- సెక్రటేరియట్‌లో ‘ఎస్‌పీఎఫ్’ అత్యుత్సాహం
- వనపర్తి ఎమ్మెల్యేను అడ్డుకున్న సిబ్బంది
- భద్రత మార్పుతో మొదలైన గందరగోళం
హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): సెక్రటేరియట్‌లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్) పోలీసులు ఎమ్మెల్యేలను గుర్తించపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఎస్‌పీఎఫ్ సిబ్బంది తీరుతో కొద్దిరోజులుగా ప్రజాప్రతినిధులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి ఇదే అనుభవం ఎదురవడం చర్చనీయాంశంగా మారింది.
సీఎస్ వస్తున్నారు.. పక్కకు జరగండి!
వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి శుక్రవారం సచివాలయానికి వచ్చారు. ఆయన 6వ ఫ్లోర్‌లో ఉండగా.. అదే సమయంలో సీఎస్ శాంతికుమారి అక్కడికి రాగా ఎస్‌పీఎఫ్ సిబ్బంది పక్కకు జరగాలని ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. తాను ఎమ్మెల్యేను అని.. సీఎస్ వస్తే ఫ్లోర్‌లో ఎవరూ ఉండకూడదా? అంటూ మేఘారెడ్డి అడిగినా సిబ్బంది వినకపోవడంతో ఆయన విస్మయానికి గురయ్యారు.
భద్రత మార్పుతోనే..
అక్టోబర్ 30వ తేదీ వరకు సెక్రటేరియట్ భద్రతను తెలంగాణ స్పెషల్ ఫోర్స్ పోలీసులు చూసుకునే వారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆ బాధ్యతను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్)కు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఎస్‌పీఎఫ్ సిబ్బంది ప్రజాప్రతినిధుల విషయంలో ప్రొటోకాల్ పాటించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్యేలు, ఎంపీలను గుర్తించపోవడంతో కొద్ది రోజులుగా సిబ్బంది నుంచి ప్రజాప్రతినిధులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. కాగా ఎమ్మెల్యేల పరిస్థితే ఇలా ఉంటే.. సాధారణ పౌరుల పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్నలు ఉత్పన్నవుతున్నాయి.