచి ప్రేమకథ కూడా ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా ప్రారంభమవుతుంది’ అన్నారు. నిర్మాత జయలక్ష్మిరెడ్డి మాట్లాడుతూ.. ‘మా నాన్న జగ్గారెడ్డి జీవితంలోని కొన్ని సంఘటనలను నేను విన్నా. ఇప్పుడు వాటిని తెరమీద చూడబోతున్నాం. ఇది నన్ను ఎగ్జుటై చేస్తోంది. సినిమా కూడా అందరికీ నచ్చేవిధంగా ఉంటుంది’ అన్నారు.