- ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే కేటీఆర్‌పై అక్రమ కేసులు
ఫార్ములా ఈ కారు రేసులో అవినీతే జరగలేదు
మాజీ మంత్రి హరీశ్ రావు
అరెస్ట్ వార్తల నేపథ్యంలో కేటీఆర్ నివాసానికి భారీగా వచ్చిన బీఆర్‌ఎస్ శ్రేణులు
హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాం తి): రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు, అక్రమ కేసులకు భయపడేది లేదని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటకొస్తారని, అక్రమ కేసులతో, అరెస్టులతో రేవంత్ ప్రభుత్వం తప్పిదాలను కప్పి పుచ్చుకోవాలని చూడడం మూర్ఖత్వమన్నా రు. ప్రభుత్వ అక్రమాలపై, ఆరు గ్యారంటీల అమలుపై ప్రశ్నించడం మాత్రం ఆపేది లేదని చెప్పారు.
ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని నందినగర్ కేటీఆర్ నివాసానికి బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఉదయం నుంచి ఎప్పుడు ఏం జరుగుతుందో ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈసందర్భంగా హరీశ్ రావు శాస నమండలి ప్రతిపక్షనేత మధుసూధనాచారి, కౌశిక్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడా రు..
రేవంత్ రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా కేటీఆర్‌పై అక్రమ కేసు నమోదు చేసిందని రాష్ర్ట ప్రజలకు తెలుసున్నారు. ఏడాది పాలన తర్వాత అన్ని సర్వే రిపోర్టుల్లో ప్రభుత్వం విఫలమైందని, రేవంత్ ఫెయిల్యూర్ సీఎం అని తేలిందన్నారు. దీంతో కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టి, ప్రజల దృష్టిని మరల్చాలని చూస్తున్నారని మండిపడ్డారు. గతంలో కూడా కేటీఆర్ విచారణకు సిద్ధమని చెప్పారని, ఈ అంశంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలా అనే అంశంపై పార్టీ లీగల్ సెల్ నిర్ణయిస్తుందన్నారు.
హైకోర్టు తీర్పు కాపీని పూర్తిగా చదివిన తర్వాత లీగల్ సెల్ సలహా మేరకు కార్యాచరణ చేపడతామన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచడం కోసమే కేటీఆర్ ఫార్ములా -ఈ కార్‌ను హైదరాబాద్‌కి తెచ్చారని, ఇదే రేసును తమ రాష్ట్రాలకు నగరాలకు తీసుకురావడానికి అనేక రాష్ట్రాలు పోటీపడ్డాయని, ఒక్క రూపాయి కూడా చేతులు మారనప్పుడు అవినీతి ఎట్లా జరుగుతుందని ప్రశ్నించారు.
ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకనే: మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత
అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోని సీట్లన్నీ బీఆర్‌ఎస్ గెలవడంతో కేటీఆర్‌పై రేవంత్ కుట్రలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మండిపడ్డారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చెందింది కేటీఆర్ అని, రేవంత్ ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదన్నారు.
రేవంత్‌ది ఫ్రస్టేషన్..
మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి
పాలనలో విఫలం అవుతున్నానన్న ఫ్రస్టేషన్ లోనే రేవంత్ రెడ్డి ఇలా ప్రవర్తిస్తున్నారని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎప్పుడో 15 నెలల కింద ట జరిగిన ఫార్ములా ఈ కార్ అంశాన్ని ఎత్తుకుని రెండు నెలల నుంచి రేవంత్ రెడ్డి హంగామా చేస్తున్నారని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.
ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం..
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్‌పై పెట్టింది అక్రమ కేసేనని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలకు దర్యాప్తు సంస్థలు జేబు సంస్థలుగా మారాయని ఆరోపించారు.
కుట్రలను ఛేదిస్తాం..
మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో చివరకు రేవంత్ రెడ్డికే శిక్ష పడుతుందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. చట్టాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ, ఒకరిద్దరూ తాబేదారులైన అధికారుల సాయంతో రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలు, కుయుక్తులను ఛేదించి కేటీఆర్ బయటకు వస్తారని చెప్పారు.
తమ నాయకులపై అక్రమ కేసులు పెట్టి కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకుంటుంటే, రైతుబంధు, 24 గంటల కరెంటు, ఇంటింటికీ మంచినీళ్లు, కోటిన్నర ఎకరాలకు సాగునీరిచ్చి తాము సంబరాలు చేసుకున్నామని గుర్తుచేశారు.