calender_icon.png 29 September, 2024 | 7:55 PM

జగన్ తిరుమల పర్యటన రద్దు

28-09-2024 01:54:35 AM

డిక్లరేషన్‌పై డిమాండ్‌తో వెనక్కు తగ్గిన మాజీ సీఎం

దైవదర్శనానికి వెళ్లేవారిని అడ్డుకుంటున్నారు

మీడియా సమావేశంలో జగన్ ఆరోపణలు

ఎవరూ జగన్‌ను అడ్డుకోలేదని సీఎం చంద్రబాబు వివరణ

విజయవాడ, సెప్టెంబర్ 27: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దు అయింది. లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో శ్రీవారిని దర్శనానికి తిరుమల వెళ్లాలని శుక్రవారం జగన్ నిర్ణయించుకున్నారు.

ఈ నేపథ్యంలో డిక్లరేషన్‌పై జగన్ సంతకం చేయాలన్న డిమాండ్ ఊపందుకున్న క్రమంలో పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం తిరుమల లడ్డూ వివాదంపై తాడేపల్లిలోని వైసీపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో జగన్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందని, చంద్రబాబు క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

దేవుని దర్శనానికి వెళ్తామంటే నోటీసులు ఇచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సొంత వాహనాల్లో కార్యకర్తలతో వెళ్లడానికి అనుమతి లేదని, అందువల్ల ఈ కార్యక్రమంలో పాల్గొనవద్దని వైసీపీ నాయకులకు నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. 

రాజకీయ లబ్ధి కోసమే అబద్ధాలు

జంతువుల కొవ్వుతో ప్రసాదాలు చేశారని అబద్ధాలు చెబుతున్నారు. లడ్డూపై చెప్పినవన్నీ అసత్యాలేనని రుజువులు కనిపిస్తున్నాయి. తిరుమల పవిత్రతను, శ్రీవారి ప్రసాదాన్ని రాజకీయం చేస్తున్నారు. టీటీడీలో ఆర్నెల్లకోసారి టెండర్లు పిలవడం దశాబ్దాలుగా ఉన్నదే. తక్కువ రేటు కోట్ చేసినవారికి టెండర్ ఖరారు చేస్తుంది. క్వాలిటీ చెక్ తర్వాతే వాహనాలు వస్తాయి.

గతంలో టీటీడీ హయాంలోనూ కొన్ని ట్యాంకర్లను వెనక్కి పంపించారు. శ్రీవారి ప్రసాదాల్లో వాడని నెయ్యిని వాడినట్లు ఎందుకు చెబుతున్నారు? నమానాలను అప్పుడప్పుడు సీఎఫ్‌టీఆర్‌ఐ మైసూరుకు పంపిస్తారు. ఈ సారి మొదటిసారి గుజరాత్‌కు పంపారు. ఆవులు వెజిటబుల్ నూనెలు తిన్ననా ఇలాంటి వస్తాయని నివేదిక డిస్‌క్లయిమర్స్‌లో రాశారు.

రహస్య నివేదిక అయితే పార్టీ ఆఫీస్ నుంచి ఎలా బయటకి వచ్చింది? ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని వాడలేదని టీటీడీ ఈవో చెప్పారు. అయినా సీఎం మళ్లీ అబద్ధాలు చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం ఇలా అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని జగన్ ధ్వజమెత్తారు. 

నా మతం మానవత్వం

ఇప్పుడు లడ్డూ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు డిక్లరేషన్ అంశాన్ని తీసుకువచ్చారని జగన్ ఆరోపించారు. తాను గతంలోనూ అనేకసార్లు తిరుమలకు వెళ్లానని, శ్రీవారి దర్శనం చేసుకున్నాకే పాదయాత్రను ప్రారంభించానని జగన్ గుర్తుచేశారు. యాత్ర పూర్తయ్యాక కూడా నడిచివెళ్లి స్వామివారిని దర్శించుకున్నట్లు చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి ఐదుసార్లు వస్త్రాలు సమర్పించానని పేర్కొన్నారు.

తన కులం, మతం గురించి ప్రజలందరికీ తెలుసునని, తాను ఇంట్లో బైబిల్ చదువుతానని, గుడికీ వెళతానని చెప్పారు. తన మతం మానవత్వమని పేర్కొన్నారు. సెక్యులర్ ప్రభుత్వాలుగా చెప్పుకునేవారు మాజీ సీఎంతోనే ఇలా వ్యవహరిస్తే దళితుల పరిస్థితి ఏంటని నిలదీశారు. మతం పేరుతో రాజకీయాలు చేయడం చాలా దౌర్భాగ్యమని తీవ్రస్థాయిలో స్పందించారు.  

సంప్రదాయాలు పాటించాల్సిందే: శ్రీనివాసానంద సరస్వతి

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలంటే ఎవరైనా సంప్రదాయాలు పాటించాలని సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ అన్నారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. జగన్ ఏనాడైనా సతీసమేతంగా తిరుమలకు వచ్చారా? హిందువుల మనోభావాలు, విశ్వాసాలను ఆయన ఏనాడూ గౌరవించలేదు. ఐదేళ్లలో ఎన్నో పాపాలు జరిగాయి. ప్రక్షాళన చేయాల్సిందే. ఆలయాలు, పూజారులపై దాడులు జరిగినా పట్టించుకోలేదు అని ఆరోపించారు.

సంతకం చేయరు: భూమన

తిరుమల శ్రీవారి దర్శనానికి జగన్ వచ్చే సమయంలో డిక్లరేషన్‌పై ఎందుకు సంతకం చేయాలని వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి ప్రశ్నించారు. తిరుపతిలో మాట్లాడుతూ.. జగన్ ఆ పని చేయరు. సంతకం చేయకుండానే తిరుమలకు వెళ్తాం. స్వామివారిని దర్శించుకుంటామన్నారు.

చంద్రబాబు కౌంటర్

జగన్‌ను తిరుమలకు వెళ్లవద్దని ఎవరూ చెప్పలేదని, ర్యాలీలు, జనసమీకరణలు చేయొద్దని మాత్రమే సూచించినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో మాట్లాడుతూ.. తిరుమల వివాదంపై జగన్ చేసిన ఆరోపణలను ఖండించారు. జగన్ తిరుమలకు వెళ్లొద్దని పోలీసులు నోటీసులు ఇచ్చారా? ఇస్తే వాటిని చూపించాలని డిమాండ్ చేశారు.

ఇటీవలి పరిణామాలతో భక్తులు ఆందోళనలో ఉన్నారని, అందుకే ఎలాంటి ఘటనలు జరగకుండా తిరుపతిలో సెక్షన్ 30 అమల్లో ఉందని చెప్పారు. ప్రతి మతానికి కొన్ని ఆచారాలు ఉంటాయని, తిరుమలకు వెళ్లాలంటే వాటిని కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.

గతంలో జగన్ నియమాలు ఉల్లంఘించి తిరుమలకు వెళ్లారని, ఇతర మతాలను గౌరవించడం అంటే ఆయా ఆలయాల సంప్రదాయాలను పాటించడమేనని చెప్పారు. క్రైస్తవుడినని ఒప్పుకున్నాక డిక్లరేషన్ ఇచ్చేందుకు ఇబ్బంది ఏంటని నిలదీశారు. కల్తీ జరగలేదని జగన్ ఎలా చెబుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. 

ప్రసాదంలో కల్తీ దుర్మార్గం: మాధవీలత

టీటీడీ నిబంధనల ప్రకారం జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోతే కొండకిందే ఆపేయాలని బీజేపీ తెలంగాణ నేత మాధవీలత డిమాండ్ చేశారు. తిరుమల కొండకు కాలినడనక చేరుకున్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో తిరుమలను వ్యాపార క్షేత్రంగా మార్చారని ధ్వజమెత్తారు.

గత ఐదేళల్లో కొండపై జరిగిన అక్రమాలన్నీ బయటకు రావాలన్నారు. భక్తులు ఎంతో ఇష్టంగా స్వీకరించే శ్రీవారి ప్రసాదంలో జంతువుల నూనెలు కలపడం అత్యంత దుర్మార్గామని దుయ్యబట్టారు. ఈ విషయంలో సీబీఐ విచారణకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కల్తీకి బాధ్యులైన వారికి శిక్ష పడేదాకా పోరాడుతామని స్పష్టం చేశారు. 

జగన్‌కూ ఆ రూల్ వర్తిస్తుంది: షర్మిల

జగన్ ప్రభుత్వంలోనే లడ్డూ కల్తీ జరిగిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. ల్యాబ్ నివేదిక ఈ విషయం స్పష్టం చేస్తుందన్నారు. ఈ అంశంలో పూర్తి నిజానిజాలు ప్రజలకు తెలియాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్లు తెలిపారు. డిక్లరేషన్ రూల్ జగన్‌తో పాటు అందరికీ వర్తిస్తుందని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు.