భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాచలం ఐటిడిఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియం సందర్శనకు వచ్చే పర్యాటకులు బోటింగ్, చిన్నపిల్లలు ఆడుకునే క్రీడా స్థలాలలో విద్యుత్ కాంతులతో పాటు కూర్చోవడానికి బల్లలాంటివి ఏర్పాట్లు చేయాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. గురువారం నాడు రాత్రి ఐటిడిఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియం సందర్శించి మ్యూజియంలో చిన్నపిల్లలకు ఏర్పాట్లు చేస్తున్న క్రీడా స్థలాలు, బోటింగ్ కొరకు తయారు చేస్తున్న చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మ్యూజియం సందర్శనకు వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా మ్యూజియంలోని పాతకాలపు కళాఖండాలను తిలకించిన చిన్నపిల్లలు ఆటలాడుకోవడానికి తప్పనిసరిగా ఉత్సాహం చూపెడతారని అలాగే బోటింగ్ చేయాలన్న సరదా కూడా ఉంటుందని దానికి తగ్గట్టు ఏర్పాట్లు ఫిబ్రవరి 5వ తారీఖు వరకు పూర్తి కావాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
గిరిజన వంటకాల కొరకు ఏర్పాటు చేసే స్థలాన్ని రేపటి వరకు శుభ్రం చేయాలని, పాతకాలపు ఇల్లు నిర్మించిన వాటిపై గిరిజనులకు సంబంధించిన బొమ్మలు అలాగే మ్యూజియం ముందు ఫౌంటెన్ నిర్మాణం చేపట్టాలని అన్నారు. పాతకాలపు ఇండ్లపైన తప్పనిసరిగా పేర్లు రాయించాలని, స్వాగత ద్వారం పక్కన ఖాళీ స్థలంలో డిజైన్ గా ట్రైబల్ మ్యూజియం పేర్లు చెక్కించాలని, దాని ఎదురుగా ఉన్న ఖాళీ స్థలమును పార్కింగ్ స్థలంగా రెండు రోజుల్లో శుభ్రం చేయించాలని సంబంధిత ఏఈకి ఆదేశించారు. మ్యూజియం అలంకరణ ఏర్పాట్లు విషయంలో సంబంధిత అధికారులు తమకు అప్పగించిన పనులను త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, టిఎ శ్రీనివాస్, జేడీఎం హరికృష్ణ, జిపి శ్రీనివాస్, మహేష్ మ్యూజియం నిర్వాహకుడు వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.