03-03-2025 01:44:21 AM
కృష్ణా జలాలు ఏపీ తరలింపునకు కారణం ఆయనే
వనపర్తి, మార్చి 2 (విజయక్రాంతి): కృష్ణానది జలాలను ఆంధ్రా కొల్లగొడుతుందంటే దానికి కారణం నాటి సీఎం కేసీఆరే అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వెనుకబడిన జిల్లా నుంచి సీఎం అయిన తర్వాత తాను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత జోలెలు పట్టుకుని దిగిపోండి అంటున్నారని మండిపడ్డారు.
వనపర్తితో తనకు విడదీయరాని అనుబంధం ఉందని, విద్యతోపాటు విద్యార్థి రాజకీయాల్లో ఓనమా లు నేర్పించింది వనపర్తేనని చెప్పారు. అలాంటి వన పర్తిని అభివృద్ధి చేయడం తన బాధ్యత అని తెలిపారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ..
ఏపీలో వైసీ పీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ అక్కడికి వెళ్లి రోజమ్మ పెట్టిన రొయ్యలపులుసు తిని రాయలసీమ రతనాలసీమ కావాలని అందుకు తన సహకా రం ఉంటుందని చెప్పి, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పునాది వేశారని ఆరోపించారు.
ఎక్కడి నుంచో వచ్చి పాలమూరులో పోటీ చేస్తే గెలిపించిన ఈ ప్రాంతంలోని ప్రాజెక్టులను పూర్తి చేయకుండా పండబెట్టాడని దుయ్యబట్టారు. గడిచిన పదేళ్లు ఎస్‌ఎల్‌బీసీ పనులు చేయకపోవడం వల్లనే 8 మంది ప్రాణాలు పోయాయని ఈ పాపం కేసీఆర్‌ది కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజలపై కిషన్‌రెడ్డి బుసలు
తాను సీఎం అయిన తర్వాత హైదరాబాద్‌లో మెట్రోరైలు విస్తరణ కోసం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని పలుమార్లు కలిసి విన్నవించినా అధికారులతో నివేదికలను పంపి నా పట్టించుకోలేదన్నారు. కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ తమిళనాడుకు, కర్ణాటకలోని బెంగళూరుకు శోభ మెట్రోరైలును తీసుకొని వెళ్తుంటే తెలంగాణకు కిషన్‌రెడ్డి ఎందుకు మెట్రోరైలును తీసుకొని రాలేదని ప్రశ్నించారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని మోదీని కలవడం జరిగిందని, అందుకు ఆయన మంచిగానే ఉన్నాడని కానీ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాత్రం తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడకుండా తెలంగాణ ప్రజలపై బుసలు కొడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఈడీలు, సీబీఐలు రావొద్దని మోదీ దగ్గర కిషన్‌రెడ్డి ఉన్నాడని, చీకటి మిత్రుడు కేసీఆర్ అధికారం పోయిందన్న బాధ కిషన్‌రెడ్డిలో కనిపిస్తుందని ఆరోపించారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 55వేల ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చిందని, గత 11 ఏండ్ల కాలంలో మోదీ కేవలం కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు రెండు ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని ఎద్దేవా చేశారు. పాలమూరు బిడ్డలు అమాయకులని బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు అనుకుంటున్నారని.. వాళ్లకు తిక్కలేస్తే బండకేసి కొడుతారని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.
మలిదశ ఉద్యమానికి ఊపిరిపోసిందే వనపర్తి
తెలంగాణ మలిదశ ఉద్యమానికి 2000 సంవత్సరంలో గజ్జె కట్టింది.. కాలు దువ్విం ది. వనపర్తి నుంచే అని, ఆ ఉద్యమానికి ఊ పిరిపోసింది అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. వనపర్తి మండలం కాసింనగర్ ఎత్తిపోతల పథకం కావాలని, చివరి శ్వాస వరకు పేదలకు వైద్యసేవలు అందించిన డాక్టర్ జిల్లెల మాధవ రెడ్డి పేరుపెట్టాలని చిన్నారెడ్డి కోరారన్నారు.
ఆయన విజ్ఞప్తి మేరకు కాసింనగర్ ఎత్తిపోతల పథకానికి డాక్టర్ జిల్లెల మాధవరెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరినట్లు ప్రభుత్వ ఆస్పత్రులకు మాజీ ఎమ్మె ల్యేలు డాక్టర్ జయరాములు, డాక్టర్ బాలకిష్టయ్య పేర్లు పెట్టడం జరుగుతుందని సభపై ఉన్న సీఎస్ శాంతికుమారికి ఆదేశాలు జారీ చేశారు.
వనపర్తి నుంచి గెలిచిన ప్రజాప్రతినిధుల మధ్య ఎలాంటి కక్షలు లేవని, కానీ గత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి వనపర్తి రాజకీయాలను కలుషితం చేశారని మండిపడ్డారు.
శిల్పారామం పక్కన 150 స్టాల్స్ ఏర్పాటు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో మహిళల ఆత్మగౌరవాన్ని పెంచే దిశగా పథకాలను అమలు చేస్తున్నామని సీఎం వివరిం చారు. స్వయం సహాయక సంఘాలను కేసీఆర్ ప్రభుత్వంలో చంద్రగ్రహణం పట్టించి సున్నా, వడ్డీ, పావలా వడ్డీరుణాలను ఇవ్వలేదన్నారు. వనపర్తి సాక్షిగా రూ.1,000 కోట్ల రుణాలను ఆడబిడ్డలకు ఇచ్చామన్నారు. హైటెక్ సిటీ శిల్పారామం పక్కనే స్వయం సహాయక మహిళల కోసం 150 స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు.
స్పీచ్‌కు దూరంగా చిన్నారెడ్డి
బహిరంగసభలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ప్రసంగించలేదు. అధికారికంగా వెలువడిన షెడ్యూల్‌లో రాష్ట్ర ప్రణాళిక చిన్నారెడ్డి స్పీచ్ ఉన్నట్టు పేర్కొన్నాఎందుకు మాట్లాడనివ్వలేదని ప్రశ్నలు తలెత్తాయి. వనపర్తి నియోజకవర్గంలో జరుగుతున్న వర్గపోరే కారణమై ఉండొచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రూ.879.80కోట్లతో వివిధ పనులకు శంకుస్థాపన
జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. పంచా యతీ రాజ్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రం, మండలాల్లో రూ.40కోట్లతో బీటీ రో డ్లు, నూతన ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మాణానికి రూ.510 కోట్లు, నూతన ఐటీ టవర్ నిర్మాణానికి రూ.22 కోట్లు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణాలకు రూ.47.50 కోట్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ ల్ పాఠశాల నిర్మాణానికి రూ.200 కోట్లు, పెబ్బేర్ 30 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి రూ.11.20 కోట్లు, శ్రీరంగాపురం ఆల యాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రూ.1.5 కేటాయించి శంకుస్థాపన చేశారు.
కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, పర్యాటక, ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదు ల్లా కొత్వాల్, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, ఎమ్మెల్యేలు మధుసూదన్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, కలెక్టర్ ఆదర్శ్ సురభి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు సీఎం రేవంత్ తా ను విద్యార్థి దశలో కిరాయికి ఉన్న ఇంటికెళ్లి ఓనర్ పార్వతమ్మ, కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించి అక్కడి నుంచి తన బాల్యమిత్రులను కలిసి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రజాసమస్యలు పరిష్కరించలేని సన్యాసి కేసీఆర్: డిప్యూటీ సీఎం భట్టి
పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించి ప్రజాసమస్యలను పరిష్కరించలేని సన్యాసి కేసీఆర్ అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క మండిపడ్డారు. పదేళ్లపాటు రాష్ట్రాన్ని దోచుకున్న వాళ్లు ప్రజాప్రభుత్వాన్ని విమర్శించడం మానుకోవాలని హెచ్చరించారు.