14-04-2025 12:11:27 AM
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 13 (విజయక్రాంతి ): తనలాంటి వ్యక్తి మంత్రి పదవి కావాలని పదేపదే అడుగుతుంటే చాలా బాధ కలుగుతుందని మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్టానం మంత్రి పదవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న రాకుండా మాజీ మంత్రి జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర వహిస్తూ అడ్డు తగులుతున్నాడని బహిరంగంగా ఆరోపించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని మాట్లాడుతూ అసహనాన్ని వ్యక్తం చేశారు. 30 ఏళ్లు మంత్రి పదవులను అనుభవించిన జానారెడ్డికి, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. మహబూబ్నగర్, హైదరాబాద్, మెదక్, జిల్లాల్లో ముఖ్యమంత్రి కి, మంత్రులకు ఇన్చార్జి బాధ్యతలు ఇస్తే ఎంపీలను గెలిపించలేదు.
ఒక ఎమ్మెల్యేగా తాను భువనగిరి ఎంపీని గెలిపించాలని అన్నారు. భువనగిరి ఎంపీ సీట్ గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని అధిష్టానం హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ ప్రకారం పార్టీ కట్టుబడింది. తనకు మంత్రి పదవి ఇస్తే కిరీటం గా కాకుండా ఒక బాధ్యతగా వ్యవహరిస్తానన్నారు. ఒకే ఇంట్లో యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్.. ఇద్దరు అన్నదమ్ములు క్రికెటర్లుగా ఉన్నప్పుడు ఒకే ఇంట్లో ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు.
రాజగోపాల్ రెడ్డి అంటే గల్లా ఎగిరేసుకుని ఉంటాడే తప్ప అడుక్కునే స్థాయికి దిగజారుడని స్పష్టం చేశారు. కెసిఆర్ ను గద్దె దింపాలని లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి గద్దె దించారని ఇది నా కమిట్మెంట్ అని అన్నారు. మంత్రి పదవి అనేది అడుక్కుంటే వచ్చేది కాదు కెపాసిటీ బట్టి వస్తుందని అన్నారు.
పదవి అనేది అలంకారం కాదు ఒక బాధ్యత ఆ బాధ్యతను గుర్తించి ప్రజలకు సేవ చేయాలని మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గానికి రాజగోపాల్ రెడ్డి సూచించారు. రాబోయే రోజుల్లో చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ పరిధిని పెంచి రైతులకు మరింత మంచి చేయడానికి కృషి చేయాలి అన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలన్న సంకల్పంతోటి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గతంలో పాలించిన బీఆర్‌ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం రాచరికంతో కొనసాగి వారికి వంగి వంగి దండాలు పెట్టి కప్పం కట్టిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ. కరెంటు గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి లేదు కాంగ్రెస్ అంటేనే కరెంటు కరెంటు అంటేనే కాంగ్రెస్ పార్టీ అని ఎమ్మెల్యే అన్నారు.రైతు రుణమాఫీ కొంతమంది రైతులకు ఇవ్వాల్సి ఉంది వాస్తవమే దసరా వారిగా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు.
డబుల్ బెడ్ రూమ్ పేరుతో గత ప్రభుత్వం పదేళ్లు పేదలను మోసం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోని ఇందిరమ్మ ఇళ్ళను నిర్మాణం చేసిస్తుందని అన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలల్లో పేద ప్రజలకు ఇబ్బందులు పాలయ్యారని. మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి నీరు అందించే బాధ్యత తనదేనని ప్రకటించారు.
ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పథకం చరిత్రలో నిలిచిపోతుంది భారతదేశంలోని ఆ ఘనత తెలంగాణ కాంగ్రెస్ సర్కార్కు దక్కుతుందన్నారు. ఈ సభలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు. స్థానిక నాయకులు పాల్గొన్నారు. అనంతరం నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గం ఇచ్చే ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా పాలకవర్గానికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇతర ఎమ్మెల్యేలు ఎంపీ శుభాకాంక్షలు తెలిపారు.