calender_icon.png 22 January, 2025 | 2:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక కుర్రాళ్ల వంతు!

03-07-2024 01:20:50 AM

  • జింబాబ్వేకు పయనమైన టీమిండియా 
  • అమెరికా నుంచి నేరుగా హరారేకు గిల్ 
  • జట్టులోకి ఆలస్యంగా శాంసన్, దూబే, జైస్వాల్ 
  • సుదర్శన్, జితేశ్, హర్షిత్‌లకు పిలుపు

ముంబై: జింబాబ్వేతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా యువ జట్టు మంగళవారం ముంబై ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరి వెళ్లింది. తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, తుషార్ దేశ్ పాండేలతో కూడిన భారత బృందం జింబాబ్వే ఫ్లుటై ఎక్కింది. దీనికి సంబంధించిన ఫోటోలను బీసీసీఐ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా పంచుకుంది.

టీ20 ప్రపంచకప్ అనంతరం జట్టులో సీనియర్లకు విశ్రాంతినివ్వడంతో ఈ సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్న గిల్ అమెరికా నుంచి నేరుగా హరారేకు చేరుకోనున్నాడు. ఇక భారత ప్రధాన కోచ్‌గా ద్రవిడ్ పదవీకాలం ముగియడంతో అతడి స్థానంలో కొత్త కోచ్ రానున్నాడు. ఈ నేపథ్యంలో జింబాబ్వే పర్యటనకు ఎన్‌సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను తాత్కాలిక కోచ్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. 

జట్టులో పలు మార్పులు..

టీ20 ప్రపంచకప్ విజయానంతరం బెరిల్ హరికేన్ ప్రభావంతో టీమిండియా ఆటగాళ్లు బార్బ డోస్‌లోనే ఉండిపోయారు. దీంతో జింబాబ్వే పర్యటనకు ఎంపికైన సంజూ శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్ కాస్త ఆలస్యంగా జట్టుతో కలవనున్నారు. మూడో టీ20కి ఈ ముగ్గురు అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తొలి రెండు టీ20లకు జట్టులో పలు మార్పులు చేశారు. సంజూ, దూబే, జైస్వాల్ స్థానంలో సాయి సుదర్శన్, జితేశ్ శర్మ, హర్షిత్ రాణాలను బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ ముగ్గురు జాతీయ టీ20 జట్టుకు ఎంపికవడం ఇదే తొలిసారి. టీ20 వరల్డ్ కప్‌లో రిజర్వ్ ప్లేయర్లుగా ఉన్న రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్‌లు గిల్‌తో పాటు నేరుగా హరారేకు చేరుకోనున్నట్లు సమాచారం. 

నవ శకం మొదలు..

ఇప్పటివరకు టీమిండియాను తమ భుజ స్కందాలపై మోసిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. టీ20 ప్రపంచకప్ గెలిచిన మరుక్షణమే ఈ ఇద్దరు దిగ్గజాలు పొట్టి క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో టీమిండియా జట్టులో నవ శకం మొదలైనట్లే. రోహిత్, కోహ్లీలతో పాటు ఆల్‌రౌండర్ జడేజా కూడా టీ20లకు గుడ్‌బై చెప్పడంతో వీరి స్థానాలను ఎవరు భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. దశాబ్ద కాలం పాటు టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించిన ఈ త్రయం స్థానాలను భర్తీ చేయడం అంత సులువేం కాదు.

కానీ మరో రెండేళ్లలో టీ20 ప్రపంచకప్ జరగనుండడంతో అప్పటివరకు యువరక్తంతో కూడిన టీమిండియాను సిద్ధం చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో జింబాబ్వే పర్యటనలో వచ్చిన అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసిపట్టాలని కుర్రాళ్లు కాచుకు కూర్చున్నారు.