calender_icon.png 2 October, 2024 | 4:03 AM

వారంలో గాంధీ దవాఖానలో ఐవీఎఫ్

04-09-2024 01:20:03 AM

  1. హాస్పిటల్‌లో వైద్యుల కొరత లేదు 
  2. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): గాంధీ దవాఖానాలో వా రం రోజుల్లోనే ఐవీఎఫ్ కేంద్రాన్ని ప్రారంభిస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు. మంగళవారం ఆయన హాస్పిటల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సూపరింటెండెంట్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంకీపాక్స్ వార్డుల ప్రిపరేషన్, డెంగీ కేసుల పురోగతిని పరిశీలించి, మందుల కొరతపై ఆరా తీశారు. దవాఖానాలో అటెండెంట్లు నేలపై కూర్చోవడంపై బయట తప్పుడు ప్రచారం జరుగుతోందని, సరిపడా కుర్చీలు సమకూర్చాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నేను దొరను కాదని, ఇదే గాంధీ హాస్పిటల్‌లో పుట్టిన దళిత బిడ్డనని గుర్తు చేసుకున్నారు. ఎక్కువ కాలం ఒకే చోట తిష్ట వేసిన వాళ్లను బదిలీ చేశామని, దవాఖానాలో వైద్యుల కొరత ఉందన్న ప్రతిపక్షాల మాటల్లో నిజం లేదన్నారు. అవస రమైన చోట కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్యులను తీసుకుంటున్నామన్నారు. డాక్టర్ల కోసం హాస్టల్ భవనానికి త్వరలో శంకుస్థాపన చేస్తామని, ఇప్పటికే బడ్జెట్‌లో రూ.79 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వాణి, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి, ప్రొఫెసర్లు, డాక్టర్లు పాల్గొన్నారు.