24-03-2025 11:30:30 AM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ శాసనసభలో జరుగుతున్న బడ్జెట్ పద్దుల చర్యలకు బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి సోమవారం శాసనసభకు వచ్చారు. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలను చేశారని ఆరోపిస్తూ జగదీష్ రెడ్డిని ఈ అసెంబ్లీ సమావేశాల నుండి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. సభకు రావద్దని జగదీశ్ రెడ్డికి చీఫ్ మార్షల్ సూచించారు. తనను సభకు రావద్దని సభాపతి ఇచ్చిన బులెటిన్ చూపించాలని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అసెంబ్లీ వద్ద మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఇప్పటికీ రెండుసార్లు స్పీకర్ ని కలిసి ఎందుకు తనను సస్పెండ్ చేశారో బులెటిన్ ఇవ్వాలని కోరడం జరిగిందని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. తామకు బులెటిన్ ఇస్తే కోర్టుకు వెళ్తామనే భయంతోనే ఇవ్వడంలేదని ఆరోపించారు.
అసెంబ్లీకి రావొద్దు అనడానికి ఎలాంటి పరిమితి ఉంది..?, ఆయనను సస్పెండ్ చేసినట్లు బులెటిన్ ఇస్తే తను సభకు రాను అని, ఏ కారణంతో సస్పెండ్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. వారం నుంచి ఎలాంటి బులెటిన్ విడుదల చేయలేదని, అసెంబ్లీ కాంగ్రెస్ ఇష్టారాజ్యంగా నడుస్తోందని, పద్దతి ప్రకారం నడవట్లేదని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. రాజ్యాంగ విలువలు, నిబంధనలు లేకుండా అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయని, తనను సస్పెండ్ చేశారో లేదో ఇప్పటికీ ఆధారాలు లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకత్వానికి పరాకాష్టలా కనిపిస్తోందని, తన సస్పెన్షన్ పై బులెటిన్ ఇవ్వాలని లేదంటే సభాపతిని కలుస్తా అని జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. సభలో ప్రతిపక్ష నేతలు అడిగే ప్రశ్నాలకు మంత్రులు జవాబివ్వలేక ప్రశ్నోత్తరాలు రద్దు చేస్తున్నారని విమర్శించారు. దావత్ లకు కూడా మంత్రులు ప్రభుత్వ హెలికాప్టర్లలో వెళ్తున్నారని, నిన్న జరిగిన జానారెడ్డి దావత్ కు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెలికాప్టర్ లో వెళ్లారని విరుచుకుపడ్డారు.