calender_icon.png 22 December, 2024 | 3:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయ్ హజారేకు వేళాయే

21-12-2024 01:08:24 AM

* బరిలో పలువురు స్టార్ ఆటగాళ్లు

* ఫిబ్రవరిలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ

* టీమిండియాలో చోటే లక్ష్యం

న్యూఢిల్లీ: దేశవాలీ క్రికెట్‌లో మరో ప్రధాన టోర్నీకి రంగం సిద్ధమయ్యింది. రంజీ ట్రోఫీ తర్వాత అత్యంత ప్రాధాన్యం కలిగిన విజయ్ హజారే ట్రోఫీ నేటి నుంచి ప్రారంభం కానుంది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ ముగిసిన వారం వ్యవధిలో మొదలుకానున్న ఈ టోర్నీ వన్డే ఫార్మాట్‌లో జరగనుంది. వచ్చ ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరగనున్న నేపథ్యంలో భారత జట్టులో చోటే లక్ష్యంగా ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. అంతర్జాతీయ మ్యాచ్‌లు లేనప్పుడు ఆటగాళ్లు కచ్చితంగా దేశవాలీ టోర్నీల్లో ఆడాలని బీసీసీఐ నిబంధన పెట్టడంతో ఈ టోర్నీకి కూడా పలువు రు స్టార్ ఆటగాళ్లు బరిలో ఉన్నారు.

బరోడా నుంచి ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు అర్ష్‌దీప్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్‌లు టోర్నీలో ఆడనున్నారు. ఇక పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌గా ముద్రపడిన శ్రేయస్ అయ్యర్ చాంపియన్స్ ట్రోఫీకి జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు. హైదరాబాదీ తిలక్ వర్మపై కూడా భారీ ఆశలు ఉన్నాయి. ఇక గాయంతో జాతీయ జట్టుకు దూరమైన సీనియర్ పేసర్ మహ్మద్ షమీ విజయ్ హాజారే కు దూరంగా ఉండనున్నాడు. 

ఫేవరెట్స్‌గా వరుణ్, బిష్ణోయి..

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో (వన్డే, టీ20ల్లో) టీమిండియా జట్టులో లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రెగ్యులర్ సభ్యుడు. అయితే గజ్జల్లో గాయం కారణంగా ప్రస్తుతం కుల్దీప్ ఎన్‌సీఏ అకాడమీలో రీహాబిలిటేషన్‌లో ఉన్నాడు. కుల్దీప్ కోలుకోవడానికి సమయం పట్టనుండడంతో అందరి కళ్లు వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయిలపై నెలకొన్నాయి. ఆఫ్ స్పిన్నర్లకు కొరత లేనప్పటికీ లెగ్ స్పిన్నర్లకు మాత్రం మంచి డిమాండ్ ఉంది. దీంతో రానున్న చాంపియన్స్ ట్రోఫీకి కుల్దీప్‌కు ప్రత్యామ్నాయంగా వరుణ్, బిష్నోయిల మధ్య పోటీ నెలకొంది. టోర్నీలో మొత్తం 40 జట్లు ఐదు గ్రూపులుగా విడిపోయి నేటి నుంచి జనవరి 5 వరకు లీగ్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. ప్రతీ గ్రూప్ నుంచి టాప్ నిలిచిన జట్లు ప్రిలిమినరీ క్వార్టర్స్ ఆడనున్నాయి. ఆ తర్వాత జనవరి 12న క్వార్టర్ ఫైనల్స్, జనవరి 15న తొలి సెమీఫైనల్, జనవరి 16న రెండో సెమీఫైనల్, జనవరి 18న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.