27-04-2025 12:00:00 AM
వివాహ బంధం శాశ్వతమైంది. ఈ విషయం తెలిసినా కొన్ని జంటలుచిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ.. నూరేళ్ల అనుబంధాన్ని మధ్యలోనే తెంచేసుకుంటున్నారు. అయితే ఇందుకు వారు తమ అనుబంధంలో కొన్ని అంశాల్ని స్వీకరించలేకపోవడం, జీర్ణించుకోలేపోవడమే కారణమంటున్నారు నిపుణులు. భార్యాభర్తలన్నాక గొడవలు పడటం, కాసేపటికే తిరిగి కలిసిపోవడం సహజం.
అయితే కొంతమంది వీటిని భూతద్దంలో పెట్టి మరీ భాగస్వామిలోని లోపాల్ని, వారు చేసిన తప్పుల్ని వెతుకుతుంటారు. నిజానికి ఇలా మీ మనసంతా ప్రతికూల ఆలోచనలతో నిండిపోతే.. ప్రతిదీ నెగెటివ్‌గానే కనిపిస్తుంది. అంతేకాదు.. ప్రతిదానికీ అవతలి వారి మీద అనుమానం పెరిగిపోతుంది.
దీనివల్లే చాలా జంటలు విడిపోతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఒకరిపై ఒకరికి అనుమానం లేకుండా ఉండాలంటే.. ప్రతి విషయంలోనూ భార్యాభర్తలు పారదర్శకంగా వ్యవహరించడం ముఖ్యం. ఇదే ఒకరిపై ఒకరికి నమ్మకాన్ని పెంచి.. ఇద్దరినీ మరింత దగ్గర చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.