calender_icon.png 1 November, 2024 | 7:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐటీడీఏ పీఓకు విచారణ పరిధి లేదు

17-07-2024 05:00:43 AM

  • ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలో సివిల్ సూట్ల వివరాలివ్వండి 
  • ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): సివిల్ కేసులపై విచారణ చేపట్టే పరిధి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి లేదని హైకోర్టు ప్రకటించింది. 2022లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 274 ప్రకారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి ఆ అధికారం లేదని వ్యాఖ్యానించింది. జీవో ౨౭౪ ప్రకారం ప్రభుత్వ ఏజెంటుగా ఆ అధికారం కలెక్టర్‌కు ఉందని, ప్రాజెక్టు ఆఫీసర్‌కు అధికార బదలాయింపు జరగలేదని తెలిపింది. అయినా జీవో ప్రకారం సివిల్ కేసులను విచారణ చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో విచారణ చేపట్టిన సివిల్ కేసుల విచారణపై నివేదిక సమర్పించాలని ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిని ఆదేశించింది.

ఓ సివిల్ వివాదంలో డాక్యుమెంట్లను చేతిరాత నిపుణుల కు పంపాలన్న అభ్యర్థనను ఆదిలాబాద్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరస్కరించడంపై ఉట్నూరు మండలం హస్నాపూర్‌కు చెందిన చవన్ ప్రకాశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ శరత్ విచారణ చేపట్టారు. పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ 2022 జూన్ 15న ప్రభుత్వం జారీ చేసిన జీవో 274 ఆధారంగా ప్రభుత్వ అదనపు ఏజెంట్, ఐటీడీఏ పీవోగా ఉట్నూరు ప్రాజెక్టు అధికారి సివిల్ కేసుల విచారణ చేపడుతున్నారని తెలిపారు. ఆదిలాబాద్ విభజన తరువాత కూడా ఆదిలాబాద్, కుమ్రంభీం అసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల కేసులను ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి విచారిస్తున్నారని చెప్పారు.

వాదనలు విన్న న్యాయమూర్తి ఏజెన్సీ నిబంధనలు 1924 నుంచి అమలవుతున్నాయని, వీటి ప్రకారం ఏజెన్సీ డివిజనల్ అధికారి/ఆర్డీవోలు, జిల్లా కలెక్టర్లకు మాత్రమే సివిల్ కేసులను విచారించే పరిధి ఉందని తెలిపారు. జీవో ప్రకారం కలెక్టర్ల అధికారాన్ని ప్రాజెక్టు అధికారికి బదలాయించలేదని తెలిపారు. అందువల్ల ఆదిలాబాద్, కుమ్రంభీం అసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల వారీగా విచారణ చేపట్టిన సివిల్ కేసుల వివరాలతో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదిలాబాద్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా తెలంగాణ ఏజెన్సీ నిబంధన 57 కింద పెండింగ్‌లో ఉన్న సివిల్ సూట్ల వివరాలను కలెక్టర్ నుంచి తెప్పించాలని హైకోర్టు రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు. విచారణను ఆగస్టు 2వ తేదీకి వాయిదా వేశారు.

విద్యాహక్కు చట్టంపై నివేదికివ్వండి 

ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): రాష్ట్రంలో 2009లో అమల్లోకి తెచ్చిన నిర్బంధ విద్యా హక్కు చట్టం అమలు తీరుపై రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు మంగళవారం ఆదేశించింది. నిర్బంధ విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 12(1)(సి) ప్రకారం పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేదలకు కేటాయించాల్సి ఉందని, ఈ సీట్ల కేటాయింపుపై పాఠశాలల వారీగా నివేదిక సమర్పించాలని సూచించింది. నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది యోగేష్ దాఖలు చేసిన పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్ కుమార్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది.

పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ చట్టం 2009లో వచ్చినప్పటికీ ఇప్పటివరకు అమలు చేయడంలేదని తెలిపారు. చట్టంలోని సెక్షన్ 12(1)(సి) ప్రకారం పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం కింద పేద విద్యార్థుల కోసం 25 శాతం సీట్లను కేటాయించాల్సి ఉందని చెప్పారు. ఈ చట్టం అమలుపై కర్ణాటక ప్రభుత్వం నిబంధనలు తీసుకువచ్చిందని గుర్తుచేశారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్ రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ విద్యాహక్కు చట్టం అమలుకు సంబంధించి ప్రభుత్వం 2010 జూలై 7న జీవో 44 జారీ చేయగా హైకోర్టు స్టే ఇచ్చిందని తెలిపారు.

ఇటీవల ఆ స్టేను తొలగించిందని గుర్తుచేశారు. వాదనలను విన్న ధర్మాసనం విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 12(1)(సి) అమలుపై రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని, లేని పక్షంలో తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.