calender_icon.png 26 December, 2024 | 6:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గండం గట్టెక్కినట్టేనా!

22-12-2024 01:44:10 AM

* అమెరికాకు తప్పిన ‘షట్‌డౌన్’ ముప్పు

* ద్రవ్యవినిమయ బిల్లును ఆమోదించిన సెనేట్

వాషింగ్టన్, డిసెంబర్ 21: అగ్రరాజ్యం అమెరికాకు షట్‌డౌన్ ముప్పు తప్పింది. అమెరికాలోని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించే ద్రవ్యవినిమయ బిల్లుకు సెనేట్ ఆమోదం తెలిపింది. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ బిల్లుకు కనుక సెనేట్ ఆమోదం తెలిపి ఉండకపోతే.. అగ్రరాజ్యంలో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయేవి. ప్రభుత్వం దగ్గర చిల్లిగవ్వ కూడా ఉండేది కాదు. కానీ మొదట వ్యతిరేఖించిన ట్రంప్ వర్గం చివరికి కాస్త మెత్తపడటంతో బిల్లు సెనేట్‌లో పాస్ అయింది. అధ్యక్షుడి ఆమోదం కోసం ఈ బిల్లును పంపారు. 

తప్పిన షట్‌డౌన్ ముప్పు..

షట్‌డౌన్ పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు సెనేట్ ఈ బిల్లును శుక్రవారం అర్ధరాత్రి లోపు ఆమోదించాల్సి ఉండగా.. శుక్రవారం సాయంత్రం (అమెరికా కాలమానం ప్రకారం) సభ బిల్లుకు ఓకే తెలిపింది. మొదట తిరస్కరణకు గురైన బిల్లే చివరికి పాస్ కావడంతో డెమోక్రాట్లు ఆనందంలో మునిగిపోయారు. ఒక వేళ షట్‌డౌన్ వస్తే అధికార మార్పిడికి అంతరాయం కలుగుతుందని వైట్ హౌస్ వ్యాఖ్యానించడంతో ట్రంప్ చివరికి తగ్గారు. స్పీకర్ మైక్ జాన్సన్ ఈ బిల్లును ప్రవేశపెట్టగా.. సభ్యులంతా ఆమోదం తెలిపారు.