calender_icon.png 20 March, 2025 | 1:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దున్నపోతు పాలు పిండినట్లుంది!

20-03-2025 01:03:13 AM

గ్యారెంటీలు గాలికి.. బడ్జెట్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి 19(విజయక్రాంతి) : రాష్ట్ర బడ్జెట్ దున్నపోతుకు పాలు పిండినట్లుందని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అంచనాలు భారీ.. కేటాయింపులు, అమల్లో మాత్రం సారీ అని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసిందని అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

అట్టహాసంగా ప్రకటించిన గ్యారెంటీల అమలుపై ప్రజలు ఆశలు వదులుకునేలా పద్దుల రూపకల్పన చేశారని అన్నారు. సర్కారు అంకెల గారడీతో తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసిందన్నారు.. పదేళ్లపాటు బీఆర్‌ఎస్ పార్టీ రాష్ర్ట ఆర్థిక పరిస్థితిని అగాతంలోకి నెట్టేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు రాష్ట్రాన్ని పెనంపైనుంచి పొయ్యిలోకి పడేసినట్లు చేసిందన్నారు.

గతేడాది బడ్జెట్ పెట్టినపుడు.. తొలి ఏడాదే కదా అని తప్పించుకున్నారు. మరి 15 నెలలపాటు పాలించిన తర్వాత కూడా 6 గ్యారెంటీలు, 420 వాగ్దానాల అమలును పూర్తిగా విస్మరించారని అన్నారు. వివిధ ప్రాజెక్టులకు భారీగా ప్రకటనలు చేసినా.. కేటాయింపులు, ఆచరణ శూన్యమని ఈ బడ్జెట్ ద్వారా స్పష్టమైందన్నారు. 2024--25 బడ్జెట్‌లో జీఎస్టీ ఆదాయాన్ని రూ.58,594 కోట్లుగా చూపించారని..

కానీ సవరించిన అంచనాల్లో.. రూ.5వేల కోట్లు తగ్గించి.. రూ.53,665 కోట్లుగా వెల్లడించారని తెలిపారు. దాదాపు 8.5% శాతం జీఎస్టీ వసూళ్లు తగ్గాయన్నారు. దీనికి కారణాలు రాష్ర్ట ప్రభుత్వం చెప్పాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. 2025-26 సంవత్సరానికి గానూ రూ.59,704 కోట్ల జీఎస్టీ వసూళ్లు ఉంటాయని బడ్జెట్లో పేర్కొన్నారని.. ఇందులో ఏ మేరకు లెక్కలు పెంచారో అర్థం కావడం లేదన్నారు.

రాష్ర్టంలో మద్యం వినియోగాన్ని పెంచి దాని ద్వారా ఆదాయం పెంచుకోవడంపైనే రాష్ర్ట ప్రభుత్వం దృష్టిపెట్టడం దురదృష్టకరమన్నారు. 2024--25లో ఎక్సుజ్ టాక్స్ ద్వారా రూ.25,617 కోట్ల అంచనాలు ప్రకటించిన సర్కారుకు.. ఈసారి బడ్జెట్‌లో.. రూ.27,623 కోట్ల ఆదాయాన్ని ఎక్సుజ్ ద్వారా రావొచ్చని అంచనా వేస్తోందని.. ఇదంతా చూస్తే రాష్ర్ట ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రజలను మద్యానికి బానిసలు చేసేలా పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు.

ప్రతిచోటా అంచనాలను పెంచి రాష్ర్ట ఆదాయాన్ని దాదాపు 12% ఎక్కువగా చూపిస్తున్నారని తెలిపారు. రైతులు, యువతను, విద్యార్థులు  ఇలా ప్రతి వర్గాన్ని అత్యంత దారుణంగా మోసం చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. గత బడ్జెట్‌లో 60వేల కోట్ల అప్పులు తీసుకుంటామని చెప్పి.. లక్షన్నర కోట్ల అప్పులు తీసుకున్నారని.. ఇప్పుడు రూ.74 వేల కోట్ల అప్పు తీసుకుంటారని.. అంటే ఇది మొత్తం అప్పు రూ. 2.25 లక్షల కోట్లు దాటిపోతుందన్నారు.

అప్పుల విషయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీరును తలదన్నేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని తెలిపారు. ఈ బడ్జెట్లో రాష్ర్టప్రభుత్వం 12% మాత్రమే అభివృద్ధికి కేటాయించడం శోచనీయం.. రాష్ర్ట అభివృద్ధి కుంటుపడితే, రాష్ర్ట ఆదాయం తగ్గుతుంది.. ఆదాయం తగ్గితే రాష్ర్టం నష్టపోతుంది..  అని ఆయన తెలిపారు. గత బడ్జెట్‌లో రెవెన్యూ అంచనాలకు, రాష్ర్ట ప్రభుత్వం చేసిన ఖర్చులకు ఏమాత్రం సంబంధం లేదని బడ్జెట్ నిరూపించిందన్నారు.

అమలుకు నోచుకోని హామీలు ఇచ్చి, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. వాటిని అమలు చేయకుండా తప్పించుకుటోందని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రజాసంక్షేమాన్ని, రాష్ట్రాభివృద్ధిని విస్మరించిన ఈ బడ్జెట్ ను బీజేపీ పూర్తిగా ఖండిస్తున్నట్లు చెప్పారు.