ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాం తి): కాంగ్రెస్ పార్టీకి పోయే కాలం వచ్చిందని అందుకే తమ పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడికి పాల్పడిందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని ఖండిస్తూ బుధవారం బీజేపీ కార్యాలయం లో మీడియాతో ఈటల మాట్లాడారు. తమ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపా రు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు బలహీనంగా ఉన్నాయని చెప్పేందుకు ఈ ఘటనే ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. పోలీసుల కళ్ల ముందే కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేస్తున్నా వారు ఆపలేదని ఆరోపించారు.
ఇంటిలిజె న్స్ వ్యవస్థ విఫలమైందా, లేక పథకం ప్రకా రం ఈ దాడికి ప్రోత్సహించారా అని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తప్పించుకునేందుకే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని విమర్శించా రు.
హైకమాండ్ రేవంత్‌కు కనీసం అపాయింట్ ఇవ్వడం లేదని వారి మెప్పుకోసం ఈ దాడులు చేయించారని ఆరోపించారు. ఈ దాడికి సంపూర్ణ బాధ్యత రాష్ర్ట ప్రభుత్వమే వహించాలని డిమాండ్ చేశారు. దాడి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి, సీపీ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎం చర్యలు తీసుకోలేదు: ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
బీజేపీ రాష్ర్ట కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ దాడిని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఖండించినా.. దాడికి పాల్పడిన వారిపై సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ దాడి పట్ల శాంతియుతంగా నిర సనకు దిగితే తమ పార్టీ ఎస్టీ మోర్చా రాష్ర్ట అధ్యక్షుడితో పాటు మరి కొంతమంది నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం తగదన్నారు.
పథకం ప్రకారమే దాడి: మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు
కాంగ్రెస్ పార్టీ పథకం ప్రకారమే దాడికి పాల్పడిందని మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు విమర్శించారు. “మీరు పదిమంది వస్తే.. మేం వందమందితో వస్తాం. కానీ మేం ప్రజాస్వామ్య స్ఫూర్తి మేరకు అనుగుణంగా నడుచుకుంటాం” అని అన్నారు. రాజకీయాలు రాజకీయాలుగానే ఉండాలని, పార్టీ కార్యాలయాలపై దాడులు సరికాదన్నారు. రేవంత్‌రెడ్డి ప్రోద్బలంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.