calender_icon.png 23 February, 2025 | 3:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాదవ్ పరిచయంతో ఉద్యమించా!

23-02-2025 12:00:00 AM

“నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా చేసుకొని తెలంగాణ ఉద్యమం కొనసాగింది. నిధులు, నియామకాల సంగతి పక్కన పెడితే అప్పట్లో నీళ్ల కోసం యుద్ధాలు చేయాల్సి వచ్చేది. తీవ్ర కరువుతో పచ్చని పొలాలు బీడుగా మారేవి. ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పుల ఊబిలోనూ కూరుకుపోయారు. ఆ ఘటనలే నన్ను తెలంగాణ ఉద్యమం వైపు అడుగులు వేసేలా చేశాయి” అన్నారు తెలంగాణ యువజన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, ఉద్యమకారుడు వలిగొండ విజయరాజు. ఆనాటి తెలంగాణ ఉద్యమ సంగతులను, జ్ఞాపకాలనూ ‘విజయక్రాంతి’తో పంచుకున్నారాయన. 

నాది నల్లగొండ జిల్లా, ఆలేరు మండలం మటూరు గ్రామం. మా అమ్మమ్మ, తాతయ్యలు కమ్యూనిస్టు పార్టీలో కీలకంగా పనిచేశారు. తల్లిదండ్రులు వలిగొండ బాబు, సుగణ్య. మా నాన్న అప్పట్లోనే దళితుల అక్షరాస్యత కోసం ఉద్యమించారు. రాత్రి బడికి శ్రీకారం చుట్టి ఎంతోమంది దళిత పిల్లలకు అక్షరాలు నేర్పించారు. ఇది సహించని అగ్రవర్ణాలు మా కుటుంబంపై దాడులు చేశాయి. దాంతో జనగాం జిల్లాకు షిఫ్ట్ అయ్యాం.

కొలనుపాక సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో నా చదువు కొనసాగింది. ఆ సమయంలోనే వామపక్ష భావాలు నాలో బలంగా పాతుకుపోయాయి. ఆ కమ్రంలో పది, ఇంటర్ పూర్తయ్యాకా సోషల్ ఇష్యూస్‌పై నాలాంటివారితో కలిసి ఎన్నో నిరసన కార్యక్రమాలు చేశా. అప్పట్లో ఏ ధర్నా కార్యక్రమం చేసినా పోలీసుల నిఘా గట్టిగానే ఉండేది. నేను నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం గమనించి పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భాలెన్నో ఉన్నాయి. 

తీవ్ర కరువును చూశా

తరచూగా పోలీసులు స్టేషన్లకు తీసుకెళ్లడంతో కొన్నాళ్లు వ్యవసాయం చేయాలని తల్లిదండ్రులు కండీషన్ పెట్టారు. 1996లో తీవ్ర కరువు ఉండేది. పశువులకు గడ్డి కూడా దొరికేది కాదు. మంచినీటి కోసం కిలోమీటర్ల దూరం నడిచా. సాగు నీరు లేక కళ్లముందే పంటలు ఎండిపోయేవి. ఇలా ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఆనాటి తీవ్ర కరువు పరిస్థితులు, జరిగిన ఘటనలూ తెలంగాణ ఉద్యమం వైపు అడుగులు వేసేలా చేశాయి. నీళ్లు, నిధులు, నియామకాలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందని గట్టిగా భావించా. 

కేశవ రావ్ జాదవ్‌తో పరిచయం

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జనగాం నుంచి హైదరాబాద్‌లో అడుగుపెట్టా. తెలంగాణ ఉద్యమ తొలితరం నేత కేశవ రావ్ జాదవ్‌తో పరిచయమైంది. ఆ సమయంలో పౌరహక్కుల కోసం చురుగ్గా పనిచేస్తున్నారు. ఆయన పరిచయంతో పౌరహక్కుల కోసం ఉద్యమించా. ‘రాజ్ నువ్వు ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొనాలంటే, ముందు చదువును కంప్లీట్ చేయ్’ అని సలహా ఇవ్వడంతో ఎల్‌ఎల్‌బీ మొదలుపెట్టా.

ఒకవైపు కార్యక్రమాల్లో పాల్గొంటూనే, మరోవైపు ఉద్యమంలో భాగమయ్యా. అయితే ఆ రోజుల్లో రాజకీయ నేతలు మా లాంటివారిని తమ అవసరాల కోసం వాడుకునేవారు. దాంతో ఉద్యమకారులు సైతం ‘ఎన్నికలకు వెళ్లాల్సిందే’ అనే బలమైన డిమాండ్‌ను లెవదీశా. అప్పట్నుంచే నాలాంటివారికి తగిన గుర్తింపు లభించింది.

‘తెలంగాణ దిన పరిషత్’ స్టీరింగ్ కమిటీ మెంబర్‌గా యువతను ఐక్యం చేశా. ఆ తర్వాత తెలంగాణ యువజన వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా హైదరాబాద్ శివారులోని జవహర్‌నగర్ 2009లో 200 మంది కళాకారులతో భారీ బహిరంగ సభ నిర్వహించా. దానికి నేనే అధక్ష్యత వహించి, ఊహించనివిధంగా ఆ సభను విజయవంతం చేశా. దాంతో పోలీసులు మళ్లీ ఇబ్బందులకు గురిచేశారు. కుటుంబ సభ్యుల ఒత్తిడితో మళ్లీ కొన్నాళ్లు సొంతూరికి పరిమితం కావాల్సి వచ్చింది. 

యువత కోసం పాదయాత్ర

ఉద్యమం ఊపందుకున్న సమయంలో మళ్లీ హైదరాబాద్‌లో అడుగుపెట్టా. తెలంగాణ ఉద్యమం కేవలం ఆంధ్రోళ్లను టార్గెట్  చేసుకొని ఎక్కువ జరిగాయి. అయితే మార్వాడీలు, గుజరాతీయులు సైతం హైదరాబాద్‌లో తిష్ట వేసి తమ వ్యాపారాలనూ విస్తరించుకున్నారు. అలాంటివాళ్లతో తెలంగాణకు ప్రమాదం పొంచి ఉందని భావించి అనేక కరపత్రాలను ప్రచురించా. హైదరాబాద్ నుంచి ప్రాంతీయేతరులను స్వచ్ఛందంగా బహిష్కరించాలని డిమాండ్ చేశా.

అయితే చాలామంది సున్నితంగా తిరస్కరించడంతో వెనకడుగు వేయాల్సి వచ్చింది. అయినా తెలంగాణ ఆస్థిత్వం కోసం పనిచేశా. అయితే ఉద్యమ సమయంలో యువత పక్కదారి పట్టడంతో శాంతియుత నిరసనల వైపు మళ్లించేలా తెలంగాణ ఉద్యమకారుడు భూపతి కృష్ణమూర్తితో కలిసి వరంగల్ నుంచి సిరిసిల్లా పాదయాత్ర చేశా. ఆ పాదయాత్ర అప్పట్లో ఎంతోమందిని కదిలించింది. ఫలితంగా ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగులు, విద్యార్థులతో చర్చలు జరిపింది. 

- చేతన్