calender_icon.png 6 May, 2025 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్లీ పడిగాపులే!

23-04-2025 01:31:06 AM

ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద దీనంగా రైతులు

  1. కొనుగోలు కేంద్రాలకు పోటెత్తుతున్న ధాన్యం.. తూకాల్లోనే ఆలస్యం..
  2. అకాల వర్షాలతో అన్నదాత ఆగమాగం 
  3. 70.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ టార్గెట్ 
  4. ఇప్పటివరకు 7,910 కేంద్రాలు 
  5. జూన్ 30 వరకు కొనుగోలు చేయనున్న ప్రభుత్వం

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి) : రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు ఊపందుకున్నాయి. కొనుగోలు కేంద్రాలకు పెద్ద మొత్తంలో ధాన్యం వస్తోంది. అయితే చాలా చోట్ల కొనుగోలు కేంద్రాలకు వచ్చిన వరి ధాన్యానికి సరిపోను గన్నీ బ్యాగులు,  తేమ యంత్రాలు, వేయింగ్ మెషి న్లు, హమాలీల కొరతతో పాటు సేకరించిన ధాన్యాన్ని రవాణా చేయడానికి అవసరమైన లారీలు అందుబా టులో లేవు.

ధాన్యంలో ఎక్కువగా ఉన్న తాలును తీయడంతో పాటు పచ్చి ధాన్యాన్ని ఆరబోయడం వంటి పనులతో తూకం వేయడం మరింత ఆలస్యమవుతోంది. ఇక తేమ 17శాతం వరకు ఉండాలనే నిబంధన కూడా ఉన్నది. దీంతో పెద్ద మొత్తంలో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం పేరుకుపోతున్నది. దీంతో కొనుగోలు కేంద్రాల వద్ద  రైతులు రోజుల తర బడి పడిగాపులు పడాల్సివస్తోన్నది.

మరో వైపు అకాల వర్షాలు తోడయ్యాయి. ఈ అకాల వర్షాలతో ఇక్కట్లు రెట్టింపు అయ్యాయని జిల్లా ల నుంచి రైతులు విజయక్రాంతితో చెబుతూ వాపో యారు. అకాల వర్షాలు పడినప్పుడు సరిపడా టార్పాలిన్లు లేకపోవడం వల్ల ధాన్యం తడిసి నానా ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెబుతు న్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 56.69 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. ప్రభుత్వ అంచనాల ప్రకారం సుమా రుగా 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉంది. ఇది గత సీజన్‌తో పోలిస్తే అధికం.

సన్న వరి ధాన్యానికి ప్రభు త్వం క్వింటాకు రూ. 500 బోనస్ ఇస్తుండటంతో కొనుగోలు కేంద్రాలకు  ధాన్యం తీసుకొచ్చే రైతుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈనెల మొదటివారం నుంచి ప్రారంభమయ్యాయి. జూన్ 30 వర కు  ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభు త్వం నిర్ణయించింది. వరి ధాన్యం కోనుగోలు చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8, 230 కేంద్రాలు ఏర్పాటుచేయాలని లక్ష్యం గా పెట్టుకున్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ.. ఇప్పటి వరకు 7,910 కేంద్రాలను ఏర్పాటు చేసింది.

ధాన్యం కేంద్రాలకు వద్దకు వచ్చేదానిని బట్టి మిగతా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ యాసంగి సీజన్ మొత్తం 70.13 లక్షల  టన్నుల ధాన్యం కోనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. వీటిలో 46.71 లక్షల దొడ్డు రకం ధాన్యం, 23.42 లక్షల టన్నుల సన్న రకం ధాన్యం సేకరించాలని సర్కార్  నిర్ణయం తీసుకున్నది. మొత్తం ధాన్యంలో దొడ్డు రకం 66 శాతం, సన్న రకం 34 శాతం ఉండగా, మార్కెట్‌కు వస్తున్న ధాన్యంలో సన్న రకాలే ఎక్కువగా ఉన్నాయి.

ఏ గ్రేడ్ ధాన్యానికి  క్విం టాల్‌కు రూ. 2,320 మద్దతు ధరగా నిర్ణయించింది. దీనికి అదనంగా బోనస్ రూ. 500తో కలిపి మొత్తం రూ. 2,820 వరకు ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇదే సమయంలో మార్కెట్‌లో మిల్లర్లు, వ్యాపారులు తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతు లు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వైపు మొగ్గు చూపడంతో ధాన్యం కాంటా వేయడానికి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. 

8 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు..  

ఇప్పటివరకు 8 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేయగా, అందు లో 5.60 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం, 2.40 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం కొనుగోలు  చేసినట్లు సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. 42 వేలకు పైగా రైతులు తమ ధాన్యాన్ని కాంటా వేసినట్లు చెబుతున్నారు. 

ధాన్యం తగులబెట్టిన రైతులు

  1. ఐకెపీలో ధాన్యం కొనాలంటూ ధర్నా
  2. సూర్యాపేట జిల్లా చివ్వెంలలో ఘటన

చివ్వెంల, ఏప్రిల్ 22:- సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుర్రంతండా ఐకెపీలో గత 15 రోజులుగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోవడంతో మంగళవారం ఉదయం సూర్యాపే ట జాతీయ రహదారిపై రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి, వడ్లకు నిప్పంటించారు. రోడ్డుపై కంప వేసి బైఠాయించారు. ధాన్యం కొనుగోలు జరిగేంతవరకు ధర్నా విరమించబోమంటూ కూర్చున్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రంలో 3,000 వేల బస్తాలు ఉన్నా కొనుగోళ్లు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీలు రాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లులకు పంపించిన లారీల నుంచి ధాన్యం దించకపోవడంతో మూడు, నాలుగు రోజులు ఎదురు చూడాల్సి వస్తుందని వారు తెలిపారు. అధికారులు మిల్లర్లతో చర్చలు జరిపి ఎక్కువ మిల్లుల కు ట్యాగింగ్ వచ్చే విధంగా చూడాలని కోరా రు.

సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని రైతులను ధర్నా విరమింపజేశారు. రైతుల ధర్నాతో సూర్యాపేట రహదారి పై భారీగా వాహనాలు నిలిచాయి. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్‌ను గాయంవారి గూడెం నుంచి ఎంజీనగర్ తండా జాతీయ రహదారి 365(బిబి)కి మళ్లించారు.