calender_icon.png 15 November, 2024 | 6:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుగ్గ జాతరకు వేళాయె

15-11-2024 01:36:40 AM

ఆరుట్లలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయం

  1. నేటి నుంచి రామలింగేశ్వరస్వామి (బుగ్గ జాతర) ఉత్సవాలు
  2. 15 రోజుల పాటు కొనసాగనున్న వేడుకలు
  3. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఎండోన్మెంట్, పోలీసు శాఖ అధికారులు

ఇబ్రహీంపట్నం, నవంబర్ 14 (విజయక్రాంతి): దక్షిణ కాశీగా పేరొందిన బుగ్గ రామలింగేశ్వర ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రంగారెడ్డి జిల్లా, మంచాల మండలంలోని ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వరస్వామి ఉత్సవాలకు ఆలయ నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. కార్తీకమాసంలో వచ్చే బుగ్గ రామలింగేశ్వరస్వామి జాతరకు ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు.

జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే విశిష్ట దైవంగా రామలింగేశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తే అన్నీ శుభాలే కలుగుతాయని ఈ ప్రాంత ప్రజల నమ్మకం.

ఈ నేపథ్యంలో కార్తీక మాసంలో 15 రోజుల పాటు జరిగే ఈ జాతరకు రంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి, నల్గొండ జిల్లాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివస్తారు. ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసి కుటుంబ సమేతంగా సామూహిక వనభోజనాలు చేస్తారు. చుట్టూ ఎత్తున కొండలతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిస్తుంది.

రాముడు ప్రతిష్ఠించిన లింగం..

రామలింగేశ్వరాలయంలో తూర్పు నుంచి పడమరకు నీరు ప్రవహించడం ప్రత్యేకత. ఈ ఆలయంలో ప్రవహించే నీటి లో స్నానం ఆచరించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగు తాయని ఈ ప్రాంత ప్రజల  నమ్మకం. ఈ ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. పూర్వం రాముడు ఇక్కడ శివలింగాన్ని నెలకొల్పి పూజించినట్లు స్థల పురాణం.

ఆ తర్వాత ఇక్కడ నీటి గుండంలో నీటి బుడగ పుట్టిందని, ఏకాలంలోనైనా ఈ బుడుగ నుంచి స్వచ్ఛమైన నీరు వస్తుందని చెబుతారు. 14వ శతాబ్దంలో రాచకొండ రాజులు రేచర్ల పద్మనాయకుల కాలంలో  బుగ్గరామలింగేశ్వర స్వామి ప్రత్యేక పూజలందుకున్నట్టు ప్రతీతి. 

భక్తులకు సౌకర్యాలు

ఇబ్రహీంపట్నం డిపో నుంచి ప్రత్యేకంగా బుగ్గరామలింగేశ్వరస్వామి జాతరకు ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతోంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు బస్సులు అందుబాటులో ఉంటాయి. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించున్నారు.

మొత్తం 150 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొంటారని సీఐ ఎ మధు తెలిపారు. జాతరలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా 16 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.