నేరుగా చాంపియన్స్ ట్రోఫీ బరిలో రోహిత్
సిడ్నీ: భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టు నుంచి తప్పుకున్నాడు.ఈ సిరీస్‌లో మూడు టెస్టులు ఆడిన రోహిత్ కేవలం 31 పరుగులు మాత్రమే చేసి అటు కెప్టెన్‌గా.. బ్యాటర్‌గా పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో సిడ్నీ టెస్టు నుంచి రోహిత్‌ను తప్పించి గిల్‌ను తుది జట్టులోకి తీసుకొచ్చారు. టాస్ సమయంలో బుమ్రా మాత్రం ‘రోహిత్ రెస్ట్‌ను కోరుకున్నాడని’ అందుకే గిల్‌ను ఆడిస్తున్నట్లు పేర్కొన్నాడు.
దీంతో రోహిత్ శర్మ తన కెరీర్‌లో ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడేసినట్లేనని మాజీలు గావస్కర్, రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. పిచ్ పరిస్థితి బట్టి తుది జట్టును ప్రకటిస్తామని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కోచ్ గంభీర్ పేర్కొన్నప్పటికీ మెల్‌బోర్న్ టెస్టు రోహిత్‌కు చివరిదని అర్థమైంది. తాజాగా రోహిత్‌ను బెంచ్‌కు పరిమితం చేయడం రిటైర్మెంట్‌కు మరింత ఊతమిచ్చినట్లయింది.
ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో ఏ స్థానంలో వచ్చినా వైఫల్యమే కనిపించింది. క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేయని రోహిత్ దూకుడుగా ఆడడంలోనూ విఫలమయ్యాడు. టెస్టుల్లో కొనసాగడంపై రోహిత్ ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది. ఈ సిరీస్ తర్వాత మరో ఆరు నెలల వరకు భారత్‌కు టెస్టు సిరీస్‌లు లేవు. అయితే ఫిబ్రవరిలో చాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ ఆడే అవకాశముంది.
అయితే కెప్టెన్‌గా కాకుండా ఆటగాడిగా మాత్రమే ఆడనున్నట్లు తెలుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ అనంతరం రోహిత్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.