25-02-2025 01:32:59 AM
ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మంచిర్యాల, ఫిబ్రవరి 24 (విజయక్రాం తి) : తెలంగాణ రాష్ర్ట ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి, సంరక్షణ, అభివృద్ది పథంలోకి తీసుకువస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమ వారం మంచిర్యాల జిల్లా నస్పూర్ లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్కతో కలిసి మాట్లాడారు.
రాష్ర్ట అవతరణ కోసం యువత, నిరుద్యోగులు పోరాడితే సోనియా ప్రత్యేక రాష్ర్టం ఇచ్చిందన్నారు. పదేండ్లలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో బీ ఆర్ ఎస్ ప్రభుత్వం విఫలమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే సుమారు 56 వేల ఉద్యోగాలు కల్పించిందన్నారు.
అలాగే ప్రైవేటు రంగాలలో ఉద్యోగాలు పొందేందుకు నైపుణ్యతను పెంచేందుకు యంగ్ ఇండియా స్కిల్ డెవలప్ మెంట్, యూనివర్సిటీలు ఏర్పాటు, టీచర్లకు ప్రమోషన్లు, ట్రాన్స్ ఫర్ల్ చేశామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 3 డీఏలు గత ప్రభుత్వం పెండింగ్ లో ఉంచితే ఇప్పటికే ఒక డీఏ ఇచ్చామని, మిగితావి త్వరలో ఇస్తామన్నారు.
అలాగే విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంటు, స్కాలర్ షిప్ లు తదితరాలను ఒక్కొటొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నామన్నారు. రైతులకు రుణ మాఫీ, రైతు భరోసా, ఉద్యోగాల కల్పన తదితరాలు కల్పించామన్నారు.
అనంతరం నిజమాబాద్ - ఆదిలాబాద్ - కరీంనగర్ - మెదక్ జిల్లాల ఎం ఎల్ సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉన్న నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తనను గెలిపిస్తే ప్రైవేటు ఉపాధ్యాయులకు రూ. 3 లక్షల ఇన్సూరెన్స్, మినిమమ్ వేజెస్, ఫీ రియంబర్స్ మెంట్, సింగరేణిలో పని చేస్తున్న కార్మికులకు వారి విద్యారత ఆదారంగా ఉద్యోగం, డిజిటల్ లైబ్రరీలు, ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్య తదితరాలకు ముఖ్యమంత్రి సహాయంతో కృషి చేస్తానని హామి ఇచ్చారు.