calender_icon.png 30 October, 2024 | 4:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్‌కు ఇచ్చింది మా భూమే

18-07-2024 01:25:54 AM

  1. కోకాపేటలో 11 ఎకరాల కేటాయింపు రద్దు చేయండి
  2. హైకోర్టులో ప్రైవేట్ వ్యక్తులు పిటిషన్

హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 11 ఎకరాల కేటాయిస్తూ చేసిన ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ సికింద్రాబాద్‌కు చెందిన ప్రైవేటు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. తమకు వారసత్వంగా వచ్చిన భూమిని బీఆర్‌ఎస్‌కు కేటాయిస్తూ ప్రభు త్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు.

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో సర్వే నెం.239, 240లో 11 ఎకరాలను అప్పగిస్తూ ప్రభుత్వం చేసిన ఒప్పందాన్ని రద్దు చేయాలని సికింద్రాబాద్‌కు చెందిన జే అశోక్‌దత్ జయశ్రీతో పాటు మరో ముగ్గురు కుటుంబసభ్యులు వేసిన పిటిషన్‌ను జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ లాయర్ మురళీ మనోహర్ వాదిస్తూ.. ఈ భూమిని పిటిషనర్లకు వారసత్వంగా వస్తున్నదని చెప్పారు. నవాబ్ నుస్రత్‌జంగ్.1 నుంచి వారసుల పవర్ ఆఫ్ అటార్నీ పొందిన జేహెచ్ కృష్ణమూర్తి నుంచి 1967లో పిటిషనర్ల పూర్వీకులు కొనుగోలు చేశారన్నారు. గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తమ భూమిని అప్పటి అధికార పార్టీ బీఆర్‌ఎస్‌కు కేటాయిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు.

తమకు రాజ్యాంగం కల్పించిన 300ఏ కింద ఆస్తి హక్కుకు భంగం కలిగించారన్నారు. 1950లో నవాబు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఇది ప్రభుత్వ భూమి కాదన్నారు. గత ఏడాది మే 23న బీఆర్‌ఎస్‌కు ప్రభుత్వం ఇచ్చిన కన్వేయన్స్ డీడ్‌ను రద్దు చేయాలని కోరారు. అంతేగాకుండా ఈ స్థలంలో ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకుండా అధికారులకు ఆదేశాలు జారీచేయాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఈ స్థలానికి చెందిన రిజిస్ట్రేషన్ పత్రాలతోపాటు ముంతకాబ్లను సమర్పించాలని పిటిషనర్ న్యాయవాదిని ఆదేశించారు. దీనిపై గురువారం విచారణ చేపట్టనున్నారు.