- పొంచి ఉన్న ఫాలోఆన్ ముప్పు
- జైస్వాల్ హాఫ్ సెంచరీ
- భారత్, ఆసీస్ బాక్సింగ్ డే టెస్టు
మెల్‌బోర్న్: బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. ఆసీస్ బ్యాటర్లు చెలరేగిన పిచ్‌పై మన బ్యాటర్లు మూగబోయారు. టాపార్డర్ మరోసారి విఫలం కావడం టీమిండియాను ఇబ్బందుల్లో పడేసింది.
మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 46 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. పంత్ (6*), జడేజా (4*) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 310 పరుగుల వెనుకంజలో ఉన్న భారత్ ఫాలోఆన్ ముప్పు తప్పించుకోవాలంటే మరో 111 పరుగులు చేయాల్సి ఉంది.
అంతకముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (197 బంతుల్లో 140) సెంచరీతో చెలరేగగా.. కమిన్స్ (49) రాణించాడు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు తీయగా.. జడేజా 3, ఆకాశ్ దీప్ 2 వికెట్లు పడగొట్టారు.
శతకంతో చెలరేగిన స్మిత్
311/6 క్రితం రోజు స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన స్మిత్, కమిన్స్ ఆసీస్ స్కోరు బోర్డును పరిగెత్తించారు. ఈ క్రమంలో స్మిత్ టెస్టుల్లో 34వ సెంచరీ సాధించాడు. టెయిలండర్ల సాయంతో భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న స్మిత్ ఆసీస్ స్కోరును 450 పరుగుల మార్క్‌ను దాటించాడు. స్మిత్ ఔటైన కాసేపటికే ఆసీస్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.
అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్‌గా వచ్చిన రోహిత్ శర్మ (3) మరోసారి విఫలమయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కేఎల్ రాహుల్ (24) అండతో జైస్వాల్ పరుగులు సాధించాడు. 43 పరుగులు జోడించిన అనంతరం కమిన్స్ బౌలింగ్‌లో రాహుల్ వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (36) కొన్ని మంచి షాట్లతో అలరించాడు.
సెంచరీకి దగ్గరవుతున్న క్రమంలో అనవసర పరుగు కోసం యత్నించి జైస్వాల్ రనౌట్ కాగా.. ఆ వెంటనే కోహ్లీ ఔటవ్వడంతో భారత్ కష్టాల్లో పడింది. నైట్‌వాచ్‌మన్‌గా వచ్చిన ఆకాశ్ దీప్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఆ తర్వాత పంత్, జడేజా మరొక వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి రోజును ముగించారు.
కోహ్లీకి చేదు అనుభవం..
టీమిండియా బ్యాటింగ్ సమయంలో భారత స్టార్ విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియా అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. 36 పరుగులతో మంచి టచ్‌లో కనిపించిన కోహ్లీ ఆఫ్‌సైడ్ బలహీనతను బయటపెడుతూ వికెట్ సమర్పించుకున్నాడు. కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తున్న సందర్భంలో కొంతమంది ఆసీస్ అభిమానులు ఎగతాళి చేశారు.
తమ మాటలు, చేతలతో కోహ్లీని రెచ్చగొట్టారు. ఇది గమనించిన కోహ్లీ వెనక్కి వచ్చి వారివైపు కోపంగా చూశాడు. అయితే అక్కడే ఉన్న అధికారి కోహ్లీకి నచ్చజెప్పి లోపలికి తీసుకెళ్లాడు.
అంతకముందు ఆసీస్ బ్యాటింగ్ సమయంలో కోహ్లీని ఆలింగనం చేసుకునేందుకు స్టాండ్స్‌లో నుంచి ఒక వ్యక్తి మైదానంలోకి దూసుకొచ్చాడు. కోహ్లీని తాకిన వ్యక్తిని సెక్యూరిటీ అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లింది. ఈ పరిణామం మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగించింది. ఇక తొలిరోజు ఆసీస్ ఆటగాడు కాన్‌స్టాస్, కోహ్లీ మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే.