పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేంద్ర పద్దు కాదని, అది బీహార్ బడ్జెట్ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రప్రజలు బీజేపీ నుంచి పోటీ చేసిన ఎనిమిది మందిని ఎంపీలుగా గెలిపించి పార్లమెంట్‌కు పంపించారని, వారంతా కలిసి బడ్జెట్‌లో తెలంగాణకు ఏం తీసుకొచ్చారని నిలదీశారు.
కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్ తెలంగాణ సమాజానికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు ఏడాదికి కేంద్రానికి రూ.లక్ష కోట్ల వరకు పన్నులు కడుతున్నారని, నిధుల కేటాయింపులో మాత్రం తీవ్ర అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు.
తెలుగింటి కోడలైన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కైనా తెలంగాణపై ప్రేమ లేకపోయిందని వాపోయారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఎన్నోసార్లు ప్రధాని మోదీని కలిసి సాయం కోరారని, అయినప్పటికీ ప్రధాని కనికరం చూపలేదని మండిపడ్డారు.