25-03-2025 11:57:13 PM
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో భారీ ఎత్తున నోట్ల కట్టలు బయటపడిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై చర్చించేందుకు తాజాగా ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ మంగళవారం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ‘ఇది చాలా క్లిష్టమైన అంశం. దీనిపై రాజ్యసభాపక్ష నేత, ప్రతిపక్ష నేతతో చర్చించా. దీనిపై అఖిలపక్ష సమావేశం పెడితే బాగుంటుందని వారు సూచించారు. రాజ్యసభలో అన్ని పార్టీల పక్ష నేతలు దీనికి హాజరుకావాలని కోరుతున్నా’ అని ధన్‌ఖడ్ వెల్లడించారు.
ఈ భేటీ విజయవంతం కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం సందర్భంగా ఈ నోట్ల కట్టలు బయటపడిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తిని అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది.