- అదానీతో జగన్ ఒప్పందం అంతర్జాతీయ చరిత్రే
- ప్రపంచ అవినీతిపరుల జాబితాలో జగన్ పేరు
- ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
అమరావతి, నవంబర్ 29: ఏపీ మాజీ సీఎం జగన్‌పై ఏపీసీసీ అధ్యక్షురాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అదానీతో జగన్ చేసుకున్న విద్యుత్ ఒప్పందం అంతర్జాతీయంగా చరిత్రే అని ఆమె ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ విద్యుత్ కాంట్రాక్టుల కోసం ఓ కంపెనీ రూ.1,750 కోట్లు సీఎంకు లం చంగా ఇవ్వడం చరిత్రేనని విమర్శించారు.
తనపై వచ్చిన ఆరోపణలకు జగన్ అబద్దపు సమాధానాలు చెప్పినందుకు ఆయనకు ఆస్కార్ ఇవ్వాలని సూచించారు. యూనిట్‌కు 50 పైసలు ఎక్కువ పెట్టి అదానీ వద్ద ఎందుకు కొన్నారని, ఆ ఒప్పందం వెనక ఉన్న మతలబు ఏమిటిని ప్రశ్నించారు. అదానీకి కోసం అన్ని టెండర్లను ఎందుకు రద్దు చేశారని నిలదీశారు.
ప్రజల నెత్తిన రూ.1.67 లక్షల కోట్ల భారా న్ని మోపడం చరిత్రేనని, ప్రపంచ అవినీతిపరుల జాబితాలో మీ పేరు చేరడం పెద్ద చరిత్రేనని ఆమె ఎద్దేవా చేశారు. అమెరికా కేసులో తన పేరు ఎక్కడుందని జగన్ అంటున్నారని, నాటి ఏపీ సీఎం అంటే మీరు కాదా అని నిలదీశారు. జగన్ అవినితికి పాల్పడ్డారని అమెరికా దర్యాప్తు సంస్థలే చెప్పాయని ఆమె పేర్కొన్నారు.
ఒప్పందంతో రాష్ట్రాన్ని 25 ఏండ్లపాటు అదానీకి జగన్ తాకట్టుపెట్టారని మండిపడ్డారు. తాకట్టు పెట్టినందుకు జగన్‌కు ఎంత ముట్టిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని బ్లాంక్ చెక్‌లా అదానీకి కట్టబెట్టారని ఆరోపించారు.
గంగవరం పోర్టును అదానీకి రూ.640 కోట్లకే అదానీకి జగన్ అమ్మేశారని ఆరోపించారు. అదానీ వల్ల తనకు ఎటువంటి ఆర్థిక లబ్ధి జరగలేదని జగన్ ప్రమాణం చేయాలని, దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరిం చాలని ఆమె డిమాండ్ చేశారు.