calender_icon.png 26 March, 2025 | 8:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అస్తిత్వ పోరాటమే!

23-03-2025 12:00:00 AM

తెలంగాణ అస్తిత్వ ఉద్యమం అనేక ఆసక్తికరమైన వైరుధ్యాలతో, ఐక్యతలతో కూడుకున్నది. ఎదురుబొదురు పోరాడుకున్న భుస్వామ్య, సామాన్య వర్గాలే ఈ ఉద్యమంలో కీలక భూమిక పోషించాయి.   తెలంగాణ ప్రాంతీయ ఉద్యమం మలిదశకు ముందు తెలుగు నేల మీద బలంగా ప్రసరించిన సామాజిక అస్తిత్వ ఉద్యమాల ప్రభావరీత్యా కూడా సామాజిక, ప్రాంతీయ వైరుధ్యాలు ప్రస్ఫుటంగా కనిపించాయి. అయినా ఏదో ఒక ఐక్యత ఏర్పడిదంటున్నారు శాతవాహన యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత. ఈ సందర్భంగా మలిదశ ఉద్యమ అనుభవాలను ‘విజయకాంత్రి’తో నెమరువేసుకున్నారిలా..  

మలిదశ ఉద్యమ నేపథ్యంలో అనేక అవగాహన కార్యక్రమాల్లో వచ్చిన ప్రజానుకూల అంశాలను స్వీకరిస్తూ, ఉద్యమానికి నిర్మాణాత్మకమైన విమర్శను, వ్యాఖ్యానాన్ని అందించడం తేలికగాదు. ఈ ఉద్యమాన్ని ఒక రాజకీయ పార్టీకో, ఒక నాయకునికో పరిమితం చేసి.. ఇది ఒక రాజకీయ నిర్ణయం అని, రాజకీయ పార్టీలకి వదిలేసి చోద్యంచూస్తున్న ఆంధ్రాప్రాంత ప్రజలు, మేధావి వర్గాలు, ఎక్కడో మెల్లిగా, చాటుగా తెలంగాణకి మద్దతు తెలుపుతున్న ప్రజాస్వామికవాదులు ఒక్కసారి పునరాలోచించుకోవాల్సిన సందర్భం కూడా అప్పుడే ఏర్పడ్డది. నిజానికి ఏమాత్రం చరిత్ర తెలిసినా, అన్యాయం, అసమానతలపై ఏకొద్ది అవగాహన ఉన్నా, పోరాటాలకు, ఉద్యమాలకు విలువలపై నమ్మకం ఉంటే తెలంగాణ ఈరోజు ఆత్మహత్యలకి కేంద్రంగా నిలిచి ఉండేది కాదు.

శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన నివేదికలను చూసుకున్నా తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్క రంగంలో అన్యాయం జరిగిందని కండ్లకు కట్టినట్టు సాక్షాధారాలుసహా ప్రజల ముందు ఉన్నాయి. తెలంగాణ భారతదేశంలో విలీనం కాకముందు నుంచి ఈ ప్రాంతం తన ప్రత్యేకతను కాపాడుకోవడానికి నిరంతరం పోరాటం చేస్తూనే ఉంది. ఇది దక్కని ప్రాంతం.. ఇక్కడ నిజాంల పాలన, ఉర్దూ భాష, హిందూ ముస్లింల కలయికతో కూడిన సంస్కృతి, వ్యవసాయ ఆధారిత జీవన విధానం ఒక ప్రత్యేకత. 

అన్ని పార్టీల మానిఫెస్టోలోనూ తెలంగాణ అజెండా 

1969 నుంచి ఉద్ధృతంగా తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం భావవ్యాప్తి దిశగా నడిచింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించిన తర్వాత రాజకీయ పార్టీల ద్వారా పరిష్కారమవుతుందని అనేక ప్రయత్నాలు 2001, 2004, 2009 ఎన్నికల్లో నడిచినయి. తమ మానిఫెస్టోలో తెలంగాణ అజెండా లేకుండా ఏ పార్టీ పోటీ చేయలేదు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆకాంక్ష బలంగా ఉంది అనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏమి కావాలి. ఈ ప్రాంతంలో తిరిగిన ప్రతి పార్టీ కూడా మేం తెలంగాణకి వ్యతిరేకం కాదు అని చెప్పే స్థితికి ఉద్యమం తీసుకొచ్చింది అన్న సత్యం మనముందున్నది. ఈ విషయం చెప్పడానికి కూడా మనకి పరకాల ప్రభాకర్, లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివరావు, కేసీఆర్ కావాలా? సమాజ చలన సూత్రాలను అర్థం చేసుకోలేని యువతరాన్ని పెంచి పోషిస్తున్న మనం సమాజాన్ని భావ దారిద్య్రంలో నెట్టి వేస్తున్నామని బాధపడే సమయం కాదా? చివరికి ఎన్నికల ‘కల’ కూడా నెరవేరలేదు. విధిలేని పరిస్థితిలో కేసీఆర్ నిరాహారదీక్షకు కూర్చోవడం, ఉద్యమం ఒక్కసారిగా పైకి లేవడం అందరికి తెలిసిందే. 

కపట రాజకీయ పార్టీలు

డిసెంబర్ 9న చిదంబరం ప్రకటన తిరిగి తెలంగాణ ప్రాంతానికి కొత్త ఊపిరులూదింది.. కానీ, ఆ ఆశలు నిలవక ముందే మళ్లీ కపట రాజకీయ పార్టీలు బరిలోకి దిగి ప్రకటన వెనుకకు పడేటట్టు చేశాయి. రాజీనామాలు, ఎన్నికలు, మిలియన్ మార్చ్‌లు, వంటావార్పులు, సకల జనుల సమ్మె, బంద్‌లు, ఆత్మహత్యలు తెలంగాణలో నిత్యకృత్యం అయ్యాయి. దీనికి బాధ్యత గల ప్రజాసంఘాలు, మేధావుల నిశ్శబ్దం ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. ఈ కాలంలో లవణంగారు వెలిబుచ్చిన అభిప్రాయాలు, కొద్దిమంది రచయితల ‘కావడికుండలు’ వంటి రచనలు, బహుజన కెరటాలు, కుల నిర్మూలన వంటి కొద్ది విశిష్ట పత్రికలూ తప్పితే ఎక్కువ బాహాటంగా మద్దతు ఇచ్చిన వారు చాలా తక్కువ. 

సోకాల్డ్ బుద్ధిజీవులు

ఒక ప్రాంతం అల్లకల్లోకమైతుంటే, ఉద్యమాలనే ఊపిరిగా మలచుకొని బతుకుతుంటే ఒక పరిష్కార మార్గాన్ని చూడటంలో, చూపడంలో ఈ సోకాల్డ్ సమైక్యాంధ్రలో బుద్ధిజీవులు కరువైనారు అని తెలంగాణ ప్రాంతం భావించదా? మనం ఒక్క తల్లిపిల్లలం, ఒక్క భాష పుత్రులం ఒక్క గడ్డ వారసులం అని డైలాగ్ చెప్పిన పెద్ద మనుషులకు ఈ అమాయకుల చావులు కనపడలేదు? కోట్ల కొద్ది ప్రజల వెలిబుచ్చుతున్న ఆకాంక్ష లెక్కల్లోకి రాలేదు? ఈ రాజకీయ పార్టీలకి, తెలంగాణలో పర్యటించే నాయ లకులంతా మేం తెలంగాణ వ్యతిరేకం కాదు అని అన్నారు.

చంద్రబాబు, విజయమ్మ ప్రతి చోటా ఇదే చెప్పారు. దానర్థం సీమాంధ్ర ప్రజలు వ్యతిరేకులు అనా లేక కొద్దిమంది పెట్టుబ డిదారులు హైదరాబాద్‌లో తమ సంపాదన పెట్టుకుని ప్రాంత విభజనకి అడ్డుపడుతున్నారని అర్ధమా? డబ్బుల మూటలతోని ఢిల్లీ పెద్దలను మాయచేస్తున్న కొద్దిమంది రాజకీయ చతురుల చేతిలోనే ఈ రెండు పెట్టుకుని ఇక్కడి వార్తలు బయటకు రాకుండా రాష్ట్రం అవతల ఉన్న వారిని మేనేజ్ చేశారు. రాజకీయ పార్టీలంటేనే స్వార్థం, వాటి మనుగడ కోసమే ఏమైనా చేస్తాయి అన్న విషయం తెలంగాణ ఉద్యమంలో కండ్లార చూశాం. దీనికి తెలంగాణ నాయకులు వినహాయింపు కాదు. 

పుకార్లు, వదంతులు.. 

తెలంగాణ అనగానే ఆంధ్రా వాళ్లని వెళ్లగొడతారని, నీళ్లు ఇవ్వరని, హైదరాబాద్ పోవాలంటే వీసా కావాలని, ముస్లింలకు చేటని, మావోయిస్టుల సమస్య వస్తుందని పుకార్లు, వదంతులు పుట్టిస్తున్నవారి మాటలను నమ్మి మోసపోయింది సామాన్య ప్రజలే. చిన్న రాష్ట్రాలు అభివృద్ధికి సోపానాలు.. అని అమెరికా వంటి దేశాలు నిరూపిస్తున్నాయి. ఈ రాష్ట్రాల ద్వారా భాషా, సంస్కృతి, వనరుల వినియోగం, నిధుల పంపకం సక్రమంగా అన్ని ప్రాంతాలకు అందుతాయని చరిత్ర చెప్తోంది. ఎన్ని పుకార్లు వచ్చినా, ఎన్ని వదంతులు వ్యాపించినా ఉద్యమం ఏ మాత్రం ఆగలేదు. 

ఉద్యోగాలు దొంగలించి..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 15 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులున్నారు. రకరకాల పరిస్థితుల్లో జరిగిన అనేక ఒప్పందాల ప్రకారం మొత్తం ఉద్యోగుల్లో తెలంగాణ వారు 40 శాతం ఉండాలి. అంటే ఆరు లక్షల మంది తెలంగాణ వారుండాలి. కానీ, రాష్ట్రంలో రెండు లక్షలకు మించి తెలంగాణ ప్రాంతం వారు లేరు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కడప జిల్లా రెడ్డిగారి మాటలివి.. ‘మన జిల్లా పిల్లలుంటే చూడండి, లేని పక్షంలో మన కులం వారుంటే చూడండి.. మంచి పోస్టుల్లో వేసేద్దాం. వారు ఒకసారి చేరితే 30 సంవత్సరాలు మన ప్రాంతానికి, మన కులానికి ఉపయోగపడతారు’ అని అప్పటి ఎపీపీఎస్‌సీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి మాటలు ఇప్పటికి ఈ  ప్రాంత జనం మర్చిపోలేరు. 

- రూప