calender_icon.png 12 January, 2025 | 6:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాకుంభమేళాకు వేళాయే..

12-01-2025 12:44:30 AM

  • మరికొన్ని గంటల్లో మహత్తర కార్యక్రమం షురూ
  • ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కళాకారుల ప్రదర్శనలు
  • అలరించనున్న సింగర్ శంకర్ మహదేవన్, మోహిత్ చౌహాన్ 

న్యూఢిల్లీ, జనవరి 11: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం.. హిందువులంతా వేయి కండ్లతో ఎదురుచూస్తున్న ‘మహాకుంభమేళా’కు సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో ఈ మహత్తర కార్యక్రమం ప్రారంభం కానుంది. సోమవారం (జనవరి 13) నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ మహోన్నత కార్యక్రమంలో కోట్లాదిమంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు.

ఆధ్యాత్మికత ఉట్టిపడే ప్రయాగ్‌రాజ్ పవిత్ర భూమిని దర్శించుకునేందుకు సాధారణ ప్రజలతో పాటు సాధువులు, అఘోరీలు, సాగసాధువులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో కుంభమేళా వేదికకు ఆధ్మాతిక సొగబులు అద్దాలనే ఉద్దేశంతో ప్రముఖ సంగీత కళాకారుల ప్రదర్శనలను నిర్వహించాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించారు. ప్రముఖ గాయకులు శంకర్ మహదేవన్, మోహిత్ చౌహాన్ తదితరులు ప్రయాగ్‌రాజ్ వేదికగా తమ గాత్రాలతో భక్తులను అలరించనున్నారు.

మహాకుంభ్ ప్రారంభమయ్యే మొదటిరోజు జనవరి 13న శంకర్ మహదేవన్ ప్రదర్శన ఇస్తారని, ఉత్సవం ముగిసే చివరి రోజు మోహిత్ చౌహాన్ తన ప్రదర్శనతో భక్తులను అలరిస్తారని సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. వీరేకాకుండా కైలాశ్ ఖేర్, పాన్ ముఖర్జీ, కవితా కృష్ణమూర్తి, కవితా సేథ్, హరిహరన్, బిక్రమ్‌ఘోష్, మాలిసీ అవస్తి, రిఖిరామ్ శర్మ, శోవన నారాయణ్, డాక్టర్ ఎల్ సుబ్రహ్మణ్యం తదితర కళాకారుల ప్రదర్శనలూ ఉంటాయని తెలిపారు.

కుంభ్‌మేళా మైదానం గంగా పండల్ వేదికగా శాస్త్రీయ నృత్యం, జానపద సంగీతం, నాటకాలు తదితర ప్రదర్శనలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈప్రదర్శనల్లో భారతీయ వారసత్వం, భక్తిభావం ఉట్టుపడుతుందని పేర్కొన్నారు. రవి త్రిపాఠి (జనవరి 25), సాధన సర్గమ్ (జనవరి 26), షాన్ (జనవరి 27), రంజని, గాయత్రి (జనవరి 31), హరిహరన్ (ఫిబ్రవరి 10), కైలాశ్ ఖేర్ (ఫిబ్రవరి 23) ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు.

ప్రయాగ్‌రాజ్ వేదికగా జరిగే ఈ పవిత్ర కార్యక్రమానికి బాలివుడ్ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, ఆలియా భట్, అనూప్ జలోటా, రవి కిషన్, మనోజ్ తివారీ, అక్షర సింగ్, రాఖీ సావంత్ సహా దేశంలోని ఇతర సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. మహాకుంభమేళా కోసం యూపీ ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది.