మాధవీలతకు జేసీ ప్రభాకర్‌రెడ్డి క్షమాపణలు
తాడిపత్రి, జనవరి 5: సినీ నటి మాధవీలతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏపీ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఎట్టకేలకు క్షమాపణ చెప్పారు. ఆదివారం అనంతపురం జిల్లా తాడిపత్రిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడు తూ.. ఆవేశంలో సినీ నటి మాధవీలత గురించి అలా మాట్లాడటం తప్పేనని, ఆమెకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.
తన వ్యాఖ్యలను ఉపసం హరించుకుంటున్నానని చెప్పారు. ఆవేశంలోనే అలాంటి వ్యాఖ్యలు చేశాను తప్ప వారిని కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. తాడిపత్రి కోసం ఎంతదూరమైనా వెళ్తానని, రెండు సంవత్సరాల్లో పట్టణ రూపురేఖలు మారుస్తానని చెప్పారు.
తాడిపత్రి ప్రజలు తన వైపే ఉన్నారని చెప్పడానికి మున్సిపల్ ఎన్నికలే నిదర్శమని చెప్పుకొచ్చారు. కాగా, డిసెంబర్ 31న తాడిపత్రి జేసీ పార్క్‌లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలపై మాధవీలతతో పాటు బీజేపీ నాయకురాలు సాధినేని యామిని చేసిన వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి అభ్యంతరకరంగా మాట్లాడటం పెను వివాదానికి దారి తీసింది.