సొంత శాఖకు చెందిన వారు కావడం వలన ఎటూ తేల్చిన ఏమి చేయలేమన్న భావనతో పోలీసుల సైలెంట్..
నేటికీ నెల రోజులు పూర్తి..
ప్రత్యేక బృందం దర్యాప్తులో సైతం ఎటు తేలని నిజాలు...
కామారెడ్డి (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ల సూసైడ్ డెత్ కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘటన మిస్టరీకి ఎండ్ కార్డ్ పడినట్లేనా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే ఎన్నో క్రిటికల్ గా ఉన్న కేసులను తమ వద్ద ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శోధించి, ఛేదించే పోలీసులు.. సూసైడ్ చేసుకున్న వారు సొంత శాఖకు చెందిన వారు కావడం వలన ఎటూ తేల్చిన ఏమి చేయలేమన్న భావనతో సైలెంట్ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది. వారు సూసైడ్ చేసుకొని ఈనెల 25కు నెల రోజులు పూర్తవుతున్నాయి. అయితే బీబీపేట సొసైటీలో పనిచేసే నిఖిల్ కుమార్ ఒక్కడే బయట వ్యక్తి కాగా.. భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్, బీబీపేట మహిళా కానిస్టేబుల్ శృతిల మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడవడం, ఆ విషయంలోనే ముగ్గురు మధ్య మనస్పర్ధలు ఏర్పడడం వలన ఒకచోట కూర్చొని మాట్లాడుకుందామని వాహనంలో ఎక్కి సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్దకు వెళ్లారని ప్రచారం జరిగింది.
అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఆరోజు రాత్రి ముగ్గురు ఒకే చోట అడ్లూ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. మహిళా కానిస్టేబుల్ శ్రుతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ చెరువుల దూకగా.. వారిని కాపాడబోయే ప్రయత్నంలో ఎస్ఐ సాయికుమార్ మృతి చెందాడా...? లేక, భయంతో తన ప్రతిష్ట మసకబారుతుందా అన్న ఉద్దేశ్యంతో.. సూసైడ్ చేసుకున్నాడా అన్నది బిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. పోస్టుమార్టం నివేదికతో పాటు, ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్టు, వివిధ రకాల రిపోర్టులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న.. ఆఫీసర్ వద్దకు చేరాయన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయినా పోలీసు సిబ్బంది మాత్రం ఈ విషయమై నోరు విప్పలేకపోతున్నారు. అసలు అక్కడ ఏం జరిగిందన్న విషయాన్ని మాత్రం పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. గత నెల 25న క్రిస్మస్ రోజు జరిగిన ఈ ఘటనకు నేటితో నెల రోజులు అవుతున్నప్పటికీ, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం ఉన్నతాధికారులు బయట పెట్టలేకపోతున్నారు.
జరిగిందేదో జరిగిపోయింది బాధిత కుటుంబాలకు, న్యాయం జరగాలన్న ఉద్దేశంతో.. పోలీస్ శాఖ తరపున వచ్చే బెనిఫిట్స్ తో పాటు, ప్రభుత్వ పరంగా వచ్చే అన్ని రకాల సహాయ సహకారాలను పోలీస్ శాఖ తరపున అందించే కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. నెలరోజులవుతున్న పోలీసులు ముగ్గురి ఆత్మహత్యల మిస్టరీపై ఎటు తేల్చలేకపోవడం గమనార్వం. సాక్షులు లేరు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలియడం లేదని పోలీసులు చెప్తున్నారు తప్ప ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారు అనే విషయాన్ని పోలీసులు బహిరంగ పరచక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం బాధిత కుటుంబాలకు ప్రయోజనం చేయాలని తలంపుతోనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముగ్గురు ఆత్మహత్యలపై పోలీసులు బయటకు బహిర్గత పరచకుండాలో లోపల్లోనే కేసును ముగింపు చేశారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకు పోలీసులు అలా వ్యవహరిస్తున్నార అనే దానిపై ప్రజలు చర్చించుకుంటున్నారు.