24-02-2025 12:00:00 AM
శృంగేరి శారదాపీఠ ఆస్థాన పౌరాణికులు డాక్టర్ గర్రెపల్లి మహేశ్వరశర్మ
జగిత్యాల, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): సాక్షాత్తు శ్రీమహావిష్ణువే ఆ పరమేశ్వరుని అర్చన చేసి తరించారని శృంగేరి శారదా పీఠ ఆస్థాన పౌరాణికులు డాక్టర్ గర్రెపల్లి మహేశ్వరశర్మ పేర్కొన్నారు. సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో కోరుట్ల వాసవి కళ్యాణ భవనంలో జరుగుతున్న శ్రీలింగ మహాపురాణ సప్తాహంలో భాగంగా ఆదివారం 5వ రోజు ప్రవచనం కొనసాగింది.
ఈ సందర్భంగా మహేశ్వరశర్మ ప్రవచిస్తూ కేవలం మానవులే కాదు సృష్టికర్త బ్రహ్మదేవుడు, సృష్టిని నడిపించే దశావతారాల మూల పురుషుడు విష్ణుమూర్తి కూడా ఆ శివున్ని పూజించారన్నారు. శ్రీమహావిష్ణువు ధరించే సుదర్శన చక్రం శివుడు విష్ణువుకి అనుగ్రహించిందేనని శ్రీలింగ మహాపురాణంలో చెప్పబడిందన్నారు. మోహిని అవతారంతో విష్ణుమూర్తి శివునికి అర్ధాంగిగా మారి సృష్టిని రక్షించే బాధ్యతను తీసుకున్నారన్నారు.
అందులో భాగమే రాక్షసుల నుండి అమృతాన్ని రక్షించడం, అయ్యప్ప స్వామి అవతారం అని మహేశ్వరశర్మ వివరించారు. త్రిపురాసురుని సంహారం మొదలుకొని ఎందరో రాక్షసులను అంతమొందించి, ధర్మాన్ని కాపాడే క్రమంలో విష్ణుమూర్తి, శివుని అనుగ్రహం పొందడం శాస్త్రాల్లో సవివరంగా చెప్పబడిందన్నారు. లింగ రూపంలో ఉన్న శివుణ్ణి పూజిస్తే సమస్త దేవీ, దేవతలందరినీ పూజించిన ఫలం కలుగుతుందని, అంతటి మహత్తు లింగరూపానికి ఉందన్నారు.
ప్రతిరోజూ ఎవరైతే క్రమం తప్పకుండా లింగ రూపంలో ఉన్న శివున్ని అర్చన చేస్తారో, వారి ఇంటిలో వ్యాపార, వ్యవహారంలో సుఖ, సంతోషాలకు లోటు ఉండదన్నారు. అందుకే ప్రతి ఇంటి ముందు ఉండే తులసి కోటలో శివలింగాన్ని పెట్టి పూజించడం సనాతన ధర్మంలో భాగంగా ఆచరణలో ఉందన్నారు.
శివార్చనలో భాగంగా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటిది పాశుపత రుద్రాభిషేకార్చనని, ఇవి 64 రకాల పాశుపత రుద్రాభిషేక విధానాలుగా లింగపురాణంలో వివరించబడిందని మహేశ్వరశర్మ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సనాతన ధర్మ ప్రచార సమితి ప్రధాన కార్యదర్శి బట్టు హరికృష్ణ, పురాణ కమిటీ చైర్మన్ పడిగెల శ్రీనివాస్, కన్వీనర్ మోటూరి రాజు, కోరుట్ల బార్ కౌన్సిల్ అధ్యక్షులు తన్నీరు శ్రీనివాసరావు, నిర్వాహకులు నీలి కాశీనాథ్, వొటారి చిన్న రాజన్న, మంచాల రాజలింగం, శక్కరి వెంకటేశ్వర్, రాచకొండ దేవభూమయ్య, పొద్దుటూరి జలంధర్, రుద్ర సుధాకర్, వనపర్తి చంద్రం, పల్లెర్ల మహేందర్’తో పాటూ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.